నిండుకుండలా ఉన్న సాగర్ టెయిల్‌పాండ్ జలవిద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్
రెంటచింతల (మాచర్ల)/విజయపురిసౌత్: గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగర్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 30,943 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతలకు విడుదల చేస్తున్నామని డీఈ దాసరి రామకృష్ణ, ఏఈ బి.కాసులు బుధవారం తెలిపారు. 2 యూనిట్ల ద్వారా 45 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు.
ప్రధాన జలవిద్యుత్ కేంద్రం వద్ద భద్రతా దళాలు
సాగర్ ప్రాజెక్టు వద్ద భారీ పోలీస్ బందోబస్తు
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతుండటంతో బుధవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ప్రధాన జల విద్యుత్ కేంద్రాల వద్ద తెలంగాణ పోలీస్ అధికారులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కనీస నీటిమట్టం 834 అడుగులకు చేరకుండానే శ్రీశైలం ఎడమగట్టున 796 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగిస్తోందని ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ ప్రాంతంలోని జల విద్యుత్ కేంద్రాల్లో నూటికి నూరు శాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలని జెన్‌కో అధికారులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రంలోని 8 టర్బైన్ల ద్వారా విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment