
సాక్షి, సూర్యాపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమను పరామర్శించడానికి ఇంటికి రావడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషి అన్నారు. తమ పిల్లలకు రూ.4 కోట్లు, సంతోష్‌బాబు తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కును అందజేయడంతో పాటు, తనకు గ్రూప్-1 ఉద్యోగం, బంజారాహిల్స్‌లో 711 గజాల ఇంటిస్థలం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని సీఎం కేసీఆర్ భరోపా ఇచ్చారని చెప్పారు. తన పిల్లలతో కూడా సీఎం కేసీఆర్ మాట్లాడారని, తమను ఇంటికి కూడా ఆహ్వానించారని ఆమె చెప్పారు. ఏ అవసరం ఉన్న ఫోన్ చేయమని సీఎం కేసీఆర్ చెప్పారని ఆమె తెలిపారు. తనకు మాదిరిగానే ఇతర జవాన్లకు ఆర్థిక సహాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. (చదవండి : సంతోష్ కుటుంబానికి అండగా ఉంటాం : కేసీఆర్)
సీఎం కేసీఆర్ మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించారని సంతోష్‌బాబు తల్లి మంజుల కొనియాడారు. తమకు అండగా నిలిచిన మంత్రి జగదీశ్‌రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. కాగా,సంతోష్‌బాబు కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పరామర్శించిన విషయం తెలిసిందే. రోడ్డు మార్గంలో సూర్యాపేట, విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్, భార్య సంతోషిని పరామర్శించారు. సీఎంతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సూర్యాపేటకు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment