
తెనాలి: కాంస్య విగ్రహాలు, ఐరన్ స్క్రాప్ విగ్రహాలతో గుర్తింపును పొందిన తెనాలి సూర్య శిల్పశాల శిల్పులు మరో అడుగు ముందుకేశారు. తమ నైపుణ్యానికి త్రీడీ టెక్నాలజీని ఆలంబనగా చేసుకుని మినీయేచర్ విగ్రహాల తయారీకి పూనుకున్నారు. ఇటీవల మృతిచెందిన కన్నడ సినిమా పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మినీయేచర్ విగ్రహాలను చేసి, శుక్రవారం విలేకరుల ముందు ప్రదర్శించారు. దేవాలయాల రూపశిల్పి అయిన తండ్రి నుంచి వారసత్వంగా శిల్పకళను అందిపుచ్చుకున్న కాటూరి వెంకటేశ్వరరావు తన పరిధిని విస్తరించారు.
ఆలయాలు, రాజగోపురాల రూపకల్పనతోనే సరిపెట్టకుండా.. సిమెంటు, ఫైబర్, కాంస్యం వంటి విభిన్న పదార్థాలతో విగ్రహాలు తయారుచేస్తూ వచ్చారు. ఫైన్‌ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కొడుకు రవిచంద్ర కలిసిరావటంతో వారి సృజన ఎల్లలు దాటింది. ఐరన్ స్క్రాప్‌తో భారీ విగ్రహాలను తయారుచేసి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. తాజాగా కాటూరి వెంకటేశ్వరరావు రెండో కుమారుడు శ్రీహర్ష త్రీ–డీ టెక్నాలజీతో విగ్రహాల తయారీలో శిక్షణ పొందాడు.
తమ శిల్పశాల ఆర్ట్ గ్యాలరీలో తొలిగా పునీత్ రాజ్‌కుమార్ మినీయేచర్ విగ్రహాలను చేశారు. బస్ట్ సైజు 12 అంగుళాల్లో, ఫుల్ సైజ్ 15 అంగుళాల ఎత్తులో వీటిని తయారు చేశారు. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇంట్లో, ఆఫీసుల్లో టేబుల్‌పై ఉంచుకోవచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్తగా చేస్తున్న ఈ మినీయేచర్ విగ్రహాలతో తమ శిల్పశాల ఖ్యాతి మరింతగా ఇనుమడిస్తుందని శిల్పి శ్రీహర్ష అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment