
సాక్షి, హైదరాబాద్ : గురువారం మృతి చెందిన సినీ దిగ్గజం విజయనిర్మల అంత్యక్రియలు చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్‌లో ముగిశాయి. కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు సమక్షంలో కుమారుడు నరేష్.. విజయనిర్మల చితికి నిప్పటించారు. శుక్రవారం ఉదయం వరకు అభిమానుల సందర్శనార్థం నానక్‌రామ్ గూడ నివాసంలో విజయనిర్మల పార్థివ దేహాన్ని ఉంచారు. ఆమె ఇంటి నుంచి పార్థి దేహాన్ని ఫిలిం చాంబర్‌కు తీసుకువచ్చి అక్కడ కాసేపు ఉంచి తరువాత విజయకృష్ణ గార్డెన్‌కు తరలించారు. తమ అభిమాన నటి కడసారి చూపు కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు అశ్రునయనాలతో విజయనిర్మలకు తుది వీడ్కోలు పలికారు.