► టార్గెట్ 68 మిలియన్ యూనిట్లు
► ఇప్పటివరకు ఉత్పత్తి అయింది 68.17 ఎం.యూ.
► నెలాఖరులోపు మరింత పెరగనున్న ఉత్పత్తి
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద గల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని దాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 68 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయాలని విద్యుత్‌సౌధ లక్ష్యం విధించింది. టార్గెట్ దాటడంపై జెన్‌కో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరు లోపు మరో ఆరు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
గతేడాది నిల్..
కాకతీయ కాలువకు నీటి విడుదల ద్వారా స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలోని నాలుగు టర్బయిన్ల ద్వారా 36 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయవచ్చు. గతేడాది ఎగువ ప్రాంతాల నుంచి చుక్క నీరు రాకపోవడంతో ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయలేదు. దీంతో విద్యుదుత్పత్తి కేంద్రంలో ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి కాలేదు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 12 మిలియన్ యూనిట్లే విద్యుదుత్పత్తి జరిగింది. మూడేళ్ల తరువాత ఈ సంవత్సరమే అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి అయ్యింది.
టార్గెట్ తక్కువే..
జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఈ ఆర్థిక సంవత్సరం 68 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం దాటడం హర్షణీయమే కానీ, విధించిన లక్ష్యమే చాలా తక్కువ. వాస్తవానికి 90 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల ప్రాజెక్టు ద్వారా కనీసం 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని గతంలో నిర్దేశించారు. ఒక్క టీఎంసీ నీటితో ఒక మిలియన్ యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేశారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వదరనీరు వచ్చిన సమయంలో స్థానిక జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రికార్డు స్థాయిలో 137 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి జరిగిందని ప్రాజెక్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం 102 టీఎంసీల నీరు గోదావరి పాలైనా, రబీ ప్రారంభం నాటికి ప్రాజెక్టులో 80 టీఎంసీల నీరు నిల్వ ఉన్నా 68 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి పెద్ద గొప్పేమీ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, గత మూడేళ్లలో ఈసారే అత్యధికంగా ఉత్పత్తి కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్ల ఉత్పత్తిని లెక్కలోకి తీసుకొని..
జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని çవిద్యుత్ సౌధ నిర్ణయిస్తుంది. గత పదేళ్ల విద్యుత్ ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకొని సగటుగా లక్ష్యం నిర్దేశిస్తారు. దాని ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 68 మిలియన్ యూనిట్లు నిర్దేశించారు. వచ్చే సంవత్సరానికి సంబంధించిన లక్ష్యాన్ని త్వరలోనే నిర్ణయించనున్నారు.
– శ్రీనివాస్‌రావు, జెన్‌కో ఎస్‌ఈ, ఎస్సారెస్పీ