
రిజర్వాయర్లు నిర్మిస్తేనే ఎలివేటెడ్‌కు క్లియరెన్స్
కోల్పోయే నిర్మాణాలను తిరిగి పూర్తి చేయాలని షరతు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు రక్షణ శాఖ పీటముడి వేసింది. సుమారు 18.10 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఈ కారిడార్ కోసం తిరుమలగిరి, అల్వాల్ మార్గంలో రక్షణ శాఖకు చెందిన భూములను సేకరించాల్సి ఉంది. ఈ క్రమంలో కొన్ని నిర్మాణాలను కూడా తొలగించే అవకాశం ఉంది. దీంతో తొలగించనున్న వాటిని తిరిగి నిర్మించి ఇచ్చిన తరువాతే కారిడార్‌కు భూమిని అందజేస్తామని రక్షణశాఖ అధికారులు మెలిక పెట్టారు. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
ఈ మార్గంలో రక్షణ శాఖకు చెందిన రెండు భారీ రిజర్వాయర్లు ఉన్నాయి. 5 లక్షల లీటర్ల గ్యాలన్‌ల సామర్ధ్యంతో ఒకటి, 2.5 లక్షల గ్యాలన్‌లతో మరో రిజర్వాయర్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతానికి తాగునీరు లభిస్తోంది. ఈ రెండింటిని ఎలివేటెడ్ కారిడార్ కోసం తొలగించాల్సి వస్తోంది. దీంతో ఈ భారీ రియర్వాయర్లకు మరోచోట స్థలం కేటాయించి నిర్మించి ఇవ్వాలని రక్షణ శాఖ హెచ్‌ఎండీఏను కోరింది. ఈ మార్గంలో తొలగించే భవనాలకు భూమి మాత్రమే పరిహారంగా కాకుండా భవనాలను కూడా తిరిగి నిర్మించి ఇవ్వాలని అధికారులు అంటున్నారు.
ఈ మేరకు హెచ్‌ఎండీఏ, రక్షణ శాఖల మధ్య వివిధ అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయి. అన్ని అంశాలపై ఇరు వర్గాలు ఒక అవగాహనకు వస్తే తప్ప ఈ ప్రాజెక్టు ముందుకు కదిలే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 197 ఎకరాల భూమి సేకరణకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ఇందులో 113.48 ఎకరాలు రక్షణ శాఖ నుంచి సేకరించాల్సి ఉంది. సుమారు రూ.2 వేల కోట్ల (పరిహారం చెల్లింపుసహా) నిర్మాణ అంచనాలతో ఈ కారిడార్‌ను ప్రతిపాదించారు.
15వ తేదీ వరకు గడువు
ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు ఈ నెల 15న బిడ్డింగ్ గడువు ముగియనుంది. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులను అందజేయవచ్చని హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ కారిడార్ నిర్మాణం కోసం ఆసక్తి గల సంస్థల నుంచి గత నెలలో టెండర్‌లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి డెయిరీఫామ్ ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతి లభించిన నేపథ్యంలో హెచ్‌ఎండీఏ అధికారులు నిర్మాణ పనులపై దృష్టి సారించారు. ప్యారడైజ్ నుంచి డెయిరీఫామ్ వరకు 5.4 కిలోమీటర్ల కారిడార్‌లో బేగంపేట్ విమానాశ్రయం వద్ద సుమారు 600 మీటర్ల పొడవుతో సొరంగ మార్గాన్ని నిర్మించనున్నారు.
విమానాల రాకపోకలను దృష్టిలో ఉంచుకొని ఎలివేటెడ్‌కు ప్రత్యామ్నాయంగా సొరంగమార్గం నిర్మించాల్సి ఉంది. ప్యారడైజ్ నుంచి సికింద్రాబాద్, తాడ్‌బండ్, బోయిన్‌పల్లి మీదుగా డెయిరీఫామ్ వరకు నిర్మించనున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ కోసం రూ.652 కోట్ల వ్యయంతో ప్రణాళికలను రూపొందించారు. భూసేకరణ కోసం అయ్యే ఖర్చులతో కలిపి ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1,550 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ కారిడార్ నిర్మాణంతో నగరానికి ఉత్తరం వైపు 44వ జాతీయ రహదారి మార్గంలో మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మిల్, ఆదిలాబాద్ వైపు నుంచి నగరానికి వాహనాల రాకపోకలకు అంతరాయాలు తొలగనున్నాయి.