
Bronze Statue of His Late Dog on 5th Death Anniversary
సాక్షి, కృష్ణా: పెంపుడు జంతువులంటే చాలామందికి ప్రాణమన్న సంగతి తెలిసిందే. వాటికి ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. పెంపుడు జంతువుల్లో ఎక్కువగా కుక్కును పెంచుకునేందుకు ఇష్టపడుతారు. దానికి ఏ చిన్న కష్టం వచ్చినా అల్లాడిపోతారు. ఒకవైళ ఆ పెంపుడు శునకం ప్రాణాలు విడిస్తే? ఇంకేమైనా ఉందా.. గుండెలు పగిలేలా విలపిస్తారు.
కొన్ని రోజులు బాధపడతారు.. ఎంత బాధపడ్డ చనిపోయినది తిరిగి రాదని తెలిసి ఎవరి పని వాళ్లు చూసుకుంటారు. మహా అయితే ఏడాదికోరోజు ఫోటోకు దండవేసి నివాళులర్పిస్తారు. అయితే విడ్డూరంగా తాను ప్రాణంగా చూసుకుంటున్న శునకం చనిపోతే కుక్కపై ఉన్న అభిమానాన్ని ఆ యజమాని వినూత్నంగా తెలియజేశాడు. అది ఎక్కడంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సుంకర జ్ఞానప్రకాశరావు అనే వ్యక్తి అమితమైన ప్రేమతో ఓ కుక్కను పెంచుకున్నాడు. దానికి శునకరాజు అని పేరుపెట్టడమే కాకుండా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. దురదృష్టవశాత్తు అది చనిపోయింది. అది ఈ లోకం విడిచి అయిదేళ్లయినా దాని జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడు. ఆ బాధను తట్టుకోలేక ప్రతి సంవత్సరం దానికి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే తమ పెంపుడు కుక్క జ్ఞాపకాలను మరచిపోలేని జ్ఞానప్రకాశరావు దానికి ఏకంగా కాంస్య విగ్రహం చేయించారు.
5వ వర్ధంతి సందర్భంగా శునకరాజు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, శాస్త్రీయ బద్దంగా కుక్క ఆత్మకు శాంతి కలగాలని పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుక్క విగ్రహాన్ని పూలతో అలంకరించి పిండప్రదానం కూడా చేశారు. ఆ తర్వాత స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ రోజులు తమ కుటుంబంతో కలిసి జీవించిన సునకరాజు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. మన అనుకున్న వాళ్లు చనిపోతేనే ఆఖరి చూపు చూసేందుకు కూడా కనీసం జనాలు రావడం లేదు. అలాంటిది చనిపోయిన పెంపుడు కుక్కపై ఇంత ప్రేమ ప్రదర్శించడం నిజంగా విచిత్రంగానే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment