సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నియంత్రణలోకి తీసుకెళ్లడానికి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు గురువారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో అంగీకరించారు. ఇకపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను కేఆర్‌ఎంబీ ప్రత్యక్ష నియంత్రణలో జరపాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి కాంపొనెంట్ (విభాగం) వద్ద తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని పెట్టాలని నిర్ణయించారు.
జలవిద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన 10 ఔట్‌లెట్లు (శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్‌వేతోపాటు రివర్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ ఫ్లడ్ కెనాల్–హెడ్ రెగ్యులేటర్–పరిసరాలు, ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం– పంప్‌హౌస్ పరిసరాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్‌వేతోపాటు రివర్, చూట్ స్లూయిస్, నాగార్జునసాగర్ రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్)లను బోర్డు నియంత్రణలోకి తీసుకెళ్లడానికి ఇరువురు ఈఎన్‌సీలు అంగీకారం తెలిపారు.
ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు కూడా 10 కాంపోనెంట్ల వద్ద మూడేసీ షిఫ్టులు (ఒక్కో షిప్టు 8 గం ఉండేలా ఇరు 30 మంది చొప్పున బోర్డు నియంత్రణలో పనిచేయడానికి అంగీకరించారు. అయితే నీటి విడుదల మాత్రం బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ (బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే, తెలంగాణ ఈఎన్‌సీ సి. మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి)ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయం మేరకు జరుగుతుందనే అంగీకారం ఇరువురి మధ్య కుదిరింది. అయితే నాగార్జునసాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులు తెలంగాణ, శ్రీశైలం పనులను ఏపీ చేపట్టాలని నిర్ణయించారు.
గంటన్నరపాటు సమావేశం...
కేఆర్‌ఎంబీ చైర్మన్ శివనందన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయకుమార్లు హాజరవగా ఏపీ నుంచి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డితోపాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం జరిగింది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించాలని తాము సమ్మతించినట్లు ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెల్లడించారు.
అప్పటిదాకా అప్పగింత కుదరదు: తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి
ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై మీడియాలో వార్తలు రావడంతో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రంగంలోకి దిగారు. నీటి వాటాలు తేలేదాకా, శ్రీశైలం, సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్స్‌పై స్పష్టత వచ్చేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ తేల్చిచెప్పారు. దీనిపై జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను బహిర్గతం చేశారు.
కేంద్ర జలశక్తి శాఖ జనవరి 17న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అంగీకరించకున్నా అంగీకరించినట్లు పేర్కొంటూ మినిట్స్ విడుదల చేసిందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఆ సమావేశంలో తాము లేవనెత్తిన పలు అంశాలను మినిట్స్‌లో పేర్కొనలేదని గుర్తుచేశారు. ఆ మినిట్స్‌ను సవరించాలని లేఖలో కోరారు. మరోవైపు కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన వెంటనే ప్రాజెక్టుల అప్పాగింతకు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.
తొలుత భేటీకి వెళ్లరాదనుకొని...
అసలు కృష్ణా బోర్డు సమావేశాలకు హాజరు కాకూడదని అధికారులు తొలుత భావించినప్పటికీ తెలంగాణ అభిప్రాయాలను స్పష్టంగా బోర్డుకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు స్వయంగా హాజరయ్యారు. అయితే లేఖకు కట్టుబడే ఉండాలని సమావేశంలో తెలంగాణ భావించగా తద్విరుద్ధంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాగర్ పరిధిలో మొత్తం 8 కాంపోనెంట్లు ఉండగా అందులో 7 తెలంగాణ అదీనంలో ఉన్నాయి.
వాటిలో ఐదింటిని అప్పగించడానికి, శ్రీశైలం పరిధిలో 7 కాంపోనెంట్లు ఉండగా అందులో తెలంగాణ అదీనంలో ఉన్న కాంపోనెంట్‌ను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఈఎన్సీ (జనరల్) సి. మురళీధర్ ప్రకటన చేశారు. దాంతో విస్తుపోవడం తోటి అధికారుల వంతైంది. ఈ విషయం ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మీడియాకు విడుదల చేశారు. దాంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈఎన్‌సీ ఒకదారిలో నడుస్తుండగా నీటిపారుదల శాఖ కార్యదర్శి మరోదారిలో నడుస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలోకి..
Published Fri, Feb 2 2024 4:09 AM | Last Updated on Fri, Feb 2 2024 4:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment