
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాలకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏపీకి 26.29 టీఎంసీలు, తెలంగాణకు 6.04 టీఎంసీలను విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫారసు చేసిందని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్ప ష్టం చేసింది. ఈ నెల 21న త్రిసభ్య కమిటీ సమావేశమే జరగలేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆ రోజు త్రిసభ్య కమిటీ క న్వినర్, కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి డీఎం రాయిపూరే, ఏపీ జల వనరు ల శాఖ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి మాత్రమే సమా వేశమై తాగునీటి అవసరాలపై మాత్రమే చర్చించా రని తెలియజేసింది. రెండు రాష్ట్రాలకు తాగునీటి కేటాయింపులు జరగలేదని, అసలు తెలంగాణ అంగీకారం తెలపలేదని వివరణ ఇచ్చింది.
కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శితో తెలంగాణ ఈఎన్‌సీ భేటీ
కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం.రాయిపూరేను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్ గురువారం జలసౌధలో కలిసి కృష్ణా జలాల కేటాయింపులపై పత్రికల్లో వచ్చిన వార్తల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 21న ఏపీ జల వనరుల శాఖ ఈఎన్‌సీతో నిర్వహించిన సమావేశంలో తాగునీటి అవసరాలకుపై చర్చించిన అనంతరం, నీటి కేటాయింపులపై సిఫారసులతో రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలు(మినట్స్) అంతర్గతంగా సర్క్యులేట్ చేశామని, పత్రికలకు అధికారికంగా విడుదల చేయలేదని రాయిపూరే వివరణ ఇచ్చినట్టు తెలిసింది.
త్వరలో త్రిస భ్య కమిటీ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ సూచించారు. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల జలవినియోగం, నీటి నిల్వ లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తాగునీటి అవసరాలను మదింపు చేసిన తర్వాత కేటాయింపులు జరపాలని కోరారు. తాగునీటి అవసరాలను త్రిసభ్య కమిటీలో చర్చించి, ఇరుపక్షాల అంగీకారం మేరకే నిర్ణయం తీసుకోవాలని కోరారు.