సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు, వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటన్నిటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో సముద్రంలో ఏర్పాటు చేసే పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్–2023ను తాజాగా ప్రకటించింది. సముద్రంలో విండ్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండే చోటు కోసం జరిగే సర్వేకు మూడేళ్లు ఉన్న గడువును ఐదేళ్లకు పెంచింది. అలాగే ప్రాజెక్టుల లీజు వ్యవధి 35 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్వాహకులు మెగావాట్‌కు రూ.1లక్ష సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలని చెప్పింది. అయితే ఇది రిఫండబుల్ అని స్పష్టం చేసింది.
థర్మల్ కంటే ఖర్చు తక్కువ
పవన శక్తి సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకి చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించడంలో సహాయపడుతోంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) విశ్లేషణ ప్రకారం.. విండ్ పవర్ వృద్ధి రేటు వచ్చే దశాబ్దంలో 15 శాతానికి పెరగాలి.
ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో దేశంలోని సముద్రంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్‌షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్ విక్రయానికి ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి.
రాష్ట్రంలో సముద్రం అనుకూలం
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 8,998.323 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో పవన విద్యుత్ 4,083.37 మెగావాట్లుగా ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది.
ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పుణె)కి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్ర ప్రాంతాల్లో గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment