'బాహుబలి-2' హిందీ హక్కులకు భారీ ఆఫర్!
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి-2' షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నది. మండే ఎండల మధ్య షూటింగ్ స్పాట్‌లో కూలర్లు, ఏసీలు ప్రోడక్షన్ టీమ్ చిత్రీకరణను కొనసాగిస్తున్నట్టు తెలుస్తున్నది. ముందుగా అనుకున్నట్టే వచ్చే ఏడాది ఏప్రిల్ 14న 'బాహుబలి: ద కన్‌క్లూజన్'ను ఎట్టిపరిస్థితుల్లో విడుదల చేయాలని దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి కృతనిశ్చయంతో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబర్ నాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు.
దీంతో చిత్ర యూనిట్ మండే ఎండల్లోనూ షూటింగ్ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి మధ్య హై యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బాహుబలి-2' చిత్రయూనిట్‌కు రాజమౌళి ఒక నెల సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ సెలవు ముగిసిన వెంటనే సినిమా షూటింగ్ పునఃప్రారంభం కానుంది. ఈ బ్రేక్ తర్వాతనే సినిమాలో ప్రధాన యాక్షన్ ఘట్టమైన మహాయుద్దాన్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది.
రూ. 150 కోట్లకు హిందీ రైట్స్?
'బాహుబలి-2' హిందీ వెర్షన్ రైట్స్ పూర్తిగా ప్రఖ్యాత బాలీవుడ్ చిత్రనిర్మాణ యష్‌రాజ్ ఫిలిమ్స్‌కు అమ్మాలని ఆర్కా మీడియా భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పంపిణీ హక్కులు, హిందీ వెర్షన్ హక్కులు, శాటిలైట్ హక్కుల కోసం మొత్తంగా రూ. 150 కోట్లు చెల్లించడానికి యష్‌రాజ్ ఫిలిమ్స్ ముందుకొచ్చినట్టు చెప్తున్నారు. 'బాహుబలి: ద బిగినింగ్' హిందీ వెర్షన్ రూ. 100 కోట్లకుపైగా వసూలు చేసి పలు రికార్డులను బద్దలుకొట్టిన సంగతి తెలిసిందే.