అండగా ఉంటా: సీఎం కేసీఆర్‌ | CM KCR Meets Martyr Colonel Santhosh Babu Family in suryapet | Sakshi
Sakshi News home page

అండగా ఉంటా: సీఎం కేసీఆర్‌

Published Tue, Jun 23 2020 1:00 AM | Last Updated on Tue, Jun 23 2020 10:55 AM

CM KCR Meets Martyr Colonel Santhosh Babu Family in suryapet - Sakshi

సోమవారం కల్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషికి చెక్కు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌. చిత్రంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్, సంతోష్‌బాబు తల్లిదండ్రులు

సాక్షి, సూర్యాపేట: ‘కల్నల్‌ సంతోష్‌బాబు మరణం నన్ను ఎం తగానో కలచివేసింది. దేశ రక్షణ కోసం ఆయన ప్రాణత్యాగం చేశారు. ఇంతటి త్యాగం చేసిన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉం టుంది’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కల్నల్‌ కుటుంబానికి భరోసా ఇచ్చారు. సరిహద్దులో చైనా దాడిలో వీరమరణం పొందిన సూర్యాపేటవాసి కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ సోమవారం మధ్యాహ్నం 3:40 గంటలకు సూర్యాపేటలోని సంతోష్‌బాబు నివాసానికి చేరుకున్నారు. ముం దుగా కల్నల్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

ఆ తర్వాత మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌లతో కలసి కల్నల్‌ సతీమణి సంతోషి, పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్, తల్లి దండ్రులు ఉపేందర్, మంజుల, చెల్లెలు శృతితో కేసీఆర్‌ మాట్లాడి వారిని ఓదార్చారు. దేశం కోసం సంతోష్‌బాబు చేసిన త్యాగం చిరస్థాయిగా నిలిచి పోతుందన్నారు. ప్రభుత్వం సంతోష్‌ కుటుంబా నికి ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని చెప్పారు. సంతోష్‌ కుటుంబ బాగోగులు చూసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డికి కేసీఆర్‌ సూచించారు. సీఎం ఓదార్పుతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

సూర్యాపేటలో సోమవారం కల్నల్‌ సంతోష్‌బాబు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు 
రూ.5 కోట్ల చెక్కులు అందించిన సీఎం..
కల్నల్‌ సంతోష్‌బాబు భార్య సంతోషికి గ్రూప్‌–1 ఉద్యోగం కల్పిస్తూ జారీ చేసిన నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా ఆమెకు అందజేశారు. అలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రి సమీపాన ఉన్న 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా ఆమెకు అందించారు. వాటితోపాటు సంతోషికి రూ. 4 కోట్ల చెక్కును, కల్నల్‌ తల్లిదండ్రులకు రూ. కోటి చెక్కును అందజేశారు. ఇంటి స్థలాన్ని ముఖ్యమంత్రే స్వయంగా ఎంపిక చేశారని మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

సూర్యాపేటలో సోమవారం కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి, పిల్లలు అభిజ్ఞ, అనిరుధ్‌లను పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

ఇంట్లోకి సీఎంతోపాటు ముగ్గురే..
కరోనా విజృంభణ నేపథ్యంలో జిల్లాలో అధికార యంత్రాంగం సీఎం కేసీఆర్‌ రాక సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సీఎం కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న సందర్భంగా ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలెవరూ రావొద్దని ముందుగానే ఆదేశాలు జారీ చేసింది. కరోనా నిబంధనలను అనుసరిస్తూ సీఎంతోపాటు కేవలం మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌లు మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సీఎం వెంట వచ్చిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి శ్రవణ్‌రెడ్డిలు సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావులు సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంతోష్‌ బాబు చిత్రపటంపై  జైహింద్‌ అని రాస్తున్న సీఎం కేసీఆర్‌ 

రోడ్డు మార్గాన పర్యటన..
సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గాన ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి తుర్కపల్లి, భువనగిరి, వలిగొండ, చిట్యాల మీదుగా సూర్యాపేటకు చేరుకున్నారు. కల్నల్‌ కుటుంబాన్ని పరామర్శించాక తిరుగు ప్రయాణంలోనూ అదే మార్గంలో ఫాంహౌస్‌కు వెళ్లారు.

కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా సంతోషి: ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, సూర్యాపేట: కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషిని కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ (గ్రూప్‌–1 కేడర్‌)గా నియమిస్తూ ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సోమ వారం రాత్రి జీవో నంబర్‌ 80 జారీ చేశారు. ఆమె నియామకాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించినట్లు పేర్కొన్నారు. ఆమె 30 రోజుల్లోగా సం బంధిత శాఖ కమిషనర్‌కు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఈ జీవో ప్రకారం సంతోషి వేత నం రూ. 40,270–93,780 వరకు ఉండనుంది. దీనికి అలవెన్స్‌లు అదనం. అయితే సంతోషి ఒకవేళ వేరే పోస్టును కోరుకుంటే ఆ విషయాన్ని రెండు రోజుల్లోగా తెలియజేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. 

స్థలం కేటాయిస్తూ మరో జీవో..
సంతోషికి 711 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ జీవో నంబర్‌ 59ను సీఎస్‌ విడుదల చేశారు. హైదరాబాద్‌ జిల్లాలోని షేక్‌పేట రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 6/1, వార్డు నంబర్‌ 10, రోడ్డు నంబర్‌ 14 బంజారాహిల్స్‌లో కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి పేరు మీద 711 గజాల స్థలం ఇస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.  

రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
ముఖ్యమంత్రి గారు మా కుటుంబాన్ని పరామర్శించి వెళ్లారు. సంతోష్‌బాబును తీసుకురాలేం కానీ ఆయన లేని లోటు పూడుస్తామని భరోసా ఇచ్చారు. గ్రూప్‌–1 స్ధాయి ఉద్యోగాన్ని ఇస్తామన్నారు. ఈ అవకాశం నాకే ఇచ్చారు. ఏ శాఖలో చేరితే ఆ శాఖను కేటాయిస్తామన్నారు. రూ. 4 కోట్లను పిల్లల పేరున, రూ. కోటిని మా అత్తగారి పేరున చెక్కులు అందించారు. బంజారాహిల్స్‌లో నివాస స్ధలాన్ని కేటాయించారు. ఈ సంఘటనలో వీరమరణం పొందిన ఇతర సైనికులకు త్వరలోనే ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. మాకు అండగా నిలిచిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు, సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు. ప్రభుత్వానికి, మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. ఇంట్లో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తన ఇంటికి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆహ్వానించారు.
– బిక్కుమళ్ల సంతోషి, కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి

కొండంత ధైర్యం వచ్చింది
సీఎం కేసీఆర్‌ ఎప్పటికీ అందుబాటులో ఉంటామన్నారు. ఏ సాయం వచ్చినా అండగా నిలుస్తానన్నారు. కేసీఆర్‌ రావడంతో మాకు కొండంత ధైర్యం వచ్చింది. కేసీఆర్‌ గొప్పతనం మాటల్లోనే కాదు.. చేతుల్లోనూ చూపిస్తారని మా ఇంటికి స్వయంగా రావడంతో తెలిసొచ్చింది. మా బాబు లేకున్నా మా కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. మా బాబు చనిపోయిన నాటి నుంచి అన్ని విషయాల్లోనూ సహకరించిన మంత్రి జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు.
– మంజుల, కల్నల్‌ సంతోష్‌బాబు తల్లి

సూర్యాపేటలో కల్నల్‌ కాంస్య విగ్రహం: మంత్రి జగదీశ్‌రెడ్డి
వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు కాంస్య విగ్రహాన్ని సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని సీఎం కేసీఆర్‌ పరామర్శించి వెళ్లిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. సూర్యాపేట పాత బస్టాండ్‌–కోర్టు జంక్షన్‌ రహదారికి కల్నల్‌ పేరు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. కల్నల్‌ సంతోష్‌బాబుతోపాటు వీరమరణం పొందిన మరో 19 మంది సైనికుల కుటుంబాలకు సైతం ఆర్థిక సాయం ప్రకటించి సీఎం కేసీఆర్‌ ఔదార్యం చాటుకున్నారన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement