ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 88.627 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. తరచూ జనరేటర్ల మరమ్మతులతో సతమతమయ్యే ఉద్యోగులు, ఏడాది కాలంగా తీవ్రంగా శ్రమించి ఈ ప్రాజెక్టును గాడిలో పెట్టారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యేలా ఈ ప్రాజెక్టులో ఆరు జనరేటర్లు ఉన్నాయి. మూడు జనరేటర్ల నుంచి 51 మెగావాట్లు, మరో మూడు జనరేటర్ల నుంచి 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
66 ఏళ్లుగా ఈ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి జరుగుతున్నా, పురాతన యంత్రాలు కావడంతో పూర్తి స్థాయి ఉత్పత్తి జరగలేదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే నీరు డుడుమ, జోలాపుట్టు జలశాయాల్లో ఉన్నప్పటికీ, తరచూ జనరేటర్ల మరమ్మతులతో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగలేదు. ఈ సమస్యలతో స్టేషన్ ఐదుసార్లు షట్‌డౌన్ అయ్యేసరికి దీనిపై ప్రాజెక్టు ఎస్‌ఈ, డీఈఈలు, ఏఈఈలు దృష్టి పెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో తీవ్రంగా శ్రమించి ప్రాజెక్టును గాడిలో పెట్టారు.
దీని ఫలితమే గతేడాది డిసెంబరులో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది డిసెంబర్‌లో 88.627 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. గడచిన 25 ఏళ్లలో ఇదే అత్యధికం. గత ఏడాది జూన్ నెలలో 79.42 మిలియన్ యూనిట్లు, జూలైలో 84.75, ఆగస్టులో 86.275, సెప్టెంబర్‌లో 69.54, అక్టోబర్‌లో 86.58, నవంబర్‌లో 82.62, డిసెంబర్‌లో 88.627 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ ఉత్పత్తి జరిగింది.
శతశాతం ఉత్పాదన
విద్యుత్ ఉత్పత్తిలో మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం పని తీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన శత శాతం జరుగుతోంది. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్ కేంద్రాలకు దీటుగా ఉత్పాదకత ఉంటుంది. డిసెంబర్‌లో రికార్డు స్థాయి ఉత్పత్తి జరగడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం. రానున్న రోజుల్లో మరింత మెరుగైన విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తాం. – ఏవీ సుబ్రహ్మణ్యేశ్వరావు, సీనియర్ ఇంజనీర్, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment