శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల)/ సత్రశాల(రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో ఆదివారం రాత్రి రెండు గేట్లను ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరద ప్రవాహం పెరగడం, డ్యాం నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకోవడంతో రాత్రి 8.30 గంటల సమయంలో రెండు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,600 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టులు, హంద్రీనది నుంచి 2,02,265 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 56,684 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.461 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.693 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా హంద్రీ–నీవా సుజలస్రవంతికి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 211.4385 టీఎంసీల నీరునిల్వ ఉంది.
సాగర్‌లో 311.1486 టీఎంసీల నీరు
శ్రీశైలం నుంచి భారీగా నీరు వస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం పెరుగుతోంది. సాగర్‌లో 589.70 అడుగుల మట్టంలో 311.1486 టీఎంసీల నీరు ఉంది. కుడికాలువకు 9,217 క్యూసెక్కులు, ఎడమకాలువకు 8,718 క్యూసెక్కులు, 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16,138, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 28,379, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరదకాలువకి 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ నుంచి మొత్తం ఔట్‌ఫ్లో 65,252 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ నుంచి టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టుకు 44,030 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ప్రాజెక్ట్ డీఈ దాసరి రామకృష్ణ, ఏడీఈ నర్సింహారావు ఆదివారం తెలిపారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు 4 క్రస్ట్ గేట్ల నుంచి, విద్యుదుత్పత్తి ద్వారా మొత్తం 44,783 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
శ్రీశైలం డ్యాం రెండుగేట్ల ఎత్తివేత
Published Mon, Oct 11 2021 5:16 AM | Last Updated on Mon, Oct 11 2021 5:16 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment