సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన అనంతరం నిర్మిస్తున్న విద్యుత్ కేంద్రాల్లో వచ్చే నెల నుండే ఉత్పత్తి ప్రారంభమవుతుందని, రెండేళ్లలో అదనంగా 3,480 మెగావాట్లు, ఆ తరువాత రెండేళ్లలో మరో 4,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి. ప్రభాకర్ రావు వెల్లడించారు. జెన్‌కో ఆధ్వర్యంలో చేపట్టిన 800 మెగావాట్ల కేటీపీఎస్ ఏడోదశ విద్యుదుత్పత్తి కేంద్ర నిర్మాణం పూర్తయిందని, వచ్చే నెల నుండి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. 1080 (4గీ270) మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్‌కు సంబంధించి తొలి రెండు యూనిట్లు వచ్చే ఏడాది మార్చి, మరో రెండు యూనిట్లు డిసెంబర్ నుండి ఉత్పత్తిని ప్రారంభిస్తాయన్నారు. ఎన్టీపీసీ, యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ ఏడో దశ విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణ పురోగతిని శుక్రవారం ఆయన విద్యుత్ సౌధలో సమీక్షించారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దూబె, జనరల్ మేనేజర్ సుదర్శన్, ట్రాన్స్ కో జేఎండీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
2020 నాటికి 20 వేల మెగావాట్లు
ఎన్టీపీసీ, భద్రాద్రి, కేటీపీఎస్ ద్వారా 2020 మార్చి నాటికి అదనంగా 3,480 మెగావాట్ల విద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుందని ప్రభాకర్‌రావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో విద్యుదుత్పత్తి 20,000 మెగావాట్లు దాటుతుందన్నారు. 4000 మెగావాట్ల యాదాద్రి ప్లాంటును కూడా నిర్మిస్తామన్నారు. సోలార్, హైడల్, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా కూడా 28,000 మెగావాట్ల విద్యుదుత్పత్తిని సాధించడానికి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు.
శరవేగంగా రామగుండం ప్లాంట్ పనులు
రామగుండంలో 4000 మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి ప్లాంట్ నిర్మాణం జరగాల్సి వుండగా మొదటి దశలో 1600 (2గీ800) మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎన్టీపీసీ ఏఈ దూబె తెలిపారు. తొలి యూనిట్ ద్వారా వచ్చే ఏడాది నవంబర్ నుండి 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామన్నారు. ఆ తరువాత మూడు నెలలకు మరో 800 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు.
రెండేళ్లలో 3,480 మెగావాట్ల ఉత్పత్తి
Published Sat, May 19 2018 1:57 AM | Last Updated on Sat, May 19 2018 1:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment