డిమాండ్ లేక నిలిచిన విద్యుదుత్పత్తి
Published Sat, Jul 16 2016 5:50 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM
పాల్వంచ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీ స్థాయిలో తగ్గింది. దీని ప్రభావం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై పడుతోంది. కోట్లాది రూపాయల విలువ చేసే ఉత్పత్తి తగ్గడంతో.. కర్మాగారాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వరంగ సంస్థల నుంచి కొంత తగ్గించి ఉత్పత్తి చేస్తున్నా.. కొన్ని ప్రైవేట్ కర్మాగారాల నుంచి మాత్రం విద్యుత్ కొనుగోలు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో కర్మాగారాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం అయిన ఖమ్మం జిల్లా పాల్వంచలోని నవభారత్ ఎనర్జి ఇండియా లిమిటెడ్‌లో ఇరవై రోజులుగా విద్యుత్ ఉత్పిత్తి లేక వెలవెలబోతోంది. రోజువారీగా విధులు నిర్వర్తించే వందలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనులు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఎంత కాలం ఉత్పత్తి నిలిచిపోనుందో కూడా అర్థంకాని పరిస్థితి. మరోవైపు సంస్థ రోజుకు రూ.1.50కోట్ల వరకు నష్టపోతున్నట్లు అంచనా.
రెండు కర్మాగారాల్లో నిలిచిన ఉత్పత్తి
నవభారత్ సంస్థలో రెండు కర్మాగారాలు ఉండగా.. ప్రభుత్వం గత నెల 23వ తేదీ నుంచి విద్యుత్ కొనుగోలును పూర్తిగా నిలిపివేసింది. 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కొత్త ప్లాంట్ నుంచి ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. ప్లాంట్ నిర్మించిన మూడేళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితి ఇప్పటివరకు తలెత్తలేదు. అంతేకాక పాత ప్లాంట్‌లో 114 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంట్ స్పాంజ్ ఐరన్ కర్మాగారానికి అనుసంధానంగా ఉంది. ఇందులో తయారయ్యే ఉత్పత్తిలో సుమారు 50 మెగావాట్లను సంస్థ సొంత అవసరాలకు వాడుకుంటుంది. మిగిలిన 64 మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు అమ్మకం చేస్తారు. ఈ విద్యుత్ ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయకుండా నిలిపివేయడంతో సంస్థ ఒక్కసారిగా ఇరకాటంలో పడింది. ఒక్కసారిగా 214 మెగావాట్లను నిలిపివేయడంతో రోజుకు రూ.1.50కోట్ల వరకు నష్టాన్ని చవిచూస్తున్నట్లు సమాచారం. ప్లాంట్‌లో తయారయ్యే ఒక్కో యూనిట్‌ను రూ.4.97 పైసలకు ప్రభుత్వానికి అమ్ముతున్నారు. అయితే ఇతర చిన్నాచితక కర్మాగారాల నుంచి తక్కువ రేటుకు వస్తున్న విద్యుత్ సరిపోతుండటంతో ఇక్కడి ఉత్పత్తిని ఆపివేశారనే వాదన కూడా ఉంది.
ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు
నవభారత్ కొత్త ప్లాంట్‌లో ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు కలిపి సుమారు 350 మంది పనిచేస్తున్నారు. పరోక్షంగా సుమారు ఐదారు వందల మంది ఉన్నారు. ఇరవై రోజులుగా ప్లాంట్ మూతపడటంతో పనుల్లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఖాళీగా కూర్చు ని ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది. ఏ క్షణాన ప్రభుత్వం నుంచి ఉత్పత్తి కావాలని అడుగుతారో అని ఎదురుచూపులు చూడాల్సి వస్తుంద ని సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు.
నేషనల్ గ్రిడ్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి?
రాష్ట్ర గ్రిడ్ నుంచి మిగులు విద్యుత్ ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు నేషనల్ గ్రిడ్ లేని కారణంగా ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తయారయ్యే విద్యుత్‌ను ఇక్కడే వినియోగించాలి.. లేదంటే ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితి. జెన్‌కో వ్యాప్తంగా ఉన్న ఉత్పత్తి కేంద్రాల్లో వర్షాల కారణంగా ఉత్పత్తిని కొంత మేర తగ్గించి వినియోగిస్తున్నారు.
Advertisement
Advertisement