ఆరోగ్యశ్రీలో చేరిస్తే నష్టమేంటి కేసీఆర్‌? | TPCC Chief Uttam Urged To Govt To Corona Treatment In Aarogyasri | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీలో చేరిస్తే నష్టమేంటి కేసీఆర్‌?

May 21 2021 3:51 AM | Updated on May 21 2021 8:47 AM

TPCC Chief Uttam Urged To Govt To Corona Treatment In Aarogyasri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆయుష్మాన్‌ భారత్‌ను దిక్కుమాలిన పథకంగా గతంలో వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్, ఇప్పుడు అదే స్కీంలో రాష్ట్రాన్ని ఎలా చేర్చారని, అసలు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరిస్తే ఆయనకు వచ్చే నష్టమేంటని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. పరిస్థితి చేయి దాటిపోయాక ఇప్పుడు ఆయుష్మాన్‌ భారత్‌లో చేరిస్తే పేదలకు ఎలా న్యాయం జరుగుతుందని నిలదీశా రు. గురువారం సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్‌లతో కలిసి జూమ్‌ ద్వారా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు.

దేశంలో ఈ వైరస్‌ ప్రవేశించిన నాటి నుంచి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఎప్పుడు ఏం చేయాలో స్పష్టంగా చెప్పినప్పటికీ, ప్రణాళిక లేని కేంద్ర ప్రభుత్వం, ప్రజలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తే కేసుల సంఖ్య పెరుగుతుందనే ఆలోచనతోనే ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. శుక్రవారం మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు గ్రామగ్రామాన కరోనా బాధితులకు సాయం చేయాలని ఉత్తమ్‌ పిలుపునిచ్చారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో 50 మందికి మాస్కులు పంపిణీ చేయాలని, కరోనా బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు భోజన ఏర్పాట్లు చేయడంలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనా లని కోరారు.

సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ, ఆయుష్మాన్‌ భారత్‌ వల్ల ఉపయోగం లేదని చెప్పిన కేసీఆర్‌ మళ్లీ అందులోనే చేరారని, ఏ పథకంలో చేరినా తమకు అభ్యంతరం లేదని, కానీ కరోనా చికిత్సను మాత్రం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోనికి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ఎందుకు నిలిచిపోయిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని, ఈ విషయంలో గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని కోరారు.  

ప్రైవేట్‌ ఆసుపత్రులతో లాలూచీ: జీవన్‌రెడ్డి 
కరోనా చికిత్స విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టడానికి తీసుకొచ్చిన జీవో అమలు కాకపోవడానికి ఆ ఆసుపత్రులతో ప్రభుత్వం లాలూచీ పడటమే కారణమని ఆరోపించారు. పీపీఈ కిట్‌ కూడా లేకుండా కేసీఆర్‌ గాంధీ ఆసుపత్రిలోని కరోనా వార్డును సందర్శించారా అని జీవన్‌ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి శ్రావణ్‌ మాట్లాడుతూ, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై ప్రభుత్వం ఎందుకు సమీక్షించడం లేదని, మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ ఏమైందని ప్రశ్నించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సామాజిక భద్రత కల్పించాలని శ్రావణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement