Palvanca
-
300 కిలోల నల్లబెల్లం స్వాధీనం
పాల్వంచ: అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ పోలీసులు లారీలో తరలిస్తున్న 300 కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు బుధవారం నల్లబెల్లాన్ని తరలిస్తుండటాన్ని గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 300 కిలోల నల్లబెల్లంతో పాటు ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. -
డిమాండ్ లేక నిలిచిన విద్యుదుత్పత్తి
పాల్వంచ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీ స్థాయిలో తగ్గింది. దీని ప్రభావం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై పడుతోంది. కోట్లాది రూపాయల విలువ చేసే ఉత్పత్తి తగ్గడంతో.. కర్మాగారాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వరంగ సంస్థల నుంచి కొంత తగ్గించి ఉత్పత్తి చేస్తున్నా.. కొన్ని ప్రైవేట్ కర్మాగారాల నుంచి మాత్రం విద్యుత్ కొనుగోలు నిలిపివేస్తూ ఆదేశాలిచ్చారు. దీంతో కర్మాగారాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారం అయిన ఖమ్మం జిల్లా పాల్వంచలోని నవభారత్ ఎనర్జి ఇండియా లిమిటెడ్‌లో ఇరవై రోజులుగా విద్యుత్ ఉత్పిత్తి లేక వెలవెలబోతోంది. రోజువారీగా విధులు నిర్వర్తించే వందలాది మంది ఉద్యోగులు, కార్మికులు పనులు లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఎంత కాలం ఉత్పత్తి నిలిచిపోనుందో కూడా అర్థంకాని పరిస్థితి. మరోవైపు సంస్థ రోజుకు రూ.1.50కోట్ల వరకు నష్టపోతున్నట్లు అంచనా. రెండు కర్మాగారాల్లో నిలిచిన ఉత్పత్తి నవభారత్ సంస్థలో రెండు కర్మాగారాలు ఉండగా.. ప్రభుత్వం గత నెల 23వ తేదీ నుంచి విద్యుత్ కొనుగోలును పూర్తిగా నిలిపివేసింది. 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కొత్త ప్లాంట్ నుంచి ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. ప్లాంట్ నిర్మించిన మూడేళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితి ఇప్పటివరకు తలెత్తలేదు. అంతేకాక పాత ప్లాంట్‌లో 114 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్లాంట్ స్పాంజ్ ఐరన్ కర్మాగారానికి అనుసంధానంగా ఉంది. ఇందులో తయారయ్యే ఉత్పత్తిలో సుమారు 50 మెగావాట్లను సంస్థ సొంత అవసరాలకు వాడుకుంటుంది. మిగిలిన 64 మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు అమ్మకం చేస్తారు. ఈ విద్యుత్ ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయకుండా నిలిపివేయడంతో సంస్థ ఒక్కసారిగా ఇరకాటంలో పడింది. ఒక్కసారిగా 214 మెగావాట్లను నిలిపివేయడంతో రోజుకు రూ.1.50కోట్ల వరకు నష్టాన్ని చవిచూస్తున్నట్లు సమాచారం. ప్లాంట్‌లో తయారయ్యే ఒక్కో యూనిట్‌ను రూ.4.97 పైసలకు ప్రభుత్వానికి అమ్ముతున్నారు. అయితే ఇతర చిన్నాచితక కర్మాగారాల నుంచి తక్కువ రేటుకు వస్తున్న విద్యుత్ సరిపోతుండటంతో ఇక్కడి ఉత్పత్తిని ఆపివేశారనే వాదన కూడా ఉంది. ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు నవభారత్ కొత్త ప్లాంట్‌లో ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు కలిపి సుమారు 350 మంది పనిచేస్తున్నారు. పరోక్షంగా సుమారు ఐదారు వందల మంది ఉన్నారు. ఇరవై రోజులుగా ప్లాంట్ మూతపడటంతో పనుల్లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఖాళీగా కూర్చు ని ఇంటి ముఖం పట్టాల్సి వస్తోంది. ఏ క్షణాన ప్రభుత్వం నుంచి ఉత్పత్తి కావాలని అడుగుతారో అని ఎదురుచూపులు చూడాల్సి వస్తుంద ని సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు. నేషనల్ గ్రిడ్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి? రాష్ట్ర గ్రిడ్ నుంచి మిగులు విద్యుత్ ఉత్పత్తిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు నేషనల్ గ్రిడ్ లేని కారణంగా ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తయారయ్యే విద్యుత్‌ను ఇక్కడే వినియోగించాలి.. లేదంటే ఉత్పత్తిని నిలిపివేయాల్సిన పరిస్థితి. జెన్కో వ్యాప్తంగా ఉన్న ఉత్పత్తి కేంద్రాల్లో వర్షాల కారణంగా ఉత్పత్తిని కొంత మేర తగ్గించి వినియోగిస్తున్నారు. -
మున్సి‘పోల్స్’?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: త్వరలో పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మందమర్రితోపాటు ఈ రెండింటికి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై ప్రభుత్వం కూడా గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాసిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఈ రెండు మున్సిపాలిటీల్లో ఎన్నికలపై చర్చ సాగుతోంది. 50 శాతం వార్డులు, చైర్మన్ పదవిని ఎస్టీలకు రిజర్వు చేస్తూ గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఎన్నికలు జరుగుతారుు. ఎన్నికలు ఎందుకు జరగలేదంటే.. ఏజెన్సీ ఏరియాలో ఉన్న గ్రామపంచాయతీ పరిధిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసే విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత లేదు. మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి ఎన్నికలు జరపాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ జరగాలి. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల చట్టాలను ఏజెన్సీ ప్రాంతాలకు కూడా వర్తింపచేయాలని పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగ సవరణ సాధ్యం కాకపోవడంతో ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ అంశం పార్లమెంట్ పరిధిలో ఉండటంతో ఆదిలాబాద్ జిల్లా మందమర్రితోపాటు జిల్లాలోని పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. పాల్వంచ మున్సిపాలిటీకి రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగి ఆ తర్వాత నిలిచిపోయాయి. ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయడం, ఎస్టీలకు రిజర్వేషన్లు కేటాయించకుండా ఎన్నికలు నిర్వహించడంపై కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. దీంతో ఎన్నికలు జరగలేదు. మణుగూరుకు ఒక్కసారీ ఎన్నికలు లేవు.. మణుగూరు పంచాయతీని 2005లో మే 31న థర్డ్‌గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మున్సిపాలిటీగా ఏర్పాటైన సమయంలో పంచాయతీలో 20 వార్డులు, 26వేల మంది జనాభా ఉంది. అయితే అప్పట్లోనే ఏజెన్సీ పరిధిలోని పంచాయతీలను మున్సిపాలిటీలుగా చేస్తే పన్నులు పెరుగుతాయని గిరిజన సంఘాల నేతలు బండారు నాగేశ్వరరావు, వట్టం రాంబాబులతోపాటు భద్రాచలం పట్టణానికి చెందిన యాసం రాజులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంటీరియర్ సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ పరిస్థితులతో ఒక్కసారి కూడా మణుగూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ప్రస్తుతం మణుగూరు మున్సిపాలిటీ జనాభా 23 డివిజన్లలో 42 వేలు ఉంది. సింగరేణి నిర్వాసిత ప్రాంతాలైన ఎగ్గడిగూడెం, మల్లేపల్లి, పద్మగూడెం, కొమ్ముగూడెం గ్రామాలు ఖాళీ కావడంతో రెండు డివిజన్లు లేకుండా పోయాయి. అదే విధంగా అన్నారం, చినరాయిగూడెం, కమలాపురం గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగిం చాలని ఆప్రాంతాల ప్రజలు సైతం కోరుతున్నారు. ఈగ్రామాలు తొలగించి సమితిసింగారంలోని పట్టణ ప్రాంతాన్ని మున్సిపాలిటీలో కలపాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత తెరపైకి.. పాల్వంచకు 16 ఏళ్లు, మణుగూరుకు 11 ఏళ్లుగా ఎన్నికలు జరగలేదు. పాలకవర్గాలు లేకపోవడంతో ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదనే వాదనలున్నాయి. అయితే ఏజెన్సీ చట్టాల ప్రకారం ఆస్తి పన్ను, ఇతర పన్నులపై వివాదం కొనసాగుతోంది. ఏజెన్సీలోని మున్సిపాలిటీలను 50 శాతం రిజర్వేషన్లతోపాటు చైర్మన్ పదవులను కూడా ఎస్టీలకు కేటాయించాలనే డిమాండ్లున్నాయి. ఇదంతా పార్లమెంట్ పరిధిలో ఉండటంతో చట్ట సవరణ జరగడానికి చాలాకాలం పట్టే అవకాశం ఉంది. ఈపరిస్థితుల్లో ఎన్నికల సంఘం చొరవ తీసుకుని వీటికి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఒడిశా తరహాలో గవర్నర్ ప్రత్యేక అనుమతితో ఈ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండటంతో ఈ దిశగా ప్రభుత్వం గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాసింది. దీంతో ఈ మున్సిపాలిటీల ఎన్నికలకు మార్గం సుగమమవుతుందా..? లేదా మళ్లీ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తారా..? అని జిల్లావ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేచింది. పాల్వంచ పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అనంతరం అసలు విషయం వెలుగులోకి రావడంతో పాల్వంచ మున్సిపాలిటీని రద్దు చేయలేక, మున్సిపల్ పాలక వర్గ ఎన్నికలు నిలిపివేశారు. అసలు షెడ్యూల్డ్ ఏరియాని మున్సిపల్ ఏరియాగా మార్చే వీలు లేకున్నా అప్పటి పాలకులు, అధికారులు పారిశ్రామికంగా వేగంగా విస్తరిస్తున్న పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయాలని 1987 ఫిబ్రవ రిలో పాల్వంచ గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. అదే ఏడాది మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్ల పదవీ కాలం అనంతరం మూడేళ్లపాటు ఎన్నికలు నిలిపివేశారు. తిరిగి 1995 మార్చిలో ఎన్నికలు జరగగా, ఆ కౌన్సిల్ 2000 వరకు కొనసాగింది. అనంతరం అసలు విషయం వెలుగులోకి రావడంతో ఎన్నికలు లేకుండా నిలిచిపోయాయి. తొలిసారి పాల్వంచ ఎన్నికలు జరిగినప్పుడు జనాభా 25వేలు ఉండగా.. ప్రస్తుతం 24 వార్డులు.. 80వేలకు జనాభా చేరింది. -
పవన్‌ను కలిసిన శ్రీజ
హైదరాబాద్: బ్రెయిన్ ఫీవర్ నుంచి పూర్తిగా కోలుకున్న ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన శ్రీజ తన కుటుంబ సభ్యులతో సోమవారం జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ను ఆయన కార్యాలయంలో కలిసింది. గతేడాది బ్రెయిన్ ఫీవర్ కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడిన శ్రీజ తన అభిమాన నటుడు పవన్‌ను చూడాలనుందని కోరడంతో ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ చొరవతో ఆయన స్వయంగా ఖమ్మం వెళ్లి శ్రీజను పరామర్శించిన విష యం తెలిసిందే. అప్పటి నుంచి డాక్టర్ అసాధారణ్ పర్యవేక్షణలో వైద్య చికిత్సలు పొందిన శ్రీజ పూర్తిగా కోలుకుంది. సోమవారం శ్రీజతో పాటు ఆమె తల్లిదండ్రులు నాగయ్య, నాగమణి, సోదరి షర్మిల శ్రీలత పవన్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు వారితో పవన్ కల్యాణ్ గడిపారు. శ్రీజ పూర్తిగా కోలుకొని, ఆరోగ్యవంతంగా ఉండడం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. శ్రీజకు చికిత్స చేసి నయమయ్యేలా చేసిన డాక్టర్ అసాధారణ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. -
కిన్నెరసాని డీర్ పార్క్‌కు 40 ఏళ్లు
పాల్వంచ రూరల్: పాల్వంచ పరిధిలోని కిన్నెరసానిలో జింకల పార్క్ ఏర్పాటుచేసి నేటికి 40సంవత్సరాలు పూర్తైది. పాల్వం చ మండలంలోని యానంబైల్ గ్రామ పంచాయతీ కిన్నెరసాని ప్రాజెక్టు సమీపంలో 30 జింకలతో ఏర్పాటు చేసిన ఈ పార్క్‌ను 1974 సెప్టెంబర్ 29వ తేదీన అప్పటి రాష్ట్రముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళవారం ప్రారంభించారు. అప్పటినుంచి సింగరేణి యాజమాన్యం దీనిని పర్యవేక్షించింది. పర్యాటకులకోసం కిన్నెరసాని రిజర్వాయర్ వద్ద సింగరేణి ఏర్పాటు చేసిన అద్దాల మేడను 2000 సంవత్సరంలో మావోయిస్టులు డిటోనేటర్ల ద్వారా పేల్చి వేయడంతో అద్దాల మేడ, పది కాటేజీలు, జింకల పార్కు నిర్వహణ బాధ్యతలను వన్యమృగ సంరక్షణ అధికారులకు అప్పగించారు. అప్పటి నుంచి వైల్డ్‌లైఫ్ అధికారులు ప్రత్యేక సిబ్బందిని నియమించి జింకల పార్క్‌ను పర్యవేక్షిస్తున్నారు. ప్రారంభంలో 30 జింకలు ఉండగా క్రమక్రమం గా అధికారులు పార్క్ విస్తీర్ణం పెంచి 110 జింకలకు పెంచారు. రాష్ట్రంలోనే అరుదుగా కనిపించే కృష్ణ జింకలు కిన్నెరసాని రిజర్వాయర్‌కు వచ్చే పర్యాటకులకు ముందుగా కనువిందు చేస్తాయి. పార్క్‌లో ఉండే జింకలకు గ్రాస్‌తోపాటు తాటి చెట్టు కర్ర తొట్లను ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పిచేవారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం సిబ్బందితో జింకలకు గడ్డి, 120 కేజీల ఫీడ్‌ను పోషకాహారంగా అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డీర్ పార్క్ 40 జింకలు మాత్రమే సరిపోతుంది. కానీ స్థాయికి మించి జింకలు ఉన్నాయి.