
సాగర్ నుంచి ఏపీ తీసుకుంటున్న జలాలను 5,000 క్యూసెక్కులకు తగ్గించాలి
కృష్ణా బోర్డు చైర్మన్‌ను కలిసి నిరసన తెలిపిన తెలంగాణ అధికారులు
అత్యవసర సమావేశం నేటికి వాయిదా వేయడంపై తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోకుండా ఏపీని నిలువరించాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాలువ ద్వారా ఏపీ తీసుకుంటున్న 7000 వేల క్యూసెక్కులను తక్షణమే 5000 క్యూసెక్కులకు తగ్గించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లో మిగిలి ఉన్న నీటి నిల్వలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపిణీ చేసే అంశంపై బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ జలసౌధలో కేఆర్‌ఎంబీ రెండో అత్యసవర సమావేశం జరగాల్సి ఉండగా, ఏపీ విజ్ఞప్తితో గురువారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది.
దీంతో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇతర అధికారులు బోర్డు చైర్మన్ అతుల్ జైన్‌తో సమావేశమై తీవ్ర నిరసన తెలిపారు. ఇప్పటికే ఏపీ వాటాకి మించి జలాలను వాడుకుందని, ఇంకా అనధికారికంగా నీళ్లను తోడుకోవడానికే సమావేశానికి గైర్హాజరైందని రాహుల్ బొజ్జా అసహనం వ్యక్తంచేశారు. కృష్ణా బోర్డు పట్ల ఏపీకి కనీస గౌరవం లేదని, ఆ రాష్ట్ర అధికారులు తరుచూ బోర్డు సమావేశాలకు గైర్హాజరవుతున్నారని మండిపడ్డారు.
ఒంగోలు సీఈ హైదరాబాద్‌లోని జలసౌధలోనే ఉన్నా ఈ సమావేశానికి రాలేదని అన్నారు. గురువారం నిర్వహించే సమావేశంలో రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో ఒక నిర్ణయానికి వస్తాయని బోర్డు చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ సయోధ్య కుదరకపోతే ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకి నివేదిస్తామని చెప్పారు.
తెలంగాణకి 63.. ఏపీకి 55 టీఎంసీలు!
ఈ నెల 24న జరిగిన కృష్ణా బోర్డు తొలి అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ తరపున నల్లగొండ చీఫ్ ఇంజనీర్ వి.అజయ్‌కుమార్, ఏపీ తరపున ఒంగోలు చీఫ్ ఇంజనీర్ బి.శ్యామ్ ప్రసాద్ బుధవారం జలసౌధలో సమావేశమై ప్రస్తుత రబీలో సాగర్ నుంచి ఇరు రాష్ట్రాలకు అవసరమైన సాగునీటి ప్రణాళికను సిద్ధం చేశారు. కనీస నిల్వ మట్టానికి ఎగువన శ్రీశైలంలో 36.51 టీఎంసీలు, సాగర్‌లో 30.57 టీఎంసీలు కలిపి మొత్తం 67 టీఎంసీలు లభ్యతగా ఉన్నట్టు నిర్థారించారు.
శ్రీశైలం నుంచి ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకి 13 టీఎంసీలు, సాగర్ నుంచి ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకి 50 టీఎంసీలు అవసరమని నిర్థారించారు. మొత్తం కలిపి ఏపీ 55 టీఎంసీలు, తెలంగాణ 63 టీఎంసీలు అవసరమని కోరాయి. ఈ ప్రణాళిక ఆధారంగా గురువారం జరిగే రెండో అత్యవసర సమావేశంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై బోర్డు నిర్ణయం తీసుకోనుంది.