ఆవు పేడతో కరెంట్‌! వేములవాడలో బయోగ్యాస్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ | Biogas Power Generation Plant at Vemulawada | Sakshi
Sakshi News home page

ఆవు పేడతో కరెంట్‌! వేములవాడలో బయోగ్యాస్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌

Published Tue, May 16 2023 3:08 AM | Last Updated on Tue, May 16 2023 9:57 AM

Biogas Power Generation Plant at Vemulawada - Sakshi

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని తిప్పాపూర్‌లో రాష్ట్రంలోనే తొలిసారిగా బయోగ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధిలో కోడెల సంరక్షణ కేంద్రం ఉంది. ఇక్కడ ఉండే 200 ఆవుల పేడ ఆధారంగా బయోగ్యాస్‌ ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే బయోగ్యాస్‌తో విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటుకు మున్సిపల్‌ అధికారులు శ్రీకారం చుట్టారు.

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో వేములవాడ పట్టణ అభివృద్ధి అథారిటీ(వీటీడీఏ) ద్వారా రూ.31.60 లక్షలను మంజూరు చేశారు. ఈ విద్యుత్‌ ప్లాంట్‌ను జూన్‌ ఒకటో తేదీలోగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు వేములవాడ మున్సిపల్‌ అధికారులు ప్లాంటు నిర్మాణ పనులను కోడెల సంరక్షణ కేంద్రం ఆవరణలో చేపట్టారు. సమీపంలోనే ఉన్న ప్రాంతీయ ఆస్పత్రికి ఇక్కడ ఉత్పత్తి అయ్యేవిద్యుత్‌ను అనుసంధానం చేయనున్నారు. 

నిత్యం 2.5 టన్నుల పేడతో.. 
తిప్పాపూర్‌లోని కోడెల సంరక్షణ కేంద్రంలో నిత్యం అందుబాటులో ఉండే 2.5 టన్నుల పశువుల పేడను బయోగ్యాస్‌ ప్లాంటుకు అందించనున్నారు. ఈ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయ్యే 30 కేవీఏ బయోగ్యాస్‌తో విద్యుత్‌ తయారు అవుతుంది. ఈ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తయ్యే పర్యావరణహిత విద్యుత్‌ను వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, వేములవాడ రాజన్న ఆలయానికి వినియోగించనున్నారు. 

పనులు వేగంగా జరుగుతున్నాయి.. 
తిప్పాపూర్‌లో బయోగ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్లాంటు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాం. మరో పక్షం రోజుల్లో ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేసి, గ్రీన్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తాం.  – నర్మద, మున్సిపల్‌ ఏఈ, వేములవాడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement