బుధవారం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న ఉత్తమ్.
యూపీఏ చర్యలతో దేశవ్యాప్తంగా మిగులు కరెంటు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క యూనిటైనా విద్యుత్ ఉత్పత్తిని పెంచారా అని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి.చిన్నారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డిలతో కలసి బుధవారం అసెంబ్లీలోని మీడియాపాయింట్ దగ్గర ఆయన మాట్లాడారు. తమ నిర్ణయాల వల్లనే కరెంటు సమస్య రాకుండా చేస్తున్నామని టీఆర్‌ఎస్ నేతలు పచ్చి అబద్ధం చెబుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క విద్యుత్ ప్లాంటును కూడా ప్రారంభించలేదని, ఒక్క యూనిట్ కరెంటును కూడా అదనంగా ఉత్పత్తిని చేయలేదని ఉత్తమ్ అన్నారు.
2009 నాటికి దేశవ్యాప్తంగా 79వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి అయ్యేదని, యూపీఏ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఇది 1.79 లక్షల మెగావాట్లకు పెరిగిందని అన్నారు. అందుకే దేశవ్యాప్తంగా కరెంటు అందుబాటులో ఉన్నదన్నారు. దేశంలో కరెంటు కొరత లేదని, మిగులు విద్యుత్ ఉన్నందున కొత్తప్లాంట్లు అవసరంలేదనే విషయాన్ని కేంద్ర విద్యుత్‌శాఖమంత్రి పీయూష్ గోయల్ స్వయంగా చెప్పారని ఉత్తమ్ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్రకారం ఇప్పటికిప్పుడే గృహ, పారిశ్రామిక అవసరాలకే కాకుండా వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంటును అందించవచ్చునని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు ప్రమేయం లేకుండానే దేశవ్యాప్తంగా కరెంటు సమస్య లేకుండా పోయిందన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి కరెంటు సరఫరాలో తమ వల్లనే పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పడం పచ్చి అబద్ధమని విమర్శించారు.