సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి రోడ్ మ్యాప్ ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉంటారని అంచనా వేసిన ప్రభుత్వం తొలి దశలో 7.75 లక్షల మందికి టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఆరు లక్షల మంది ఉంటారని అంచనా వేసింది. సూపర్ స్ప్రెడర్స్‌ను గుర్తించి, వ్యాక్సిన్ వేసే బాధ్యతను ఎంపిక చేసిన విభాగాలకు అప్పగించింది. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు వీరందరికీ సరిపడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచనున్నారు. శుక్రవారం నుంచి ఈ వ్యాక్సిన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ ఉంటే, అందులో 3 లక్షల మంది ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు. వీరందరికీ రాబోయే నెలరోజుల్లో వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. వీరు కాకుండా మిగిలిన మరో 3 లక్షల మందిలో రైతు బజార్లలో పనిచేసే సిబ్బంది, కూరగాయాలు అమ్మే వారు, మద్యం దుకాణాల్లోని సిబ్బంది, కిరాణా షాపులు, స్ట్రీట్ వెండర్స్, సెలూన్ షాపుల్లో పనిచేసే వారు ఉన్నారు. ఈ కేటగిరీలోని 3 లక్షల మందికి 15 రోజుల్లో వ్యాక్సిన్ వేయించే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
వ్యాక్సిన్ లభ్యత ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 6.18 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. మరో 3.35 లక్షల డోసులకు సంబంధించి నిధులు ముందే చెల్లింపులు జరిగాయని, జూన్ మొదటి వారంలో నగరానికి చేరుకుంటాయని అధికార వర్గాలు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కోవాగ్జిన్ ఉత్పత్తి చేసే భారత్ బయోటెక్ సంస్థకు 10 లక్షల డోసుల కోసం ఆర్డర్ ఇవ్వగా.. అందులో రెండున్నర లక్షల కోవాగ్జిన్ టీకాలు గురువారం నాటికి అందుబాటులోకి వస్తాయని, వీటిని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారికి ఇవ్వనున్నట్లు తెలిపింది. మరో రెండున్నర లక్షల టీకాలు జూన్ మొదటి వారంలో వస్తాయని ఆశిస్తున్నారు. మిగిలిన ఐదు లక్షల టీకాలు రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు వివరించాయి.
జర్నలిస్టులకు వ్యాక్సిన్‌పై టీయూడబ్ల్యూజే హర్షం
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు ఈనెల 28, 29, 30 తేదీల్లో వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయూడబ్ల్యూజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లం నారాయణ, ఆస్కాని మారుతి సాగర్ హర్షం వ్యక్తంచేశారు. అక్రెడిటేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఎంప్యానల్‌లో ఉన్న పత్రికలు, చానళ్లలో పనిచేసే ప్రతీ జర్నలిస్టుకు కూడా వ్యాక్సినేషన్ అందించాలని కోరారు.
Corona Vaccine: సూపర్ స్ప్రెడర్స్‌కు టీకా ఇలా...
Published Thu, May 27 2021 3:02 AM | Last Updated on Thu, May 27 2021 3:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment