రయ్.. రయ్.. జెన్‌కో | PLF target is 80 percent this year | Sakshi
Sakshi News home page

రయ్.. రయ్.. జెన్‌కో

Published Tue, Oct 8 2019 5:15 AM | Last Updated on Tue, Oct 8 2019 5:15 AM

PLF target is 80 percent this year - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్‌కో మూడు నెలలుగా విద్యుత్‌ ఉత్పత్తిలో దూసుకుపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఐదేళ్లుగా చిక్కి శల్యమైన ఈ సంస్థ ప్రస్తుత ప్రభుత్వ విధానాలతో తిరిగి పుంజుకుంటోంది. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) 50 శాతం కూడా దాటలేదు. కానీ ఈ సంవత్సరం అదే సమయంలో గరిష్టంగా 60 శాతానికి పైగా పీఎల్‌ఎఫ్‌ నమోదు చేసింది. దీంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలకు నాణ్యమైన, చౌకైన విద్యుత్‌ అందించగలుగుతోంది. ఏపీ జెన్‌కో పురోభివృద్ధిపై జెన్‌కో వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే పరంపర కొనసాగితే ఈ ఏడాది 80 శాతం పీఎల్‌ఎఫ్‌కు చేరుకోవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.  

ఐదేళ్లుగా అంధకారం! 
గత ఐదేళ్లుగా టీడీపీ సర్కార్‌ ప్రైవేటు విద్యుత్‌ కొనుగోళ్లకే పెద్ద పీట వేసిన విషయం తెలిసిందే. డిమాండ్‌ లేకున్నా, యూనిట్‌కు రూ. 5పైనే చెల్లించి ప్రైవేటు విద్యుత్‌ కొనుగోలు చేసింది. అయిన వాళ్ల కోసం అడ్డగోలు పీపీఏలను ప్రోత్సహించింది.  2015లో ఏకంగా కమిషన్‌ చెప్పిన దానికి విరుద్ధంగా 11 వేల మిలియన్‌ యూనిట్లకు పైచిలుకు ప్రైవేటు విద్యుత్‌ తీసుకుంది. దానికి యూనిట్‌కు రూ. 6కుపైగా చెల్లించింది. ఈ విధంగా ప్రైవేటు విద్యుత్‌ కొనుగోలు చేయడంతో ఏపీ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తికి భారీగా గండి కొట్టారు. రోజూ 105 మిలియన్‌ యూనిట్ల సామర్థ్యం ఉన్న జెన్‌కోను సగానికి తక్కువగా పరిమితం చేశారు. దీంతో జెన్‌కో నిర్వహణ సామర్థ్యం దారుణంగా దెబ్బతింది. నిర్మాణ వ్యయంపై కనీసం అప్పులు కట్టుకోలేని దైన్యస్థితికి చేరింది. జెన్‌కో ఇప్పటికీ రూ. 20 వేల కోట్ల అప్పుల్లో ఉంది. గత ఐదేళ్లుగా కనీసం ఆ అప్పులపై వడ్డీ కట్టడానికి కొత్తగా అప్పులకు వెళ్లాల్సి వచ్చింది. గత ఏడాది అదికూడా సాధ్యం కాకపోతే విద్యుత్‌ సంస్థల ఆస్తులు తనఖా పెట్టుకోమని టీడీపీ ప్రభుత్వం ఉచిత సలహా ఇచ్చింది. ఇలా జెన్‌కోను అంధకారంలోకి నెట్టివేసింది.  

కొత్త ప్రభుత్వం ప్రోత్సాహంతో.. 
కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఏపీ జెన్‌కో రూపురేఖలు మారిపోతున్నాయి. వీలైనంత వరకు జెన్‌కో ఉత్పత్తిని పెంచాలని సర్కార్‌ ఆదేశించింది. దీంతో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ 66.69కి పెరిగింది. దీన్ని 80 శాతం వరకు తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నట్లు జెన్‌కో ఎండీ శ్రీధర్‌ తెలిపారు. లోడ్‌ ఫ్యాక్టర్‌ పెరిగే కొద్దీ ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఎక్కువ యూనిట్లు ఉత్పత్తి అయితే, జెన్‌కో ఆదాయం గణనీయంగా పెరిగే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు బొగ్గు కొరత లేకుండా, నాణ్యమైన బొగ్గు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితంగా మూడు నెలల్లోనే జెన్‌కో థర్మల్‌ ఉత్పత్తి గణనీయ స్థాయికి చేరుకుంది. 

ఖరీదైన ప్రైవేట్‌ ఉత్పత్తికి కళ్లెం వేస్తూ, పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలన్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ నిర్ణయంతో జెన్‌కోకు మంచి రోజులొచ్చాయి. మూడు నెలలుగా ప్లాంట్లలో పీఎల్‌ఎఫ్‌ పెరగడమే దీనికి తార్కాణం. ఈ పరంపర ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది. 
– జెడ్‌వీ.గణేష్,బీసీ విద్యుత్‌ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement