మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, చిత్రంలో శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, సంపత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయాన్ని ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేయడంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ చరిత్రలోనే ఇదో దుర్దినమని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ మూఢనమ్మకం కోసం 4 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను ఫణంగా పెడతారా అని ప్రశ్నించారు. ఒక్క కుటుంబం అవసరాల కోసం ఏదైనా చేస్తారా అని నిలదీశారు. కేసీఆర్ తన కుటుంబం కోసం రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బందుల పాలు చేస్తున్నారని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, టి.జగ్గారెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్‌కుమార్, పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌లతో కలిసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు చెల్లించేందుకు నిధులు లేవని వారి వేతనాల్లో కోతలు పెట్టిన కేసీఆర్ ఇప్పుడు వందల కోట్ల రూపాయలతో కొత్త సచివాలయాన్ని ఎలా కడతారని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వాలు తప్పులు చేస్తుంటే న్యాయవ్యవస్థ కలుగజేసుకునేదని, ఇప్పుడు కోర్టులపై ఉన్న నమ్మకం కూడా పోయిందన్నారు. సచివాలయం కూల్చివేతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగి తీర్పు రాకముందే ఉన్న సచివాలయాన్ని కూల్చివేయాలన్నదే కేసీఆర్ దురుద్దేశమని వ్యాఖ్యానించారు. పాత సచివాలయాన్ని కూల్చివేయకుండా కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలన్న రాజకీయ పార్టీల డిమాండ్‌ను కనీసం పట్టించుకోకుండా పటిష్టంగా ఉన్న భవనాలను నిలువునా కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాలన ఎలా జరుగుతోంది: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
సీఎం కేసీఆర్ క్వారంటైన్‌లో ఉంటే రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ వాస్తు పిచ్చితో పాలన చేస్తున్నారన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని బాగుచేయడం చేతకాని ప్రభుత్వం ఇప్పుడున్న సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్ని కట్టాలనుకోవడం సరైంది కాదన్నారు. సీఎం తనకు కావాలనుకుంటే ఓఆర్‌ఆర్ పక్కన కొత్త సెక్రటేరియట్ కట్టుకోవచ్చని, కానీ ఉన్న దాన్ని కూల్చడం ఎందుకని ప్రశ్నించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ హైదరాబాద్‌లో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాలని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గవర్నర్ తన విచక్షణాధికారాలతో సెక్షన్–8ని అమలు చేయాలని కోరారు. దొంగతనంగా అర్ధరాత్రి సెక్రటేరియట్ ఎందుకు కూల్చాల్సి వచ్చిందని షబ్బీర్ ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలోనే కొత్త సచివాలయం నిర్మాణం జరగాలని అధికారులకు ఆదేశాలు జారీచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ విషయంలో అంత త్వరగా ఎందుకు నిర్ణయాలు తీసుకోరని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. అర్ధరాత్రి సచివాలయాన్ని ఎందుకు కూల్చాల్సి వచ్చిందో బాధ్యత గల ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
సీఎం ఎక్కడ?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని ఉత్తమ్ ఆరోపించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తుంటే సీఎం కేసీఆర్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చూపించే లెక్కలకు క్షేత్రస్థాయిలో కరోనా కేసులకు చాలా తేడా ఉందని, కేసీఆర్ చీకటి కుట్రలో పాలు పంచుకునే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. 20 మందిని తొక్కి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అయిన సోమేశ్‌కుమార్ కేసీఆర్‌కు తొత్తుగా మారారని, ఆయన ఆ పదవికి అనర్హుడని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. గవర్నర్ పిలిస్తే పోకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని అవమానపర్చారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కరోనా విషయంలో అద్భుతంగా పనిచేస్తున్నారని ఉత్తమ్ కితాబిచ్చారు. ఏపీలో 10 లక్షల టెస్టులు జరిగితే, తెలంగాణలో లక్ష టెస్టులు జరిగాయని, తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం చేపడుతుందని ఉత్తమ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment