Ramky Infrastructure
-
రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్లు
-
రామ్కీ ఇన్ఫ్రాకు విశ్వకర్మ పురస్కారాలు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు 15వ సీఐడీసీ విశ్వకర్మ అవార్డుల కార్యక్రమంలో వివిధ విభాగాల్లో పురస్కారాలు లభించాయి. ఉత్తమ నిర్మాణ ప్రాజెక్టులు, సామాజిక అభివృద్ధి..ప్రభావం, ప్రొఫెషనల్‌గా అత్యుత్తమంగా నడుస్తున్న సంస్థ తదితర విభాగాల్లో ఈ అవార్డులు దక్కినట్లు కంపెనీ తెలిపింది. నిర్మాణ రంగంలో తాము పాటించే అత్యుత్తమ ప్రమాణాలకు ఇవి నిదర్శనమని రామ్కీ ఇన్ఫ్రా ఎండీ వై.ఆర్. నాగరాజ తెలిపారు. ప్లానింగ్ కమిషన్ (ప్రస్తుతం నీతి ఆయోగ్), భారతీయ నిర్మాణ పరిశ్రమ కలిసి ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (సీఐడీసీ) ఈ పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించింది. -
నామ్ ఎక్స్‌ప్రెస్‌వేను విక్రయించిన రామ్కీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన అనుబంధ కంపెనీ అయిన నామ్ ఎక్స్‌ప్రెస్‌వేను సింగపూర్‌కు చెందిన క్యూబ్ హైవేస్‌కు విక్రయించింది. నార్కట్‌పల్లి– అద్దంకి– మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వేలో (నామ్) నూరు శాతం వాటా అమ్మకానికై క్యూబ్ హైవేస్‌తో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు శుక్రవారం బీఎస్ఈకి కంపెనీ సమాచారం ఇచ్చింది. ఈ డీల్ ద్వారా రామ్కీ రూ.140 కోట్లు పొందడంతోపాటు నామ్ ఎక్స్‌ప్రెస్‌వే పేరున ఉన్న రుణాలన్నీ క్యూబ్‌కు బదిలీ అవుతాయి. ఈ మొత్తాన్ని కంపెనీకి ఉన్న రుణం తగ్గించుకోవడానికి వినియోగించనున్నట్టు రామ్కీ తెలిపింది. నామ్ ఎక్స్‌ప్రెస్‌వేలో వాటాల విక్రయంతో రామ్కీ ఇన్ఫ్రా రుణం రూ.1,529 కోట్ల మేర తగ్గుతుందని వెల్లడించింది. యాజమాన్య మార్పు విషయమై రుణదాతలు, సంస్థల నుంచి అనుమతులు పొందినట్టు తెలిపింది. శుక్రవారం బీఎస్ఈలో రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు ధర ఒకానొక దశలో రూ.207.60 వరకు వెళ్లింది. చివరకు 3.29% పెరిగి రూ.204.25 వద్ద స్థిరపడింది. -
రామ్కీ చేతికి ఎన్ఏఎమ్ ఎక్స్‌ప్రెస్‌వే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెషల్ పర్పస్ వెహికిల్స్‌కు సంబంధించి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్తో (ఐటీఎన్‌ఎల్) ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా ఎన్ఏఎమ్ ఎక్స్‌ప్రెస్‌వేలో ఐటీఎన్‌ఎల్‌కు ఉన్న 50% వాటాను రామ్కీ కొనుగోలు చేసింది. రూ.10 ముఖ విలువ ఉన్న 11,67,50,000 వాటాలను దక్కించుకుంది. దీంతో ఎన్ఏఎమ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా రామ్కీ అనుబంధ కంపెనీ అయింది. అలాగే జోరాబట్ షిల్లాంగ్ ఎక్స్‌ప్రెస్‌వేలో (జేఎస్‌ఈఎల్) రామ్కీ తనకున్న 50 శాతం వాటాను ఐటీఎన్‌ఎల్‌కు విక్రయించింది. రూ.10 ముఖ విలువ కలిగిన 4,20,00,000 వాటాలను ఐటీఎన్‌ఎల్ దక్కించుకుంది. జోరాబట్ షిల్లాంగ్ ఎక్స్‌ప్రెస్‌వే ఇక ఐటీఎన్‌ఎల్ పూర్తి అనుబంధ కంపెనీ. తాజా డీల్స్‌తో ఐటీఎన్‌ఎల్‌కు నికరంగా రూ.43.20 కోట్లను చెల్లించినట్టు రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీఎస్ఈకి శుక్రవారం వెల్లడించింది. క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో రామ్కీ ఇన్ఫ్రా షేరు 5 శాతం పెరిగి రూ.176.45 వద్ద స్థిరపడింది. -
‘వ్యర్థాల నుంచి విద్యుత్’పై రామ్కీ ఫోకస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రామ్కీ గ్రూప్ కంపెనీ... రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టనుంది. వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విషయంలో ఇప్పటికే కంపెనీ దేశీయంగా 45 మెగావాట్ల ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి నిర్వహిస్తోంది. ఇవి హైదరాబాద్, ఢిల్లీ తదితర నగరాల్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులపై సంస్థ రూ.600 కోట్లు వ్యయం చేసింది. మరో 105 మెగావాట్లకు సమానమైన ప్లాంట్లు నిర్మాణ దశల్లో ఉన్నాయని రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ ఎండీ ఎం.గౌతమ్ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. హైదరాబాద్, ఢిల్లీలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని, వీటి కోసం సుమారు రూ.1,800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నామని ఆయన తెలియజేశారు. 2021 నాటికి ఇతర విభాగాలపై కంపెనీ మరో రూ.700 కోట్లు ఖర్చు చేయనుంది. కొత్త మార్కెట్లకు.. కేకేఆర్‌కు వాటా విక్రయించటం ద్వారా వచ్చిన నిధులను అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో అడుగుపెట్టడానికి వినియోగించనున్నట్లు గౌతమ్ రెడ్డి తెలియజేశారు. ‘ప్రస్తుతం సింగపూర్, యూఏఈ, ఒమన్, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియాలో కంపెనీ సేవలందిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి 30% ఆదాయం సమకూరుతోంది. 2021 నాటికి ఇది 35– 36 శాతానికి చేరనుంది. ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో విస్తరిస్తాం. మొత్తంగా భారత మార్కెట్ రానున్న రోజుల్లో కంపెనీ వృద్ధిని నడిపిస్తుంది. క్లీన్ ఇండియా లక్ష్యంతో రామ్కీ గ్రూప్ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి కృషి చేస్తున్నారు. కేకేఆర్ తోడవడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పర్యావరణ సంబంధ సేవలు అందించేందుకు కలిసి పనిచేస్తాం’ అని వివరించారు. మూడేళ్లలో ఉద్యోగుల సంఖ్య 18,000కు... ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ కేకేఆర్... రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో 60 శాతం వాటాను కొనుగోలు చేస్తోంది. డీల్ విలువ సుమారు రూ.3,670 కోట్లు. విక్రయం అనంతరం సంస్థలో రామ్కీ గ్రూప్ చైర్మన్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వాటా 40 శాతానికి పరిమితమవుతుంది. తాజా డీల్‌లో భాగంగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ప్రైవేట్ ఈక్విటీ, స్టాండర్డ్ చార్టర్డ్‌లు కంపెనీలో తమకున్న 11 శాతం వాటాను కేకేఆర్‌కు విక్రయించాయి. ఇక రామ్కీ ఎన్విరో ఎండీగా గౌతమ్‌రెడ్డి కొనసాగుతారు. కేకేఆర్ టీమ్ సభ్యులు కంపెనీ బోర్డులోకి వస్తారు. కంపెనీలో ప్రస్తుతం 10,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. మూడేళ్లలో ఈ సంఖ్య 18,000 దాటనుంది. భారత్‌లో 20 నగరాల్లో రామ్కీ ఎన్విరో కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. కంపెనీ ఏటా 35 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలు, 10 లక్షల టన్నుల పారిశ్రామిక వ్యర్థాలను నిర్వహిస్తోంది. 20,000 పైచిలుకు ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు సేవలందిస్తోంది. -
ఎనిమిది రెట్లు పెరిగిన రామ్కీ లాభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికం స్టాండలోన్ ఫలితాల్లో రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాభం క్రితంతో పోలిస్తే ఎనిమిది రెట్లకుపైగా పెరిగింది. లాభం రూ.2.3 కోట్ల నుంచి రూ.18.8 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.337 కోట్ల నుంచి రూ.261 కోట్లకు వచ్చి చేరింది. సోమవారం బీఎస్ఈలో కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 1.12 శాతం పెరిగి రూ.171.25 వద్ద స్థిరపడింది. -
రామ్కీ ఇన్ఫ్రాకు రూ.939 కోట్ల కాంట్రాక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.939.41 కోట్ల విలువైన కాంట్రాక్టును ఎన్హెచ్ఏఐ నుంచి చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా జమ్ము–శ్రీనగర్ హైవేలో గలందర్ నుంచి సంబల్ రోడ్ మధ్య ప్రతిపాదిత శ్రీనగర్ రింగ్ రోడ్‌ను నిర్మించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ విధానంలో 42.10 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మిస్తారు. 36 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలి. ఈ నిర్మాణం పూర్తయితే శ్రీనగర్ సిటీతోపాటు నగరం చుట్టుపక్కల ట్రాఫిక్ సులభంగా వెళ్లేందుకు వీలవుతుంది. హెవీ మెషినరీని సరిహద్దులో కీలక ప్రాంతాలైన బారాముల్లా, యూరీ, కుప్వారా, బందీపురకు అడ్డంకులు లేకుండా చేరవేయవచ్చు. ఐదు జిల్లాల్లో విస్తరించిన ఈ రోడ్డు 52 గ్రామాలను అనుసంధానిస్తుంది. -
రాంకీ ఇన్ఫ్రాకు రూ. 613 కోట్ల ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా సుమారు రూ. 613 కోట్ల ఆర్డరును దక్కించుకుంది. ప్రాజెక్టు కింద పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లలో రహదారుల విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌హెచ్-200పై వివిధ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, అమృత్‌సర్‌లో స్వర్ణ దేవాలయం-పింక్ ప్లాజా మధ్య రహదారి సుందరీకరణ తదితర పనులు తాము చేపట్టాల్సి ఉంటుందని రాంకీ తెలియజేసింది. భారీ ఆర్డరు వార్తలతో రాంకీ ఇన్ఫ్రా షేరు మంగళవారం బీఎస్ఈలో సుమారు 3 శాతం పెరిగి రూ. 67.85 వద్ద ముగిసింది. -
రాంకీ ఇన్ఫ్రా లాభం రూ. 174 కోట్లు
న్యూఢిల్లీ: ఆదాయాలు మెరుగుపడటంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మౌలిక రంగ సంస్థ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 174 కోట్ల నికర లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో కంపెనీ రూ. 83 కోట్ల మేర నష్టం ప్రకటించింది. మరోవైపు, సమీక్షా కాలంలో ఆదాయం రూ. 336 కోట్ల నుంచి ఏకంగా రూ. 867 కోట్లకు ఎగిసింది. అటు పూర్తి ఏడాదిగాను ఆదాయం రూ. 1,086 కోట్ల నుంచి రూ. 1,793 కోట్లకు పెరగ్గా లాభం రూ. 12 కోట్లుగా నమోదైంది. 2015-16లో కంపెనీ రూ. 445 కోట్ల నష్టం ప్రకటించింది. నిర్మాణ రంగ వ్యాపార విభాగం ఆదాయం రూ. 1,224 కోట్ల నుంచి రూ. 1837 కోట్లకు, డెవలపర్ వ్యాపార విభాగం రూ. 608 కోట్ల నుంచి రూ. 1,015 కోట్లకు ఎగిసింది.