హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రామ్‌కీ గ్రూప్ కంపెనీ... రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టనుంది. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విషయంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా 45 మెగావాట్ల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి నిర్వహిస్తోంది.
ఇవి హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులపై సంస్థ రూ.600 కోట్లు వ్యయం చేసింది. మరో 105 మెగావాట్లకు సమానమైన ప్లాంట్లు నిర్మాణ దశల్లో ఉన్నాయని రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్ ఎండీ ఎం.గౌతమ్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. హైదరాబాద్, ఢిల్లీలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని, వీటి కోసం సుమారు రూ.1,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని ఆయన తెలియజేశారు. 2021 నాటికి ఇతర విభాగాలపై కంపెనీ మరో రూ.700 కోట్లు ఖర్చు చేయనుంది.
కొత్త మార్కెట్లకు..
కేకేఆర్‌కు వాటా విక్రయించటం ద్వారా వచ్చిన నిధులను అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అడుగుపెట్టడానికి వినియోగించనున్నట్లు గౌతమ్ రెడ్డి తెలియజేశారు. ‘ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఒమన్, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియాలో కంపెనీ సేవలందిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 30% ఆదాయం సమకూరుతోంది.
2021 నాటికి ఇది 35– 36 శాతానికి చేరనుంది. ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో విస్తరిస్తాం. మొత్తంగా భారత మార్కెట్ రానున్న రోజుల్లో కంపెనీ వృద్ధిని నడిపిస్తుంది. క్లీన్ ఇండియా లక్ష్యంతో రామ్‌కీ గ్రూప్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి కృషి చేస్తున్నారు. కేకేఆర్ తోడవడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ సంబంధ సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తాం’ అని వివరించారు.
మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్య 18,000కు...
ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కేకేఆర్... రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో 60 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. డీల్ విలువ సుమారు రూ.3,670 కోట్లు. విక్రయం అనంతరం సంస్థలో రామ్‌కీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వాటా 40 శాతానికి పరిమితమవుతుంది. తాజా డీల్‌లో భాగంగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ప్రైవేట్ ఈక్విటీ, స్టాండర్డ్ చార్టర్డ్‌లు కంపెనీలో తమకున్న 11 శాతం వాటాను కేకేఆర్‌కు విక్రయించాయి.
ఇక రామ్‌కీ ఎన్విరో ఎండీగా గౌతమ్‌రెడ్డి కొనసాగుతారు. కేకేఆర్ టీమ్ సభ్యులు కంపెనీ బోర్డులోకి వస్తారు. కంపెనీలో ప్రస్తుతం 10,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. మూడేళ్లలో ఈ సంఖ్య 18,000 దాటనుంది. భారత్‌లో 20 నగరాల్లో రామ్‌కీ ఎన్విరో కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. కంపెనీ ఏటా 35 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలు, 10 లక్షల టన్నుల పారిశ్రామిక వ్యర్థాలను నిర్వహిస్తోంది. 20,000 పైచిలుకు ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు సేవలందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment