జాంబీ ఎనర్జీ.. ఇంకెన్నాళ్లు!
రూ. 1.08 లక్షల కోట్లు శిలాజ ఇంధనాల విద్యుత్ ఉత్పత్తికి ఏటా సబ్సిడీలు
రూ. 9.02 లక్షల కోట్లు ఉద్గారాల వల్ల ప్రజారోగ్యానికి కలుగుతున్న నష్టం
64.5% సబ్సిడీలు రద్దు చేస్తే వాయు కాలుష్య అకాల మరణాల్లో తగ్గుదల
బ్రస్సెల్స్‌కు హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అలయెన్స్(హీల్) అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించిన అంశాలివీ. ప్రభుత్వ సబ్సిడీల వల్ల ప్రజారోగ్యానికి జరుగుతున్న నష్టం గురించి ఈ నివేదిక విశ్లేషించింది. శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌నే పరిశోధకులు ‘జాంబీ ఎనర్జీ’ అంటుంటారు. కోల్, ఆయిల్, గ్యాస్ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలతో ప్రజారోగ్యానికి నష్టం కలుగుతుండటమే దీనికి కారణం. 2012లో ఇండోర్, అవుట్‌డోర్ ఎయిర్ పొల్యూషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల సంఖ్య 65 లక్షలు. మొత్తం మరణాల్లో ఇది 11.6 శాతం.
– సాక్షి, తెలంగాణ డెస్క్
సబ్సిడీల ఎత్తివేతపై స్పష్టత లేదు..
2014లో జీ20 దేశాలు శిలాజ ఇంధన కంపెనీలకు సబ్సిడీల కోసం వెచ్చించిన మొత్తం రూ.28.47 లక్షల కోట్లు. ఇదే సమయంలో శిలాజ ఇంధనాల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య ఖర్చులు రూ.176.93 లక్షల కోట్లు. సబ్సిడీలకు ఇది ఆరు రెట్లు ఎక్కువ. వాయు కాలుష్యం వల్ల జీ20 దేశాల్లో సంభవిస్తున్న అకాల మరణాలు 32 లక్షలకు పైనే. 2009లో జీ20 దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను దశలవారీగా తగ్గిస్తామని ప్రకటించాయి. 2016 నాటికి అంటే ఏడేళ్ల తర్వాత కూడా దశలవారీగా సబ్సిడీల ఎత్తివేతపై స్పష్టత రాలేదు. ఇప్పటికీ జీ20 దేశాలు 2013–2015 మధ్య ఏటా రూ.4.60 లక్షల కోట్లను సబ్సిడీలుగా చెల్లిస్తున్నాయి.
75 శాతం విద్యుత్ బొగ్గు నుంచే..
2014 నాటికి 75 శాతం దేశ విద్యుత్ అవసరాలను తీర్చేది థర్మల్ పవర్ ప్లాంట్లే. 2016 నాటికి ప్రపంచంలో రెండో అతి పెద్ద థర్మల్ పవర్ ఉత్పత్తిదారు, వినియోగదారు భారతే. ఈ విషయంలో చైనా మొదటి స్థానంలో ఉంది. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల వల్ల వెలువడే ఉద్గారాల్లో నలుసు పదార్థం(పర్టిక్యులేట్ మ్యాటర్–పీఎం), సల్ఫర్ డయా క్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ కీలకం. తలవెంట్రుక కంటే 30 రెట్లు చిన్నగా ఉండే నలుసు పదార్థం(పీఎం 2.5) పీల్చడం వల్ల శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. 2015లో పీఎం 2.5 వల్లే భారత్, చైనాలో 50% మరణాలు సంభవించాయి. చైనాలో 11,08,100 మంది పీఎం 2.5 వల్ల మృత్యువాత పడ్డారు.
► 2013–2014లో శిలాజ ఇంధనాల(ఫాసిల్ ఫ్యూయెల్స్) ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం భారతదేశం సబ్సిడీగా చెల్లించిన మొత్తం రూ. 1.08 లక్షల కోట్లు/ఒక ఏడాదికి.
► ఇదే సమయంలో శిలాజ ఇంధనాలను కరిగించడం వల్ల ఆరోగ్యపరంగా ఏటా జరుగుతున్న నష్టం రూ. 9.02 లక్షల కోట్లు. సబ్సిడీల కంటే ఇది 8 రెట్లు ఎక్కువ.
► రూ.1.08 లక్షల కోట్లతో 37.5 కోట్ల గృహాలకు సోలార్ బల్బులను ఇవ్వవచ్చు. 32 వేల మంది వైద్యులకు ఎయిమ్స్‌లో శిక్షణ ఇవ్వవచ్చు. శిలాజ ఇంధన సబ్సిడీలను రద్దు చేసి.. ఆయిల్, బొగ్గు, గ్యాస్‌పై పన్నులను సవరిస్తే.. వాయు కాలుష్యం వల్ల ఏటా సంభవిస్తున్న 14 లక్షల అకాల మరణాల్లో 64.5 శాతాన్ని తగ్గించవచ్చట.