Bronze statue
-
అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం ఆవిష్కరణ
తెలుగు సినిమా గర్వించే లెజెండరీ సీనియర్ నటులు, దివంగత పద్మశ్రీ డా.అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదివారం ఆయన 101వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు బిజినెస్ పార్క్‌లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య కుమారుడు, నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ–‘‘వెయ్యి సినిమాలకుపైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులు నాన్నగారు. తనదైన నటనతో యాభై ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఆయన తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖ, హీరో అల్లు శిరీష్‌తో పాటు అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
రూ.35 కోట్లు విలువ చేసే విగ్రహం చోరి.. అమెరికాలో ప్రత్యక్షం!
తిరువొత్తియూరు: తంజావూర్‌లోని ఓ ఆలయంలో 50 సంవత్సరాల క్రితం చోరీ జరిగిన రూ.35 కోట్లు విలువ చేసే త్రిపుర సంహారమూర్తి విగ్రహం అమెరికాలో ఉన్నట్టు కనుగొన్నారు. తంజావూరు జిల్లా వరత్తనాడు సమీపం ముత్తమ్మాల్‌పురంలో కాశీ విశ్వనాథస్వామి ఆలయం ఉంది. ఇక్కడ 50 ఏళ్ల క్రితం 83.3 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన త్రిపుర సంహారమూర్తి పంచలోహ విగ్రహం చోరీ జరిగింది. ఈ విగ్రహం రూ.35 కోట్లు చేస్తుందని తెలిసింది. పైగా ఈ విగ్రహానికి బదులుగా అదే రూపంలో మరో విగ్రహం తయారు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలో ఉంచినట్లు సందేహం రావ డంతో ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి సురేష్ ఈ విషయమై విగ్రహాల తరలింపు నిరోధక విభాగం పోలీసులకు 2020లో ఫిర్యాదు చేశాడు. దీంతో విగ్రహాల నిరోధక విభాగం కుంభకోణం ప్రత్యేక విభాగం డీఎస్పీ ముత్తు రాజ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. పుదువైలో వున్న ఫ్రెంచ్ సంస్థకు వెళ్లి అక్కడ ఆధారాలను నమోదు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇతర దేశాల్లో ఉన్న ఎగ్జిబిషన్లో చూస్తున్న సమయంలో తంజావూరులో చోరీకి గురైన త్రిపుర సంహారస్వామి పంచలోహ విగ్రహం అమెరికాలో ఎగ్జిబిషన్లో ఉన్నట్లు కనుగొన్నారు. దీనికి సంబంధించి అమెరికా నుంచి త్రిపుర సంహారమూర్తి విగ్రహాన్ని రాష్ట్రానికి తీసుకురావడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. -
శిల్పకళకు 'త్రీడీ' తళుకులు
తెనాలి: కాంస్య విగ్రహాలు, ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో గుర్తింపును పొందిన తెనాలి సూర్య శిల్పశాల శిల్పులు మరో అడుగు ముందుకేశారు. తమ నైపుణ్యానికి త్రీడీ టెక్నాలజీని ఆలంబనగా చేసుకుని మినీయేచర్ విగ్రహాల తయారీకి పూనుకున్నారు. ఇటీవల మృతిచెందిన కన్నడ సినిమా పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మినీయేచర్ విగ్రహాలను చేసి, శుక్రవారం విలేకరుల ముందు ప్రదర్శించారు. దేవాలయాల రూపశిల్పి అయిన తండ్రి నుంచి వారసత్వంగా శిల్పకళను అందిపుచ్చుకున్న కాటూరి వెంకటేశ్వరరావు తన పరిధిని విస్తరించారు. ఆలయాలు, రాజగోపురాల రూపకల్పనతోనే సరిపెట్టకుండా.. సిమెంటు, ఫైబర్, కాంస్యం వంటి విభిన్న పదార్థాలతో విగ్రహాలు తయారుచేస్తూ వచ్చారు. ఫైన్ఆర్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కొడుకు రవిచంద్ర కలిసిరావటంతో వారి సృజన ఎల్లలు దాటింది. ఐరన్ స్క్రాప్‌తో భారీ విగ్రహాలను తయారుచేసి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. తాజాగా కాటూరి వెంకటేశ్వరరావు రెండో కుమారుడు శ్రీహర్ష త్రీ–డీ టెక్నాలజీతో విగ్రహాల తయారీలో శిక్షణ పొందాడు. తమ శిల్పశాల ఆర్ట్ గ్యాలరీలో తొలిగా పునీత్ రాజ్‌కుమార్ మినీయేచర్ విగ్రహాలను చేశారు. బస్ట్ సైజు 12 అంగుళాల్లో, ఫుల్ సైజ్ 15 అంగుళాల ఎత్తులో వీటిని తయారు చేశారు. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇంట్లో, ఆఫీసుల్లో టేబుల్‌పై ఉంచుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్తగా చేస్తున్న ఈ మినీయేచర్ విగ్రహాలతో తమ శిల్పశాల ఖ్యాతి మరింతగా ఇనుమడిస్తుందని శిల్పి శ్రీహర్ష అన్నారు. -
పాక్‌లో రాజా రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం
లాహోర్: సిక్కు వర్గానికి చెందిన మహారాజా రంజిత్ సింగ్ కంచు విగ్రహాన్ని తెహ్రీక్ ఈ లబ్బైక్ పాకిస్తాన్ (టీఎల్పీ) కార్యకర్త ధ్వంసం చేశాడు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన లాహోర్ ఫోర్ట్ వద్ద ఈ విగ్రహం ఉంది. పలు నినాదాలు చేస్తూ, విగ్రహాన్ని ఓ వైపు నుంచి కూల్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం మరో వ్యక్తి వెళ్లి విగ్రహపు చేతిని ధ్వంసం చేయడం వీడియోలో కనిపించింది. 2019లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఎత్తు 9 అడుగులు ఉంటుంది. సిక్కు సంప్రదాయ రూపంతో కత్తి పట్టుకొని గుర్రం మీద మహారాజ రంజిత్ సింగ్ కూర్చొని ఉంటారు. దీనిపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సమాచార మంత్రి ఫవాద్ చౌధరి మాట్లాడుతూ.. ఇలాంటి నిరక్షరాస్యుల వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోతోందని వ్యాఖ్యానించారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ సలహాదారు షబ్నాజ్ గిల్ మాట్లాడుతూ, నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిందితున్ని ఇప్పటికే పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై భారత్ స్పందించింది. మైనారిటీల్లో భయం పోగొట్టడంలో పాక్ ప్రభుత్వం విఫలమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పాక్‌లో తరచుగా జరుగుతున్నాయని అన్నారు. విగ్రహాలు ధ్వంసం చేయడం ఇది మూడో ఘటన అని పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల్లో ఈ తీరు వల్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. -
Pet Love: ఇదేం విడ్డూరం, కుక్క మీద ప్రేమతో ఇలా కూడా చేస్తారా?
Bronze Statue of His Late Dog on 5th Death Anniversary సాక్షి, కృష్ణా: పెంపుడు జంతువులంటే చాలామందికి ప్రాణమన్న సంగతి తెలిసిందే. వాటికి ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పెంపుడు జంతువుల్లో ఎక్కువగా కుక్కును పెంచుకునేందుకు ఇష్టపడుతారు. దానికి ఏ చిన్న కష్టం వచ్చినా అల్లాడిపోతారు. ఒకవైళ ఆ పెంపుడు శునకం ప్రాణాలు విడిస్తే? ఇంకేమైనా ఉందా.. గుండెలు పగిలేలా విలపిస్తారు. కొన్ని రోజులు బాధపడతారు.. ఎంత బాధపడ్డ చనిపోయినది తిరిగి రాదని తెలిసి ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. మహా అయితే ఏడాదికోరోజు ఫోటోకు దండవేసి నివాళులర్పిస్తారు. అయితే విడ్డూరంగా తాను ప్రాణంగా చూసుకుంటున్న శునకం చనిపోతే కుక్కపై ఉన్న అభిమానాన్ని ఆ యజమాని వినూత్నంగా తెలియజేశాడు. అది ఎక్కడంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సుంకర జ్ఞానప్రకాశరావు అనే వ్యక్తి అమితమైన ప్రేమతో ఓ కుక్కను పెంచుకున్నాడు. దానికి శునకరాజు అని పేరుపెట్టడమే కాకుండా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. దురదృష్టవశాత్తు అది చనిపోయింది. అది ఈ లోకం విడిచి అయిదేళ్లయినా దాని జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడు. ఆ బాధను తట్టుకోలేక ప్రతి సంవత్సరం దానికి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే తమ పెంపుడు కుక్క జ్ఞాపకాలను మరచిపోలేని జ్ఞానప్రకాశరావు దానికి ఏకంగా కాంస్య విగ్రహం చేయించారు. 5వ వర్ధంతి సందర్భంగా శునకరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, శాస్త్రీయ బద్దంగా కుక్క ఆత్మకు శాంతి కలగాలని పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్క విగ్రహాన్ని పూలతో అలంకరించి పిండప్రదానం కూడా చేశారు. ఆ తర్వాత స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ రోజులు తమ కుటుంబంతో కలిసి జీవించిన సునకరాజు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మన అనుకున్న వాళ్లు చనిపోతేనే ఆఖరి చూపు చూసేందుకు కూడా కనీసం జనాలు రావడం లేదు. అలాంటిది చనిపోయిన పెంపుడు కుక్కపై ఇంత ప్రేమ ప్రదర్శించడం నిజంగా విచిత్రంగానే ఉంది. -
బతికుండగానే విగ్రహం! ఎందుకంటే..
ఏదో గొప్ప పనులు చేయడమో.. లేదంటే జనాలకు బాగా దగ్గర అయినవాళ్లు విగ్రహాలను రోడ్ల మీద చూస్తుంటాం. అలాంటిది ఓ కుక్కకు.. అదీ బతికుండగానే కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు వాయవ్య ఇంగ్లండ్‌లో. ఎందుకంటారా?.. లండన్: పదమూడేళ్ల మ్యాక్స్.. ఒక థెరపీ డాగ్. కుంబ్రియాలోని కెస్విక్లో అది జనాల ఆదరణ చురగొంటోంది. లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా అది పదివేల మందికి ప్రశాంతతను అందించింది. ఇందుకుగానూ ఈ ఫిబ్రవరిలో దానికి మెరిట్ సర్టిఫికెట్ కూడా అందించారు. ఇక ఇప్పుడు ఏకంగా విగ్రహం పెట్టించారు. ది మిరకిల్ డాగ్ అనే బిరుదును దీనికి ఇచ్చారు. ఆ ట్యాగ్ లైన్‌కు తగ్గట్లే మ్యాక్స్ అద్భుతాలు చేస్తుంది. పుట్టినరోజులకు గ్రీటింగ్స్ అందజేయడం, ఛారిటీ వాక్స్‌లో పాల్గొనడం, స్కూల్ పిల్లలతో సరదాగా ఆడుకోవడం, ఒంటరితనం భరించలేనివాళ్లతో కాసేపు గడపడం.. ఇలా అందరిలో ఆనందాన్ని నింపుతోంది. అంతేకాదు ఛారిటీల ద్వారా అది ఏకంగా మూడు లక్షల పౌండ్లు వసూలు చేయడం విశేషం. ఇక హోప్ పార్క్ బయట దాని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బహుశా బతికుండగానే ఈ గౌరవం అందుకున్న మొదటి మూగ జీవి ఇదేనేమోనని అక్కడి అధికారులు చెప్తున్నారు. రోడ్డు మీద నుంచి.. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో దానిని ఎవరో రోడ్డు మీద వదిలేశారు. 2008లో కెర్రీ ఇర్వింగ్ దానిని దత్తత తీసుకుని పెంచుకున్నాడు. 2016 నుంచి దానికి థెరపీ డాగ్ ట్రైనింగ్ ఇప్పించాడు కెర్రీ. కాగా, మ్యాక్స్ విగ్రహాన క్రిస్టీ అనే కళాకారుడు తయారు చేయగా.. సోఫి అనే పన్నెండేళ్ల చిన్నారి చేత మ్యాక్స్గాడి విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. చదవండి: ఎక్కడ చూసినా వేడి.. ఉక్కపోత! ఎందుకో తెలుసా? -
కల్నల్ సంతోష్ బాబు కాంస్య విగ్రహం ఆవిష్కరించిన కేటీఆర్
సాక్షి, సూర్యాపేట: గతేడాది గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్‌బాబు అమరుడైన సంగతి తెలిసిందే. ఆయన అమరత్వానికి ప్రతీకగా సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన 10 అడుగుల క్యాంస విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం కోర్ట్ చౌరస్తాకు కల్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌బాబు తల్లిదండ్రులతో పాటు ఆయన సతీమణి, ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య, చిరుమర్తి లింగయ్య యాదవ్‌లతో పాటు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పాల్గొన్నారు. ఇక మంగళవారం సూర్యాపేటలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. -
25 ఏళ్ల దిల్వాలే దుల్హనియా లేజాయేంగే
‘నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకో’ అంటుంది ఈ సినిమాలోని సిమ్రన్ పాత్ర పోషించిన కాజోల్ పసుప్పచ్చటి చేలలో. ‘అలా నిన్ను తీసుకెళ్లాలంటే ఇంత కష్టపడటం ఎందుకూ?’ అంటాడు రాజ్ పాత్రలో ఉన్న షారుక్ ఖాన్.. అప్పటికే ఆమె కోసం లండన్ వదిలి పంజాబ్‌లోని పల్లెకు చేరుకుని ఆమె కుటుంబం ఆదరణ పొందే ప్రయత్నంలో ఉంటూ. కాజోల్ తండ్రి అమ్రిష్ పురికి తన కుమార్తెను తన ప్రాంతంలో తన బంధువర్గంలో ఇచ్చి చేయాలని కోరిక. కాని ఆమె షారుక్‌ను ప్రేమించింది. షారుక్ కుటుంబం ఏమిటో అమ్రిష్ పురికి తెలియదు. వాళ్లు ఎలాంటివాళ్లో తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే కాజోల్ ప్రేమకు నో చెబుతాడు. నో చెప్పిన వెంటనే కాజోల్ షారుక్ పారిపోయి పెళ్లి చేసుకుని ఉంటే కథే లేదు. ‘మనకు మంచీ చెడు తెలుసు. మనకు ఏది సంతోషమో దానిని ఎంచుకోగలం. ఆ ఎంచుకున్నదానిని కుటుంబంలో భాగం చేయగలం. అంతవరకు ఓపికగా ఉండగలం’ అని రాజ్, సిమ్రన్ నమ్మడం వల్లే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ భారతీయులకు అంతగా నచ్చింది. అక్టోబర్ 20, 1995లో రిలీజయ్యింది ఆ సినిమా. ఆ తర్వాత అది సృష్టించిందంతా చరిత్రే. కథ కొత్తది కాజోల్ లండన్‌లో ఉంటుంది. షారుక్ కూడా లండన్‌లోనే ఉంటాడు. కాజోల్ తండ్రి చాటు బిడ్డ. షారుక్ తండ్రిని స్నేహితుడుగా భావించే కుర్రవాడు. ఒకరికొకరు పరిచయం లేని వీళ్లిద్దరూ తమ గ్రాడ్యుయేషన్ అయిపోయాక విడివిడిగా విహారం కోసం యూరప్ యాత్రకు బయలుదేరి ట్రైన్లో పరిచయం అవుతారు. అప్పటికే కాజోల్కు పెళ్లి మాట నడిచి ఉంటుంది. పంజాబ్‌లో కుర్రాడున్నాడని తండ్రి చెప్పేసి ఉంటాడు. కాని ఆమె షారుక్‌తో ప్రేమలో పడుతుంది. షారుక్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. కాని తండ్రి దీనిని అంగీకరించడు. వెంటనే కుటుంబాన్ని పంజాబ్‌కు మార్చి పెళ్లి పనులు మొదలెడతాడు. ఆమె కోసం షారుక్ పెళ్లికొడుకు స్నేహితుడిగా విడిది ఇంట్లో అడుగుపెట్టి కాజోల్ తల్లిదండ్రులను ఒప్పించి కాజోల్‌ను తనతో పాటు తీసుకువెళ్లడమే కథ. దీనికి ముందు హిందీలో వచ్చిన ‘ఏక్ దూజే కే లియే’, ‘కయామత్ సే కయామత్ తక్’ లాంటి ప్రేమ కథలు విషాదంతాలు. కాని ఇది సుఖాంతం. కుటుంబంతో పాటు సుఖాంతం. తారలు పుట్టిన వేళ బాలీవుడ్లో ఖాన్ త్రయం ఆమిర్, సల్మాన్, షారుక్ ఎస్టాబ్లిష్ అవుతున్న కాలం అది. షారుక్– కాజోల్ కలిసి అప్పటికే ‘బాజీగర్’, ‘కరణ్–అర్జున్’లలో నటించారు. కాని ఇంకా స్టార్డమ్ రాలేదు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పగ్గాలు యశ్ చోప్రా నుంచి అతని కుమారుడు ఆదిత్యా చోప్రా అందుకుంటూ మొదటిసారిగా ఒక కథ రాసి తండ్రికి వినిపించి డైరెక్ట్ చేయమన్నాడు. ‘కథ బాగుంది. నువ్వే చెయ్’ అని తండ్రి ప్రోత్సహించాడు. ఆ కథే ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. ఈ సినిమాకు హీరోగా షారుక్‌ను అడిగితే అప్పటికి ‘డిఫరెంట్ రోల్స్’ చేయాలని కోరుకుంటున్న షారుక్ కాదన్నాడు. ‘నువ్వు స్టార్‌వి కావాలంటే ప్రతి స్త్రీ మనసు దోచే, ప్రతి తల్లి హర్షించే ఇలాంటి రోల్ చేయాలి. ఆలోచించుకో’ అని ఆదిత్య చెప్పాక ఒప్పుకున్నాడు. సినిమా సూపర్‌హిట్ అయ్యాక షారుక్ పదే పదే యశ్‌రాజ్ ఫిల్మ్స్‌కు కృతజ్ఞతలు చెప్పాడు ఈ సినిమా ఇచ్చినందుకు. కాజోల్ కథ విన్నాక వెంటనే ఒప్పుకుంది. సినిమా రిలీజయ్యాక వీరి జోడి ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన జోడీగా నిలిచింది. అందరూ తలో చేయి ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ కథను ఆదిత్యా చోప్రా మూడేళ్లు రాశాడు. మొదట ఇది ఒక అమెరికన్, ఒక ఇండియన్ ప్రేమ కథ అనుకున్నాడు. కాని యశ్ చోప్రా సూచనతో హీరో హీరోయిన్లను ఎన్ఆర్ఐలుగా మార్చాడు. ఈ కథా తయారీలో ఆదిత్య దగ్గరి బంధువు, ఇప్పటి ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ పాల్గొన్నాడు. సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. సంగీత దర్శకులుగా జతిన్–లలిత్ సూపర్‌హిట్ పాటలు ఇచ్చారు. ఆనంద్ బక్షీ వాటిని రాశాడు. కెమెరా మన్మోహన్ సింగ్. కాస్ట్యూమ్స్ మనీష్ మల్హోత్రా. సినిమాకు టైటిల్‌ని కిరణ్ ఖేర్ సూచించింది. ‘చోర్ మచాయేంగే షోర్’ సినిమాలోని ‘లేజాయేంగే లేజాయేంగే’ పాటలోని లైన్ ఇది. టైటిల్ సూచించినందుకు ఆమె పేరును టైటిల్స్‌లో వేశారు కూడా. రిలీజయ్యాక.. ఈ సినిమా బడ్జెట్ ఆ రోజుల్లో 4 కోట్లు. కాని ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? 250 కోట్లు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ ఒక్క సినిమాతో నేటికీ దేశంలోనే నెం.1 ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచి ఉంది. ‘అందరూ పదే పదే చూసే సినిమాగా తీయాలి’ అనుకుని దర్శకుడు తీయడం వల్లే ఇది సాధ్యమైంది. ‘షోలే’ ముంబైలోని మినర్వా థియేటర్లో ఐదేళ్లే ఆడింది. కాని ఈ సినిమా లాక్డౌన్ వరకూ కూడా అంటే గత పాతికేళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో మ్యాట్నీగా లేదంటే మార్నింగ్ షోగా ఆడుతూనే ఉంది. 25 వారాలంటే సిల్వర్ జూబ్లీ. కాని ఈ సినిమా 2014లో వేయి వారాలు దాటింది. పాటలు.. సన్నివేశాలు కాజోల్ మీద తీసిన ‘మేరే ఖ్వాబోమే జో ఆయే’, షారుక్–కాజోల్‌ల మీద ఆవాల చేలలో తీసిన ‘తుజే దేఖాహై’, ఖవాలీ స్టైల్లో తీసిన ‘మెహందీ లాగా కే రఖ్నా’... ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. క్లయిమాక్స్‌లో కాజోల్ తండ్రి చేయి వదిలి షారుక్‌ను అందుకోవడానికి ప్లాట్‌ఫామ్‌పై పరిగెత్తే సీన్ అనేక సినిమాలలో సీరియస్‌గా, స్పూఫ్గా రిపీట్ అయ్యింది. ఈ సినిమాతోనే విదేశాలలో ఉన్న ఎన్ఆర్ఐలు కథల్లో భాగం కావడం మొదలైంది. ఇవాళ్టికీ టీవీలో కోట్లాది మహిళా ప్రేక్షకుల, యవతీ యువకుల ప్రియమైన సినిమా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. అరుదైన గౌరవం ‘దిల్వాలే....’ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఎన్నో అరుదైన రికార్డులు సృష్టిస్తూనే వస్తోంది. అయితే 25 ఏళ్ల సందర్భంగా ఓ కొత్త గౌరవం దక్కించుకుంది. లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’లో షారుక్, కాజోల్ పాత్రల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఈ యానివర్సరీని పురస్కరించుకుని ప్రకటించారు. బాలీవుడ్‌కి సంబంధించి లండన్‌లోని ‘సీన్స్ ఇన్ ది స్క్వేర్’లో ఏర్పాటు చేయనున్న తొలి విగ్రహాలు ఈ సినిమాకు సంబంధించినవే కావడం విశేషం. ‘ఇది ఈ సినిమాకు దక్కిన గౌరవం’ అని చిత్రబృందం తెలిపింది. పలు ప్రముఖ హాలీవుడ్ చిత్రాల బొమ్మల చెంత మన ‘దిల్వాలే..’ చేరనుండడం భారతీయ సినిమాకు దక్కిన మంచి గౌరవం. – సాక్షి ఫ్యామిలీ -
కల్నల్ సంతోష్‌కు కాంస్య విగ్రహం
సాక్షి, సూర్యాపేట : భారత్, చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలను సైనిక అధికార లాంఛనాలతో నిర్వహించారు. సూర్యాపేట కేసారంలోని సంతోష్ బాబు వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగింది. సంతోష్‌బాబు దహన సంస్కారాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్య సభ ఎంపీ బడుగుల లింగయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసన సభ్యులు గాదరి కిషోర్ , సైది రెడ్డి , చిరుమర్తి లింగయ్య , మాజీ ఎంపీ బూర నర్సయ్య , మాజీ కేంద్ర రక్షణ శాఖా మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. (చదవండి : ముగిసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు) సంతోష్‌ను కడసారి చూసేందుకు దారి పొడవునా భౌతికదూరం పాటిస్తూనే ప్రజలు సెల్యూట్ చేస్తూ ఘన నివాళి అర్పించారు. దహన సంస్కారాల ముగిసిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంతోష్ భార్యకు ఉద్యోగం ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. అంత్యక్రియలు జరిగిన చోట సంతోష్ స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సూర్యాపేట కూడలిలో కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు, నగరంలోని ఓ సర్కిల్‌కు సంతోష్ పేరు పెడుతామని మంత్రి జగదీశ్ వెల్లడించారు. -
విజయనిర్మల నా భార్య కావడం నా అదృష్టం
‘‘విజయనిర్మల ఐదారు సినిమాల్లో నటించాక డైరెక్ట్ చేస్తానంది.. వంద సినిమాల్లో నటించి, ఆ తర్వాత డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్నాను. ఆమె అలానే చేసింది’’ అని నటుడు కృష్ణ అన్నారు. గురువారం నటి, దర్శక–నిర్మాత విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్‌రామ్‌గూడలోని కృష్ణ– విజయనిర్మల నివాసంలో ఏర్పాటు చేసిన విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని కృష్ణ ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని డైరెక్టర్ నందినీరెడ్డికి నటుడు కృష్ణంరాజు, హీరో మహేష్‌బాబు అందించారు. కృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయ నిర్మల దర్శకత్వం వహించిన మొదటి మలయాళ సినిమా ‘కవిత’ అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో తీసిన ‘మీనా’ వందరోజులు ఆడింది. మొత్తం 46 సినిమాలకు దర్శకత్వం వహిస్తే అందులో 95 శాతం హిట్ సినిమాలే. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘విజయ నిర్మల విజయాల్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘విజయ నిర్మల గారు 50 సినిమాలకి దర్శకత్వం వహించడం ఓ చరిత్ర’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ. మహేష్ బాబు మాట్లాడుతూ– ‘‘నా సినిమాల మొదటి ఆట చూసి నాన్నగారు నాతో మాట్లాడేవారు. తర్వాత విజయనిర్మలగారు మాట్లాడి అభినందనలు చెప్పేవారు. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల తర్వాత నాన్నగారు అభినందించారు.. తర్వాత ఆవిడ మాట్లాడబోతుందనుకుని వెంటనే ‘ఆమె లేరు కదా’ అనే విషయాన్ని రియలైజ్ అయ్యాను. ఆ రోజు ఆ లోటు కనిపించింది’’ అన్నారు. ‘‘మా అమ్మ పేరున నటీనటులకు ప్రతి సంవత్సరం అవార్డు అందించనున్నాం’’ అన్నారు నరేష్ విజయకృష్ణ. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. -
నన్ను పెద్ద కొడుకు అనేవారు
‘‘నాకు నటుడిగా జన్మనిచ్చిన తండ్రి దాసరి అయితే నా కుటుంబానికి నెత్తిన పాలు పోసింది ఈ క్షీరపురి ప్రజలే’’ అని ప్రముఖ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దర్శకరత్న డా. దాసరి నారాయణరావు కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా స్థానిక గాంధీబొమ్మల సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దాసరి నారాయణరావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోహన్ బాబు మాట్లాడుతూ – ‘‘గురువు గారు దాసరి నారాయణరావు ‘నాకు ఏదైనా అయితే నా పెద్ద కొడుకు మోహన్ బాబు ఉన్నాడు’ అనేవారు. సినీ నటుడిగా జన్మనిచ్చిన తండ్రి విగ్రహాన్ని ప్రారంభించడం ఎంతో ఆవేదనతో కూడినది. నా తల్లిదండ్రుల సాక్షిగా చెబుతున్నాను.. ఈ కార్యక్రమానికి నేను ఆనందంతో రాలేదు. ఎంతో బాధతో తప్పని పరిస్థితుల్లో వచ్చాను. భక్తవత్సలంనాయుడు నామకరణంతో ఇండస్ట్రీలో ప్రవేశించిన నాకు 1975లో మోహన్ బాబుగా పేరు పెట్టారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్ గా, హీరోగా ఇలా అనేక క్యారెక్టర్లకు ఎంపిక చేసి నాకెంతో గుర్తింపును తీసుకువచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్‌ల పక్కన నటించే చాన్స్ కల్పించారు. ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోవాలా అని ఆయన బతికుండగానే నేను స్థాపించిన శ్రీ విద్యానికేతన్ లో దాసరి పేరున ఆడిటోరియాన్ని నిర్మించి ఆయనకు అంకితమిచ్చాను. పదిమందికి ఉపయోగపడి భారతదేశంలో చరిత్ర సృష్టించిన వ్యక్తి దాసరి. నటుడిని శాసించిన వ్యక్తి. కొమ్ములు తిరిగిన నటుడైనా దాసరి వద్దకు వచ్చి మీ సినిమాలో నాకు ఒక చాన్సు ఇవ్వండని అడిగారే తప్ప నా వద్ద కథ ఉంది.. నా సినిమాలో పనిచేస్తారా అని ఏ నటుడినీ అడగని దర్శకుడు. ఇలాంటి మహానుభావుడికి ప్రభుత్వం 5 గజాల స్థలం కూడా ఇవ్వలేదు. ఆయన ఎప్పుడూ ఎవరి వద్దకూ వెళ్లి గజం స్థలం అడగలేదు. గతంలో పాలకొల్లులో లలితకళాంజలి కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒక మాట ఇచ్చాను. ఏటా ఒక విద్యార్థికి నా పాఠశాలలో 4వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకూ ఉచితంగా విద్యనందిస్తానని చెప్పాను. ఆ మాట ఎప్పుడూ నిలబెట్టుకుంటాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు, తణుకు వైఎస్సార్ సీపీ కన్వీనర్లు గుణ్ణం నాగబాబు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్, ఎంపీలు గోకరాజు గంగరాజు, ఎం.మురళీమోహన్, సినీ ప్రముఖులు సి.కళ్యాణ్, రవిరాజా పినిశెట్టి, దవళ సత్యం, రేలంగి నరసింహారావు, దాసరి కుమారుడు తారకప్రభు, సోదరులు దాసరి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, పలువురు నిర్మాతలు, దర్శకులు, నటులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే గుదిబండి వెంకటరెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ
-
జన సందోహం
► అమ్మ సమాధి వద్దకు అభిమాన సందోహం ►వాటర్ బాటిళ్లు, అల్పాహారం పంపిణీ ►నిఘా కట్టుదిట్టం ►కమిషనర్ జార్జ్ పర్యవేక్షణ ►కాంస్య విగ్రహం ఏర్పాటుకు కసరత్తులు అమ్మ జయలలిత సమాధిని దర్శించుకునేందుకు అభిమాన, ప్రజా సందోహం తండోపతండాలుగా మెరీనాతీరానికి తరలి వస్తున్నారు. అభిమానుల తాకిడి మూడో రోజుగా గురువారం మరింత పెరగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. బారికేడ్ల ద్వారా క్యూలైన్ ఏర్పాటు చేసి, తోపులాటకు అవకాశం ఇవ్వకుండా తగు చర్యల్ని అన్నాడీఎంకే వర్గాలు, అధికార వర్గాలు చేపట్టారుు. ఇక, అభిమాన, జన సందోహానికి వాటర్ బాటిళ్లు, ప్యాకెట్లు, అల్పాహారం అందించే పనిలో జయ పేరవై వర్గాలు నిమగ్నమయ్యారుు. - సాక్షి, చెన్నై సాక్షి, చెన్నై: మహానాయకురాలు అమ్మ జయలలిత భౌతికంగా అందర్నీ వీడి గురువారంతో నాలుగు రోజులైంది. ఆమెను తలుచుకుంటూ లక్షలాది హృదయాలు అమ్మ..అమ్మ అని రోదిస్తున్నారు. మరెన్నో లక్షలాది హృదయాలు మళ్లీ రావమ్మా ...అంటూ తమ తంగ తాయ్(బంగారు తల్లి)ని తలచుకుంటూ కన్నీటి పర్యంతంలో మునిగారు. పదుల సంఖ్యలో మరెన్నో హృదయాలు బరువెక్కి, చివరకు అమ్మా నీ వెంటే అన్నట్టు మృత్యు ఒడిలోకి చేరుతున్నారుు. బుధవారం నాటికి 77 మంది అమ్మ కోసం గుండె పగిలి మరణించగా, గురువారం మరో తొమ్మిది గుండెలు ఆగారుు. ఇక, అమ్మ భౌతిక కాయాన్ని దగ్గరుండి దర్శించుకోలేని పరిస్థితి నెలకొనడంతో, ప్రస్తుతం ఆమె సమాధికి చేరువలో చేరి అభిమాన లోకం తమ ఆవేదనను, తమ గుండెల్లోని బాధను దిగ మింగుకోలేక బోరుమని విలపిస్తున్నారుు. మెరీనా తీరంలో రాజకీయ గురువు దివంగత ఎంజీఆర్ సమాధికి కూత వేటు దూరంలో శాశ్వత నిద్రలో ఉన్న అమ్మ సమాధిని దర్శించుకునేందుకు అభిమాన, జన సందోహం తండోప తండాలుగా పోటెత్తే పనిలో పడ్డారు. మూడో రోజుగా వేలాది మంది తరలిరావడంతో వారిని కట్టడి చేయడానికి అన్నాడీఎంకే వర్గాలు, పోలీసులు ఆగమేఘాలపై ప్రత్యేక ఏర్పాటు చేయాల్సి వచ్చింది. చెన్నై, శివారుల నుంచే కాదు, రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి కొందరు తమ సొంత వాహనాల్లో, మరి కొందరు రైళ్లల్లో, ఇంకొందరు బస్సుల్లో తరలి వచ్చి అమ్మ సమాధిని దర్శించుకొని కన్నీటి పర్యంతంతో నివాళులర్పిస్తున్నారు. కొందరు అరుుతే, చేతిలో అమ్మ చిత్ర పటాలను, మరి కొందరు అమ్మ ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఊరేగింపుగా సమాధి వద్దకు పోటెత్తుతున్నారు. కొందరు శిరోముండనం చేరుుంచుకుంటున్నారు. మరి కొందరు చేతిలో కర్పూరం వెలిగించి పురట్చి తలైవీ సమాధి వైపుగా హారతి పడుతున్నారు. వృద్ధులు, పిల్లలు సైతం అమ్మా మళ్లీ ఓ సారి రావా..? అమ్మా నీ లోటు మాకు తీర్చేదెవ్వరో..?అని విలపిస్తున్నారు. నిఘా కట్టుదిట్టం: నిత్యం జన, అభిమాన సందోహం మెరీనా వైపుగా పోటెత్తుతుండడంతో అన్నాడీఎంకే వర్గాలు, పోలీసు యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. మంత్రి ఆర్బీ.ఉదయకుమార్, ఎమ్మెల్యే అలెగ్జాండర్ నేతృత్వంలో అన్నాడీఎంకే కార్యకర్తలు స్వచ్ఛందంగా అమ్మ సమాధి వద్దకు వస్తున్న జన సందోహం కోసం వాటార్ బాటిళ్లు, ప్యాకెట్లు, కిచిడి, పొంగల్, సాంబారు అన్నం వంటి వాటిని ఉచితంగా పంపిణీ చేయడం విశేషం. ఇక, జనం ఒకేసారిగా సమాధి వైపు దూసుకు రాకుండా, పకడ్బందీ చర్యలు చేపట్టారు. బారికేడ్లను ఏర్పాటు చేసి, క్యూలైన్ ద్వారా లోనికి అనుమతించే పనిలో పడ్డారు. సమాధి వద్ద రెండు వందల మంది భద్రతా సిబ్బంది నియమించారు. ఆ పరిసరాల్లో ట్రాఫిక్ కష్టాలు, జనం తోపులాటకు ఆస్కారం ఇవ్వకుండా మరింతగా సిబ్బందిని నియమించారు. రోడ్డుపైన వాహనాలు ఆగకుండా, నిలపకుండా, తగు చర్యలు తీసుకున్నారు. అన్ని వాహనాలు మెరీనా బీచ్‌లోని పార్కింగ్ వైపుగా మళ్లించేందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు కమిషనర్ జార్జ్ అక్కడికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కాంస్య విగ్రహం: సీఎం జయలలిత సమాధి వద్ద ఆగమేఘాలపై ఏర్పాట్లు సాగుతున్నారుు. సమాధి చుట్టూ సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు . అమ్మ సమాధిని దర్శించేందుకు వస్తున్న జనం ఓ వైపు రాక, మరో వైపు బయటకు వెళ్లేందుకు తగ్గట్టు చర్యలు తీసుకున్నారు. జనం ఎవ్వరూ ఆ పరిసరాల్లోనే తిష్ట వేయడానికి వీలు లేని విధంగా ముందుకు సాగేందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. ఎంజీఆర్ సమాధి సందర్శన, అక్కడి నుంచి అమ్మ సమాధి వైపుగా క్యూలను ఏర్పాటు చేశారు.ఇక, సమాధి వద్ద అమ్మ కాంస్య విగ్రహాన్ని ఒకటి రెండురోజుల్లో ఏర్పాటు చేయనున్నారు. అలాగే, నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని పార్టీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయడానికి తగ్గ కసరత్తుల్ని అన్నాడీఎంకే వర్గాలు వేగవంతం చేశారుు. -
కృష్ణుడి రూపంలో 13 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం
కొత్తపేట : విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా ఖ్యాతినందిన మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని రూపొందించనున్నట్టు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను రూపొందించి న అదే తరహా విగ్రహాన్ని అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వెస్ట్ కొవిన్(కాలిఫోర్నియా)లో నెలకొల్పేందుకు ఇప్పటికే తరలించినట్టు చెప్పారు. ఆ విగ్రహం ఫొటోను ‘సాక్షి’లో చూసిన రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ అలాంటిదే రాజమండ్రిలో పుష్కరఘాట్ వద్ద పాత, కొత్త రైలు వంతెనల మధ్య నెలకొల్పాలని ప్రతిపాదించగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారని తెలిపారు. విగ్రహం రూపకల్పనకు ఎంపీఆర్డర్ ఇచ్చారని, దానికయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. సుమారు 12 అడుగుల పెడెస్టల్‌పై విగ్రహాన్ని నెలకొల్పే చోటును ఇప్పటికే ఎంపీ మురళీమోహన్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కలిసి పరిశీలించినట్టు తెలిపారు. -
పూలే విగ్రహానికి స్థలం కరువు!
ఇందూరు, న్యూస్‌లైన్ : ఓ మహనీ యుని విగ్రహం ఏ ర్పాటుకే జిల్లా కేం ద్రంలో స్థలం కరువైంది. మూడేళ్ల క్రితమే జిల్లాకు ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహాన్ని మంజూరు చేసిం ది.అయితే ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి కారణంగా ఇప్పటివరకు ఆవిష్కరణకు నో చుకో లేదు. విగ్రహ ఏ ర్పాటు కోసం విడుద ల చేసిన రూ. 4 లక్షల 25 వేలు బ్యాంకులోనే మూలుగుతున్నాయి. 2011 నుంచి జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు జ్యోతిరావు పూలే విగ్ర హ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ని జామాబాద్ కార్పొరేషన్ అధికారులకు ఆ దేశాలు జారీ చేశారు. కలెక్టర్లు బదిలీలపై వెళ్లిపోయారు గానీ అధికారులు ఇంత వరకు స్థలాన్ని చూపించలేక పోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు రెండేళ్లుగా పూలే వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో స్పందన రావడం లేదు. గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వరప్రసాద్, క్రిస్టీనా జెడ్ చొంగ్తూలు జిల్లా కేంద్రంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటుకు చేస్తామని హామీ ఇచ్చారు.అయితే వారు బదిలీపై వెళ్లిపోయారు. శుక్రవారం జ్యోతిరావు పూలే 188వ జయంతిని నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ చౌరస్తాలో గల అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రద్యుమ్న హయాంలోనైనా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కావాలని దళిత సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.