
సాక్షి, సూర్యాపేట : భారత్, చైనా సరిహద్దులో వీర మరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు అంత్యక్రియలను సైనిక అధికార లాంఛనాలతో నిర్వహించారు. సూర్యాపేట కేసారంలోని సంతోష్ బాబు వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగింది. సంతోష్‌బాబు దహన సంస్కారాలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్య సభ ఎంపీ బడుగుల లింగయ్య, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసన సభ్యులు గాదరి కిషోర్ , సైది రెడ్డి , చిరుమర్తి లింగయ్య , మాజీ ఎంపీ బూర నర్సయ్య , మాజీ కేంద్ర రక్షణ శాఖా మంత్రి పల్లంరాజు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.
(చదవండి : ముగిసిన కల్నల్ సంతోష్ అంత్యక్రియలు)
సంతోష్‌ను కడసారి చూసేందుకు దారి పొడవునా భౌతికదూరం పాటిస్తూనే ప్రజలు సెల్యూట్ చేస్తూ ఘన నివాళి అర్పించారు. దహన సంస్కారాల ముగిసిన అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంతోష్ భార్యకు ఉద్యోగం ఇవ్వడానికి సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. అంత్యక్రియలు జరిగిన చోట సంతోష్ స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే సూర్యాపేట కూడలిలో కాంస్య విగ్రహం ఏర్పాటుతో పాటు, నగరంలోని ఓ సర్కిల్‌కు సంతోష్ పేరు పెడుతామని మంత్రి జగదీశ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment