మహేష్‌బాబు, కృష్ణ, నరేష్, కృష్ణంరాజు
‘‘విజయనిర్మల ఐదారు సినిమాల్లో నటించాక డైరెక్ట్ చేస్తానంది.. వంద సినిమాల్లో నటించి, ఆ తర్వాత డైరెక్ట్ చేస్తే బాగుంటుందన్నాను. ఆమె అలానే చేసింది’’ అని నటుడు కృష్ణ అన్నారు. గురువారం నటి, దర్శక–నిర్మాత విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్‌రామ్‌గూడలోని కృష్ణ– విజయనిర్మల నివాసంలో ఏర్పాటు చేసిన విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని కృష్ణ ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని డైరెక్టర్ నందినీరెడ్డికి నటుడు కృష్ణంరాజు, హీరో మహేష్‌బాబు అందించారు.
కృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయ నిర్మల దర్శకత్వం వహించిన మొదటి మలయాళ సినిమా ‘కవిత’ అద్భుతమైన విజయం సాధించింది. ఆ తర్వాత తెలుగులో తీసిన ‘మీనా’ వందరోజులు ఆడింది. మొత్తం 46 సినిమాలకు దర్శకత్వం వహిస్తే అందులో 95 శాతం హిట్ సినిమాలే. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం’’ అన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ– ‘‘విజయ నిర్మల విజయాల్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘విజయ నిర్మల గారు 50 సినిమాలకి దర్శకత్వం వహించడం ఓ చరిత్ర’’ అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.
మహేష్ బాబు మాట్లాడుతూ– ‘‘నా సినిమాల మొదటి ఆట చూసి నాన్నగారు నాతో మాట్లాడేవారు. తర్వాత విజయనిర్మలగారు మాట్లాడి అభినందనలు చెప్పేవారు. ‘సరిలేరు నీకెవ్వరు’ విడుదల తర్వాత నాన్నగారు అభినందించారు.. తర్వాత ఆవిడ మాట్లాడబోతుందనుకుని వెంటనే ‘ఆమె లేరు కదా’ అనే విషయాన్ని రియలైజ్ అయ్యాను. ఆ రోజు ఆ లోటు కనిపించింది’’ అన్నారు. ‘‘మా అమ్మ పేరున నటీనటులకు ప్రతి సంవత్సరం అవార్డు అందించనున్నాం’’ అన్నారు నరేష్ విజయకృష్ణ.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment