
- 16,675 మందికి సంబంధించిన చెస్ట్ ఎక్స్-రేల విశ్లేషణ
- టీబీ ఉన్నట్లు గుర్తించడంలో 88.7% కచ్చితత్వం
- క్షయ వ్యాధి లేదని చెప్పడంలో 97% కచ్చితత్వం
హైదరాబాద్: చెస్ట్ ఎక్స్-రేలను ఉపయోగించి క్షయ వ్యాధి (టీబీ)ని గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి కిమ్స్ ఆస్పత్రి అతిపెద్ద పరిశోధన చేసిందని తెలిపారు కిమ్స్ హాస్పిటల్స్ పల్మోనాలజీ విభాగాధిపతి డాక్టర్ లతా శర్మ. ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా, క్యూఎక్స్ఆర్ అనే అత్యాధునిక ఏఐ టూల్‌ను ఉపయోగించి మొత్తం 16,675 మంది పేషెంట్ల చెస్ట్ ఎక్స్-రేలను విశ్లేషించారు.
ఇందులో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టిపెట్టారు. ముందుగా ఏఐ ద్వారా టీబీని గుర్తించడం, ఆ తర్వాత రేడియాలజిస్టులు దాన్ని నిర్ధారించడం. టీబీ కేసులను గుర్తించడంలో ఏఐ టెక్నాలజీ అత్యంత సమర్థమైనదని దీనిద్వారా తెలిసింది. మొత్తం గుర్తించిన కేసుల్లో 88.7% కచ్చితమైనవిగా తేలింది. దీంతో వ్యాధిని త్వరగా గుర్తించడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని నిర్ధారణ అయ్యింది. దానికితోడు.. ఇందులో టీబీ లేదని నిర్ధారించడంలో 97% కచ్చితత్వాన్ని ఏఐ సాధించింది. ఏఐ టూల్ స్పెసిఫిసిటీ 69.1%గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రమాణాలను ఇది అందుకుంటోంది.
ఇందులో మరో కీలకమైన అంశం ఏమిటంటే.. ఏఐ గుర్తించిన కేసులన్నింటినీ నిపుణులైన రేడియాలజిస్టులు కూడా నిర్ధారించారు. అందువల్ల క్లినికల్ డయాగ్నసిస్‌లో ఏఐ సామర్థ్యం, దాని కచ్చితత్వాలకు ఇది నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న టీబీ కేసుల నేపథ్యం, సంప్రదాయ రేడియోగ్రఫీతో దాన్ని నిర్ధారించడానికి ఎక్కువ సమయం పడుతున్నందువల్ల ఇది మెరుగైన ప్రత్యామ్నాయం కానుంది.
ఈ సందర్భంగా ఆమె ఈ పరిశోధన ప్రభావం గురించి మాట్లాడారు. “టీబీ గుర్తింపులో ఏఐ టూల్ సామర్థ్యం, దాని కచ్చితత్వం చాలా బాగున్నాయి. ఇది గేమ్ ఛేంజర్ కానుంది. ముఖ్యంగా నిపుణులైన రేడియాజిస్టులు ప్రతిసారీ అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇలాంటివి ఎంతగానో ఉపయోగపడతాయి” అని ఆమె చెప్పారు.
కిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ డాక్టర్ చైతన్య ఇసమళ్ల మాట్లాడుతూ, “మానవ నైపుణ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు గానీ, ప్రాథమిక పరీక్షల విషయంలో మాత్రం అది చాలా ఆధారపడదగ్గ పరికరంగా ఉపయోగపడుతుంది. అందువల్ల సంక్లిష్టమైన కేసుల్లో లోతుగా పరిశీలించేందుకు అవసరమైన సమయం వైద్యులకు దొరుకుతుంది” అని వివరించారు.