రెండు గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్న దృశ్యం
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం నీటిమట్టం శనివారం సాయంత్రానికి 884.80 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాజెక్టులైన జూరాల, సుంకేసుల నుంచి 1,32,829 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. 10 అడుగుల మేరకు తెరచిన 2 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 55,966 క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
శుక్రవారం నుంచి శనివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.769, ఎడమగట్టు కేంద్రంలో 17.008 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 66,703 క్యూసెక్కుల నీటిని, స్పిల్ వే ద్వారా 1,03,623 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదిలారు. బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 5,208 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,688 క్యూసెక్కుల నీటిని వదిలారు.
డ్యామ్ పరిసర ప్రాంతాల్లో 1 మి.మీ. వర్షం కురిసింది. ప్రస్తుతం జలాశయంలో 214.3637 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు, నాగార్జున సాగర్ జలాశయానికి వరదనీటి రాక తగ్గుముఖం పట్టింది. దీంతో రేడియల్ క్రస్ట్ గేట్లను తగ్గించారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 2 రేడియల్ క్రస్ట్‌గేట్లు, కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 1,25,577 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
సాగర్ జలాశయం నుండి అంతే నీటిని విడుదల చేస్తున్నారు. 8 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా 64,128 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 32,886 క్యూసెక్కులు కృష్ణా నదిలోకి మొత్తం 97,014 క్యూసెక్కులు వదులుతున్నారు. కుడి, ఎడమకాల్వలు, వరదకాలవకు కలిపి 15,563 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం 589.20 అడుగులు 309.6546 టీఎంసీలు ఉంది. ఎగువనుండి వచ్చే వరదను బట్టి గేట్లను పెంచడం, తగ్గించడం గేట్లను మూసివేయడం చేస్తున్నారు. కృష్ణా నదిపైగల జలాశయాలన్నీ జలకళతో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment