విజయనిర్మల ఈ పేరు తెలుగువారి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే అంతలా తన పేరు తెలుగు సినీ పరిశ్రమలో లిఖించుకున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా వెండితెరపై మెరిశారు. తన ఏడో ఏటనే మత్స్యరేఖ అనే సినిమా ద్వారా బాల్యంలోనే సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు.
1971లో మీనా చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 42 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం.
కృష్ణతో వివాహం
ప్రముఖ చిత్రకారుడు బాపు దర్శకుడిగా అవతారమెత్తిన తొలి చిత్రం సాక్షి. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ, హీరోయిన్ విజయ నిర్మల జంటగా నటించారు. ఎన్నో హిట్ సినిమాల్లో జంటగా నటించిన వీరు రియల్ లైఫ్‌లోనూ దంపతులుగా మారారు. కృష్ణ- విజయ నిర్మల 1969లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహం కాగా.. అయితే కృష్ణగారి కుటుంబాన్ని ఎలా ఒప్పించారన్న ప్రశ్నకు విజయనిర్మల గతంలో ఓ ఇంటర్వ్యూలో సమాధానమిచ్చారు.
మొదటి నుంచీ మా జంట అంటే జనాలకు చాలా ఇష్టమని.. అందుకే కృష్ణ ఫ్యామిలీ కూడా మా ప్రేమను అంగీకరించారని తెలిపింది. అంతకుముందే విజయ నిర్మలకు కేఎస్ మూర్తితో వివాహం జరిగింది. వీరికి నరేశ్ సంతానం. ఆమె జూన్ 27న 2019లో కన్నుమూశారు. కాగా.. గతేడాది నవంబర్‌లో కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే.
ఎటు చూసిన అవార్డులే
అయితే హైదరాబాద్‌లోని ఆమె ఇంటిని మీరెప్పుడైనా చూశారా? హైదరాబాద్‌లోని నానక్‌రామ్ గూడలో దాదాపు 12 ఏకరాల్లో ఆమె ఇంటిని నిర్మించారు. అప్పట్లోనే డైరెక్టర్‌గా తెలుగులో మంచి గుర్తింపు ఉండేది. అంతలా పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న ఆమె ఇల్లు కూడా అవార్డులతో నిండిపోయింది. ఆమె అక్కడే సూపర్ స్టార్ కృష్ణతో కలిసి ఉండేవారు. ఈ ఇంట్లో ప్రస్తుతం నరేశ్, ఆయన కుమారుడు నవీన్ ఉంటున్నారు. ఆమె ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అప్పట్లోనే గార్డెన్‌తో అన్ని రకాల వసతులతో నిర్మించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఆమె విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్టించారు. అంతే కాకుండా ఆమెకు గిన్నిస్ అవార్డ్ వచ్చిన విషయాన్ని శిలాఫలకం తయారు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment