Hydro Power Station
-
‘మాచ్‌ఖండ్’లో రికార్డుస్థాయి విద్యుత్ ఉత్పత్తి
ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో 88.627 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. తరచూ జనరేటర్ల మరమ్మతులతో సతమతమయ్యే ఉద్యోగులు, ఏడాది కాలంగా తీవ్రంగా శ్రమించి ఈ ప్రాజెక్టును గాడిలో పెట్టారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యేలా ఈ ప్రాజెక్టులో ఆరు జనరేటర్లు ఉన్నాయి. మూడు జనరేటర్ల నుంచి 51 మెగావాట్లు, మరో మూడు జనరేటర్ల నుంచి 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. 66 ఏళ్లుగా ఈ విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి జరుగుతున్నా, పురాతన యంత్రాలు కావడంతో పూర్తి స్థాయి ఉత్పత్తి జరగలేదు. ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే నీరు డుడుమ, జోలాపుట్టు జలశాయాల్లో ఉన్నప్పటికీ, తరచూ జనరేటర్ల మరమ్మతులతో పూర్తిస్థాయి ఉత్పత్తి జరగలేదు. ఈ సమస్యలతో స్టేషన్ ఐదుసార్లు షట్‌డౌన్ అయ్యేసరికి దీనిపై ప్రాజెక్టు ఎస్ఈ, డీఈఈలు, ఏఈఈలు దృష్టి పెట్టారు. ఉద్యోగులు, సిబ్బంది సహకారంతో తీవ్రంగా శ్రమించి ప్రాజెక్టును గాడిలో పెట్టారు. దీని ఫలితమే గతేడాది డిసెంబరులో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగింది. గడచిన 25 ఏళ్లలో ఇదే అత్యధికం. గత ఏడాది జూన్ నెలలో 79.42 మిలియన్ యూనిట్లు, జూలైలో 84.75, ఆగస్టులో 86.275, సెప్టెంబర్‌లో 69.54, అక్టోబర్‌లో 86.58, నవంబర్‌లో 82.62, డిసెంబర్లో 88.627 మిలియన్ యూనిట్లు చొప్పున విద్యుత్ ఉత్పత్తి జరిగింది. శతశాతం ఉత్పాదన విద్యుత్ ఉత్పత్తిలో మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం పని తీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన శత శాతం జరుగుతోంది. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్ కేంద్రాలకు దీటుగా ఉత్పాదకత ఉంటుంది. డిసెంబర్లో రికార్డు స్థాయి ఉత్పత్తి జరగడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం. రానున్న రోజుల్లో మరింత మెరుగైన విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తాం. – ఏవీ సుబ్రహ్మణ్యేశ్వరావు, సీనియర్ ఇంజనీర్, మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం -
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తక్షణమే విద్యుదుత్పత్తి నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణాబోర్డు ఆదేశించింది. బోర్డు జారీ చేసే నీటి కేటాయింపుల ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ మేరకు కృష్ణాబోర్డు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)కు లేఖ రాసింది. నీటి అవసరాల కోసం తెలంగాణకు ఇంకా ఎలాంటి ఇండెంట్ ఇవ్వలేదని గుర్తు చేసింది. సాగర్‌కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న నేపథ్యంలో, వార్షిక సగటు వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం జలాశయాలు పూర్తిగా నిండకపోవచ్చని, ఈ నేపథ్యంలో నీటిని సంరక్షించాల్సిన అవసరముందని చెప్పింది. కృష్ణా బోర్డుకు సంబంధం లేదు సాగర్‌కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి జరపాలని కృష్ణాబోర్డు కోరడం పట్ల తెలంగాణ నీటిపారుదలశాఖ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సాగర్‌కు నీటి విడుదల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మించాలని ప్రణాళిక సంఘం అనుమతిచ్చిందని, శ్రీశైలం నిండిన తర్వాతే సాగర్‌కు నీటిని విడుదల చేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా జలవిద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారని గుర్తు చేస్తున్నాయి. ఈ విషయంలో కృష్ణాబోర్డు తన పరిధిని దాటి వ్యవహరించిందని, జలవిద్యుదుత్పత్తి బోర్డు పరిధిలోకి రాదని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ త్వరలో కృష్ణా బోర్డుకు లేఖ రాయనున్నట్టు తెలిసింది. జల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది ప్రస్తుతం వర్షాభావం నెలకొని ఉండడంతో రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ భారీ పెరిగింది. విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు లోటును పూడ్చుకోవడానికి మాత్రమే శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి చేస్తున్నామని జెన్కో ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ కొరత నెలకొన్న సమయంలో జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. -
శ్రీశైలం ‘హైడల్’ పునరుద్ధరణ !
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కిందట ప్రమాదంలో కాలిపోయిన శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం పునరుద్ధరణ ఎట్టకేలకు సంపూర్ణమైంది. 4వ యూనిట్‌కు సైతం తాజాగా మరమ్మతులు పూర్తయ్యాయి. అయితే ఈ యూనిట్‌కి సంబంధించిన సర్జ్‌పూల్‌లో పడిపోయిన భారీ గేటు.. ఇంకా బయటకు తీయకపోవడంతో విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు అడ్డంకిగా మారింది. గేటును బయటకు తీసిన తర్వాతే 4వ యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు వీలుంది. మరమ్మతులకు రూ.60 కోట్లకు పైగా వ్యయమైందని జెన్కో అధికారవర్గాలు తెలిపాయి. ఎట్టకేలకు కేరళ నుంచి వచ్చిన ట్రాన్స్ఫార్మర్ ! 900(6 ్ఠ150) మెగావాట్ల శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఒక్కొక్కటి 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 6 యూనిట్లుండగా, 2020 ఆగస్టు 20న జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో అన్ని యూ నిట్లు కాలిపోయాయి. అందులో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఇతర సిబ్బందితో సహా మొత్తం 9 మంది ఈ ప్రమాదానికి బలయ్యారు. 1, 2 వ యూనిట్లకు అదే ఏడాది మరమ్మతులు జరిపి వినియోగంలో తీసుకురాగా..3, 5, 6వ యూనిట్లను తర్వాతి కా లంలో వినియోగంలోకి తెచ్చారు. నాలుగో యూని ట్కి సంబంధించిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ పూర్తి గా కాలిపోగా, అప్పటికప్పుడు అలాంటి ట్రాన్స్ఫార్మర్ మార్కెట్లో ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొంది. శ్రీశైలం విద్యుత్ కేంద్రం నిర్మాణం సమయంలో ..ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఎలక్ట్రికల్స్ కేరళ లిమిటెడ్ (టెల్క్) తయారు చేసిన 190 ఎంవీఏ సామర్థ్యం కలిగిన 3 లింబ్ జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లను వినియోగించారు. నాటి ట్రాన్స్ఫార్మర్ల డిజైన్, నమూనాలను పంపించి అలాంటిదే కొత్త ట్రాన్స్ఫార్మర్ తయారీ కోసం టెల్క్కి జెన్కో ఆర్డర్ పెట్టింది. భారీగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉండడంతో ట్రాన్స్ఫార్మర్ తయారీకి టెల్క్ రెండేళ్లకు పైగా సమయం తీసుకుంది. ఎట్టకేలకు ఇటీవల కేరళ నుంచి ట్రాన్స్ఫార్మర్ రావడంతో 4వ యూనిట్‌కు మరమ్మతులు సైతం పూర్తయినట్టు జెన్కో వర్గాలు తెలిపాయి. కొలిక్కి రాని విచారణలు శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగి రెండున్నరేళ్లు గడుస్తున్నా సీఐడీ విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. దక్షిణ డిస్కం సీఎండీ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ సైతం విచారణ నివేదికను సమర్పించలేదని సమాచారం. ఓ వైపు విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ.. మరో వైపు విద్యుదుత్పత్తిని నియంత్రించే ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టంలోని ప్యానెల్ బోర్డులో బ్యాటరీలను మార్చే పనులను సమాంతరంగా చేపట్టడంతోనే షార్ట్ సర్యు్కట్ సంభవించి ఈ ఘోర ప్రమాదం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుదుత్పత్తిని నిలుపుదల చేసి ఉంటే ప్యానెల్‌బోర్డు వద్దే మంటలను నియంత్రించే అవకాశం ఉండేదని నిపుణులు అంటున్నారు. అవగాహన లేక ఇంజనీర్లు, సిబ్బంది అగ్నిమాపక పరికరంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉత్పత్తి నిలుపుదల చేసినా, గ్రిడ్ నుంచి సమీపంలోని సబ్‌స్టేషన్ ద్వారా శ్రీశైలం విద్యుత్ కేంద్రానికి రివర్స్ విద్యుత్ సరఫరా జరిగింది. మంటలు ప్యానెల్ బోర్డు నుంచి సమీపంలోని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్కు వ్యాపించాయి. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ కాలిపోవడంతో సొరంగం తరహాలో ఉండే విద్యుత్ కేంద్రం అంతటా వేగంగా బూడిదతో కూడిన పొగ వ్యాపించింది. దీంతో సిబ్బంది ఊపిరాడక మృత్యువాతపడ్డారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోగా ఉత్పత్తి నిలుపుదల చేసి, బయటి సబ్ స్టేషన్ నుంచి రివర్స్ సప్లై లేకుండా చేస్తే ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది కాదని జెన్కో సీనియర్ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. గేటు తీయాలంటే భయం ! శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం 4వ యూనిట్ సర్జ్‌పూల్ బయటి మార్గం నుంచి 75 మీటర్లు లోపలికి వెళ్లి నీళ్లలో మునిగి ఉన్న భారీ గేటును బయటికి తీసే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో ఈ పని చేసేందుకు ఎవరూ సాహసించడం లేదని జెన్కో వర్గాలు తెలిపాయి. ప్రమాదకర రీతిలో కాకుండా సురక్షితమైన పద్ధతిలో ఈ గేటును బయటకు తీయాలనే ఆలోచనతో ఈ పనిని పెండింగ్‌లో పెట్టారు. జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన తర్వాత 4 యూనిట్ ప్రధాన మార్గం నుంచే ఈ గేటును బయటకు తీయాలని జెన్కో ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
Polavaram: డ్రాఫ్ట్ ట్యూబ్ అమరిక పనులు ప్రారంభం
పోలవరం రూరల్(ఏలూరు జిల్లా): పోలవరం జల విద్యుత్ కేంద్రం డ్రాఫ్ట్ ట్యూబ్ బిగించే పనులకు అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఏపీ జెన్కో, మేఘా ఇంజినీ రింగ్ సంస్థ ప్రతినిధులు, అధికారులు పనులను ప్రారంభించారు. విద్యుత్ కేంద్రం తొలి యూనిట్లో డ్రాఫ్ట్ ట్యూబ్ బిగింపు పనులు చేపట్టారు. ఈ విద్యుత్ కేంద్రంలో 12 యూనిట్లున్నాయి. 960 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని నిర్మించనున్నారు. పోలవరానికి వచ్చే నీరు విద్యుత్ కేంద్రంలోని ట ర్బయిన్లపై పడుతుంది. టర్బయిన్ తిరగడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. దీనికి వినియోగించిన నీటిని బయటకు పంపేందుకు డ్రాఫ్ట్ ట్యూబ్‌ను ఉపయోగిస్తారు. చదవండి: మనబడి నాడు-నేడు పనులు.. ఏపీ సర్కార్ మార్గదర్శకాలు -
డైవర్షన్ డ్యాం పవర్‌గేట్‌లో సాంకేతిక లోపం
ముంచంగిపుట్టు (విశాఖపట్నం): ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రం డైవర్షన్ డ్యాం(డుడుమ డ్యాం)కు చెందిన రెండో నంబర్ పవర్ గేట్ వద్ద సాంకేతిక లోపం తలెత్తింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పవర్ గేట్‌కు చెందిన బ్యాలెన్సింగ్ రోప్ అకస్మాత్తుగా తెగిపోయింది. దీంతో డ్యాం నుంచి భారీగా నీరు వృథా అవుతోంది. డుడుమ డ్యాం నుంచి టన్నెల్ పాండ్ డ్యాంకు వెళ్లే నీటి మార్గంలో కెనాల్ మీద నీటి ప్రవాహ ఉధృతి పెరగడంతో కెనాల్‌కు ప్రమాదం పొంచి ఉంది. వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా దిగువున ఉన్న బలిమెల డ్యామ్‌లోకి చేరుతోంది. దీనిపై డ్యాం సిబ్బంది వెంటనే స్పందించి.. తెగిపోయిన బ్యాలెన్సింగ్ రోప్‌ను తొలగించి దాని స్థానంలో కొత్తది అమర్చే పనుల్లో నిమగ్నమయ్యారు. బ్యాలెన్సింగ్ రోప్‌ను బుధవారం రాత్రికే పునరుద్ధరిస్తామని మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ ఎస్ఈ కేవీ నాగేశ్వరరావు చెప్పారు. -
ఉభయతారకంగా ‘దుమ్ముగూడెం’
సాక్షి, హైదరాబాద్ : జల విద్యుదుత్పత్తికి, గోదావరి నీటినిల్వకు ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద బ్యారేజీ నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దుమ్ముగూడెం వద్ద గోదావరిలో 150 రోజులపాటు పుష్కలమైన ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు మూడో టీఎంసీ నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ పనులకు సంబంధించి అంచనాలు రూపొందించి నెలాఖరులోగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రగతి భవన్లో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. నదిలోనే నీళ్లు ఆగేలా.. తక్కువ భూసేకరణతో దుమ్ముగూడెం బ్యారేజీకి డిజైన్ చేయాలని సూచించారు. మల్లన్నసాగర్‌కు రెండో టీఎంసీ నీటిని తరలించే పనులకు, సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పనులకూ టెండర్లు పిలవాలన్నారు. కంతనపల్లి బ్యారేజీ పనులను మార్చి చివరికి పూర్తి చేయాలని స్పష్టంచేశారు. మేజర్, మీడియం తేడాలొద్దు... కాళేశ్వరం ద్వారా మిడ్‌మానేరుకు 2 టీఎంసీల నీటిని పంపు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేయాలని సీఎం నిర్ణయించారు. మిడ్‌మానేరుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేసి, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు 2 టీఎంసీలు లిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దుమ్ముగూడెం బ్యారేజీ, మిడ్‌మానేరుకు 3 టీఎంసీల నీటి లిఫ్టు పనులకు రూ.13,500 కోట్ల నుంచి రూ. 14,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పనులకు ఆమోదం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. మేజర్, మీడియం, మైనర్ అనే తేడా లేకుండా రాష్ట్రంలో నీటి పారుదలశాఖ అంతా ఒకటే విభాగంగా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆరేడు ఇరిగేషన్ జోన్లుగా విభజించుకోవాలని, ఒక్కో జోన్‌కు ఒక్కో ఈఎన్సీ ఇన్చార్జిగా వ్యవహరించి, తన పరిధిలోని నీటి పారుదల వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించాలని అన్నారు. నీటి పారుదలశాఖ ముఖ్య అధికారులంతా త్వరలో రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించుకుని, తెలంగాణ సమగ్ర నీటి పారుదల విధానాన్ని ఖరారు చేయాలన్నారు. అవసరమైన నిధులు బడ్జెట్లోనే.. సాగునీటి వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లోనే కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. దుమ్ముగూడెం వద్ద జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి, కాళేశ్వరం నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయడానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయా లని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. నీటి పారుదల విధానం, ఇన్వెంటరీ, నిర్వహణ వ్యూహం ఖరారైన తర్వాత రాష్ట్ర స్థాయి నీటి పారుదల సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరందించే ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో బస్వాపూర్ రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి షామీర్ పేట వాగు, మూసీ నది, ఆసిఫ్ నహర్‌కు నీటిని తరలించాలని.. ఉదయ సముద్రాన్ని బైపాస్ చేసి పానగల్ వాగులో కలపాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నేరుగా నాగార్జున సాగర్ ఆన్లైన్ రిజర్వాయర్ అయిన పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు నీటిని చేర్చాలని సూచించారు. ఈ పనులపై సంపూర్ణ అవగాహన వచ్చేందుకు నీటి పారుదల అధికారులు, రిటైర్డు ఇంజనీర్లు త్వరలోనే ఆ ప్రాంతాలను పరిశీలించాలన్నారు. గోదావరి బేసిన్లో మల్లన్న సాగర్ వద్ద, కృష్ణా బేసిన్లో పాలమూరు ఎత్తిపోతల పథకం వద్ద నీటి పారుదల శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఇదిలావుండగా దుమ్ముగూడెం వద్ద గోదావరిపై 320 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ‘సాక్షి’కి తెలిపారు. కాగా, 37 టీఎంసీల నిల్వతో చేపడుతున్న దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణానికి రూ. 4,500 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, జెన్కో–ట్రాన్స్‌కో చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఈఎన్సీలు, జెన్కో, ట్రాన్స్‌కో డైరెక్టర్లు, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే పాల్గొన్నారు. -
జీవరాశి నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్?
సైన్స అండ్ టెక్నాలజీ శక్తి వనరులు ఒక దేశ సామాజిక ఆర్థిక ప్రగతికి శక్తి రంగం వెన్నెముక లాంటిది. ఉత్పాదకత ఉన్న అన్ని కార్యకలాపాల్లో శక్తి కీలక వనరు. దేశ సమగ్ర అభివృద్ధిలో తలసరి శక్తి వినియోగం, లభ్యత మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. భారతదేశంలో నేడు అపారమైన బొగ్గు, సహజ వాయువు, షేల్ గ్యాస్, కోల్బెడ్ మీథేన్, థోరియం లాంటి శక్తి నిల్వలు ఉన్నప్పటికీ, ముందుచూపు లేక, టెక్నాలజీ లేమి వల్ల అవసరాలకు తగ్గట్టుగా వినియోగించకపోవడం ప్రస్తుత శక్తి సంక్షోభానికి కారణం. 1897లో డార్జిలింగ్‌లో విద్యుత్ సరఫరాతో శక్తి ఉత్పాదన మొదలైంది. 1902లో కర్ణాటకలోని శివ సముద్రం వద్ద హైడ్రో పవర్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. దేశంలో శక్తి ఉత్పాదన, శక్తి రంగం, అభివృద్ధి ప్రణాళికలు, విధాన రూపకల్పనను కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. అన్ని సాంకేతిక అంశాల్లో Central Electricity Authority Ôక్తి మంత్రిత్వ శాఖకు సలహాలు, సూచనలు ఇస్తుంది. జాతీ య స్థాయిలో పవర్ ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ, ఉత్పత్తి, సరఫరా కోసం కింది సంస్థలు కృషి చేస్తున్నాయి. National Thermal Power Corporation (NTPC) National Hydro Electric Power Corporation (NHPC) North Eastern Electric Power Corporation (NEEPCO) Power Grid Corporation Of India Limited (PGCIL) ప్రస్తుతం, భవిష్యత్‌లో శక్తి సరఫరా ప్రాజెక్టుల నిర్వహణ, జాతీయస్థాయి పవర్‌గ్రిడ్ ఏర్పాటుకు పీజీసీఐఎల్ కృషి చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌కు కావాల్సిన రుణాలు, నిధులను రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) సమకూరుస్తుంది. అదేవిధంగా విద్యుత్ ప్రాజెక్టులకు దీర్ఘకాలిక రుణాలను పవర్ ఫైనాన్స కార్పొరేషన్(పీఎఫ్సీ) అంది స్తుంది. మానవ వనరుల అభివృద్ధి, శిక్షణ, పరిశోధనల కోసం నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టి ట్యూట్, సెంట్రల్ పవర్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ అనే స్వయం ప్రతిపత్తి ఉన్న రెండు సంస్థలు శక్తి వనరుల శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో మెగా పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు, శక్తి కొనుగోలు ఒప్పందాలను కుదుర్చుకోవడానికి పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్(పీటీసీ)ని కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేసింది. నవీన పునర్వినియోగ శక్తి వనరుల అభివృద్ధి కోసం 1992లో సంప్రదాయేతర శక్తి వనరుల మంత్రిత్వశాఖ ఏర్పాటైంది. ఆ తర్వాత దీన్ని నవీన, పునర్వినియోగ శక్తి మంత్రిత్వ శాఖగా మార్చారు. భారత స్థాపిత సామర్థ్యంలో పునర్వినియోగ, నవీన శక్తి వనరుల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సౌర శక్తి, పవన శక్తి, చిన్న తరహా జల విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం ఈ మంత్రిత్వశాఖ ప్రధాన లక్ష్యం. దేశంలో అణుశక్తి ఉత్పత్తిని పెంచడం, మూడు రకాల అణుశక్తి కార్యక్రమాల నిర్వహణ, వ్యవసాయం, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఉప యోగించే రేడియోధార్మిక ఐసోటోప్ల ఉత్పత్తి లాంటి లక్ష్యాలతో అణుశక్తి విభాగం పని చేస్తోంది. శక్తి వనరులు: శక్తి వనరులు ప్రధానంగా రెండు రకాలు. సంప్రదాయ, సంప్రదాయేతర. మొద టి నుంచి అధిక వినియోగంలో ఉన్నవి సంప్రదాయ శక్తి వనరులు. వీటిని బొగ్గు, చమురు, సహజ వాయువు, జలవిద్యుత్, అణుశక్తిగా విభజిస్తారు. సంప్రదాయేతర శక్తి వనరులు రెండు రకాలు. ఇవి పునర్వినియోగ, నవీన శక్తి వనరులు. జీవ శక్తి, సౌర శక్తి, పవన శక్తి, చిన్నతరహా జలవిద్యుత్ మొదలైనవి పునర్వినియోగ శక్తి వనరులు. హైడ్రోజన్, జియోథర్మల్, సముద్ర తరంగ శక్తి, బ్యాటరీతో నడిచే వాహనాలు నవీన శక్తి వనరులు. సంప్రదాయ శక్తి వనరులు బొగ్గు: శక్తి రంగానికి బొగ్గు వెన్నెముక లాం టిది. భారత్‌లో స్థూల బొగ్గు నిల్వలు 285.86 బిలియన్ టన్నులు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో దేశంలో ఏటా బొగ్గు డిమాండ్ 7.1 శాతం చొప్పున పెరుగుతూ 2016-17 నాటికి 980.5 మిలియన్ టన్నులకు చేరనుందని ఈ రంగంపై అధ్యయనం చేసిన ఒక వర్కింగ్ గ్రూప్ తెలియజేసింది. 2021-22 నాటికి బొగ్గు డిమాండ్ 1373 మిలియన్ టన్నులకు పెరగనున్నట్లు అంచనా. భారత్‌లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో 60 శాతం; ఇనుము, స్టీల్ పరిశ్రమల్లో 7 శాతం; సిమెంట్ పరిశ్రమల్లో 5 శాతం బొగ్గును వినియోగిస్తున్నారు. మిగతా బొగ్గును అసంఘటిత రంగంలో ఎక్కువగా వాడు తున్నారు. మూడేళ్ల నుంచి సహజ వాయువు ఉత్పత్తి ఆశించిన రీతిలో లేనందున బొగ్గుకు డిమాండ్ మరింత పెరిగింది. సహజ వాయువు: దీన్ని 21వ శతాబ్దపు శక్తి వనరుగా పరిగణిస్తారు. విద్యుత్ ఉత్పత్తి, రవాణా రంగంలో Compressed Natural Gas (CNG), Liquefied Natural Gas (LNG) రూపంలో వినియోగిస్తున్నారు. దేశంలో సహజవాయువు శక్తి నిల్వలు 1,074 ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు. కోల్బెడ్ మీథేన్ (CBM): బొగ్గు నిక్షేపాలతో ముడిపడిన మీథేన్‌ను CBM అంటారు. ఇప్పటికే దేశంలోని నాలుగు ప్రాంతాల్లో సీబీఎం వెలికితీత మొదలైంది. దేశంలో 26,000 చ.కి.మీ. ప్రాంతంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి. 17,000 చ.కి.మీ.లలో సీబీఎం అన్వేషణ ప్రారంభమైంది. వీటి నిల్వలను 98 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్‌గా అంచనా వేశారు. 9.9 ఖీఇఊలు ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు. రోజుకు సుమారు 4.5 మిలియన్ స్టాండర్డ క్యూబిక్ మీటర్ల సీబీఎం ఉత్పత్తి అవుతుంది. షేల్‌గ్యాస్: షేల్ ఒక రకమైన శిల. ఈ శిలల్లోని పొరల మధ్య నిక్షిప్తమైన సహజ వాయువు షేల్‌గ్యాస్. ఇది భారత్‌లో సరికొత్త శక్తి వనరుగా అవతరించనుంది. కృష్ణా, గోదావరి, కావేరి, గొండ్వానాల్లో షేల్ నిర్మాణాలను గుర్తించారు. దేశంలో షేల్‌గ్యాస్ వనరుల అంచనా, శాస్త్రవేత్తల శిక్షణ కోసం కేంద్ర పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వశాఖ అమెరికాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా భారత్‌లో 6.1 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ మేరకు షేల్ గ్యాస్ వనరులు ఉన్నట్లు అంచనా వేసారు. చమురు: చమురు వినియోగంలో 80 శాతం దిగుమతిపై ఆధారపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చమురు ఉత్పాదన, ధరల్లో ఏ మాత్రం ఒడిదుడుకులున్నా, భారత్‌పై తీవ్ర ప్రభావం ఉంటుంది. రవాణా ఖర్చులు పెరిగే కొద్దీ ఇతర రంగాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టం వాటిల్లుతుంది. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. జల విద్యుత్: సంప్రదాయశక్తి వనరుల్లో పునర్వినియోగానికి వీలయ్యేది జలవిద్యుత్ మాత్రమే. దేశ స్థూల జలవిద్యుత్ శక్తి సామర్థ్యం 1.5 లక్షల మెగావాట్లు. స్థాపిత సామర్థ్యం చాలా తక్కువ. ప్రస్తుతం దేశంలో భారీ జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి తీవ్రస్థాయిలో పర్యావరణ పరమైన వ్యతిరేకతలు వస్తున్నాయి. పునరావాస సమస్య కూడా తీవ్రంగా ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో జలవిద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. అణుశక్తి: దేశ స్థాపిత శక్తి సామర్థ్యంలో అణుశక్తి వాటా 2.5 శాతం కంటే తక్కువ. ఇప్పటివరకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రంగాన్ని అభివృద్ధి చేసినప్పటికీ, శక్తి డిమాండ్ దృష్ట్యా యురేనియం ఇంధనం, రియాక్టర్లను దిగుమతి చేసుకోవడంపై భారత్ దృష్టి సారించింది. మనదేశం అణుశక్తి స్థాపిత సామర్థ్యం 4780 మెగావాట్లు. కూడంకుళంలో రెండు రియాక్టర్లు త్వరలో పూర్తిస్థాయిలో వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. సంప్రదాయేతర శక్తి వనరులు మనదేశ శక్తి అవసరాలన్నీ సంప్రదాయ వనరులపై ఆధారపడి ఉన్నాయి. బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గడం, భారీ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ, సామాజిక కారణాలు అడ్డురావడం, చమురుకోసం దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడటం లాంటి కారణాల వల్ల సంప్రదాయ శక్తి వనరులను దీర్ఘకాలం వినియో గించలేం. కాబట్టి పునర్వినియోగ నవీన శక్తి వనరుల ప్రాధాన్యం పెరిగింది. జీవ శక్తి: ఈ శక్తి జీవరాశి నుంచి ఉత్పత్తి అవుతుంది. జీవ శక్తికి దేశంలో ఎన్నో అనుకూల అంశాలు ఉన్నాయి. జీవ శక్తిలో ప్రధానమైంది బయోగ్యాస్. పశువుల పేడ, ఇతర జీవ వ్యర్థాలను ప్రత్యేక బయోగ్యాస్ ప్లాంట్లలోకి తీసుకొని, నియంత్రిత గాలి సరఫరా వద్ద వియోగం చెందించినప్పుడు బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. వంట, విద్యుత్ కోసం దీన్ని వినియోగిస్తారు. జీవరాశి నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్‌ను బయోమాస్ పవర్ అంటారు. దీనికోసం వినియోగించే జీవరాశి అనేక రకాలుగా ఉంటుంది. వరిపొట్టు, గడ్డి, కొబ్బరి చిప్పలు, రంపపు పొట్టు మొదలైన వాటిని వేడిచేసి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. చెరకు నుంచి రసాన్ని సంగ్రహించిన తర్వాత మిగిలే పిప్పిని బగాసీ అంటారు. దీని నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధానమే బగాసీ కోజనరేషన్. దేశంలోని 550 ప్రధాన చక్కెర పరిశ్రమల్లో లభ్యం అవుతున్న బగాసీ ద్వారా అధిక శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. సౌర శక్తి: దేశంలో సౌర శక్తి అపారంగా ఉంది. ఎడారిలో 300 రోజుల పాటు 5000 ట్రిలియన్ కిలోవాట్ పవర్ల సౌర శక్తి భారత భూభాగాన్ని చేరుతుంది. సౌర శక్తిని రెండు రకాలుగా ఉపయోగిస్తారు. కిరణ శక్తిని విద్యుత్‌గా మార్చే టెక్నాలజీ Solar Photovoltaics. కిరణ శక్తిని ఉష్ణంగా మార్చే టెక్నాలజీ Solar Thermal. దేశ వ్యాప్తంగా సౌరశక్తి వినియోగాన్ని విస్తరించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం జాతీయ సౌర మిషన్‌ను అమలు చేస్తోంది. పవన శక్తి: కదులుతున్న గాలి నుంచి ఉత్పత్తి చేసే శక్తి పవన శక్తి. దీని వల్ల ఏ రకమైన పర్యావరణ కాలుష్యం ఉండదు. భారత స్థూల పవన శక్తి సామర్థ్యం 45,000 మెగావాట్లు. పవనశక్తి ఉత్పాదనకు తమిళనాడు, గుజరాత్, మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌లు అనువైన రాష్ట్రాలుగా గుర్తించారు. అంతర్జాతీయ స్థాయిలో పవన శక్తి ఉత్పాదనను ప్రోత్సహించేందుకు చెన్నైలో Centre for Wind Energy Technology కృషి చేస్తోంది. చిన్న తరహా జల విద్యుత్: గరిష్టంగా 25 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న వాటిని చిన్నతరహా జల విద్యుత్ ప్రాజెక్టులు అంటారు. వీటి స్థూల సామర్థ్యం 15000 మెగావాట్లుగా అంచనా వేశారు. ఎత్తయిన పర్వత, చిన్నపాటి జలపాతాలు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు వీలువుతుంది. నవీన శక్తి వనరులు హైడ్రోజన్ శక్తి: ఏ మాత్రం కాలుష్యానికి కారణం కాని శక్తి వనరు హైడ్రోజన్. నీటి జల విశ్లేషణ, కేంద్రక చర్యల ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. రవాణా రంగంలో ఫ్యూయల్ సెల్ వినియోగం ద్వారా కాలుష్య రహిత ఇంధనంగా దీన్ని వినియోగిస్తారు. విద్యుత్ ఉత్పత్తిలోనూ ఉపయోగపడుతుంది. 2020 నాటికి పది లక్షల వాహనాలు హైడ్రోజన్‌పై నడిచే విధంగా వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ ప్రోగ్రామ్ మొదలైంది. జియో థర్మల్ ఎనర్జీ: భూపటలం లోపలి పొరల్లోని వేడి శిలలు, నీటిలోని ఉష్ణశక్తి నుంచి ఉత్పత్తి చేసేదాన్ని జియో థర్మల్ శక్తి అంటారు. దేశంలో దీని స్థూల సామర్థ్యం 45,000 మెగా వాట్లుగా అంచనా వేశారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్‌లను జియో థర్మల్ ఎనర్జీకి అనువైన ప్రాంతాలుగా గుర్తించారు. సముద్రతరంగ శక్తి: సముద్ర అలల శక్తిని ప్రత్యేక నీటి టర్బైన్లు ఉపయోగించి విద్యుత్‌గా మార్చే అవకాశాన్ని దేశంలో పరిశీలిస్తున్నారు. ఈ శక్తి స్థూల సామర్థ్యం 8000-9000 మెగా వాట్లుగా గుర్తించారు. ఇందులో సుమారు 7000-8000 మెగావాట్లు గుజరాత్ తీరంలో ఉత్పత్తి చేసేందుకు వీలవుతుందని అంచనా. బ్యాటరీతో నడిచే వాహనాలు: వీటి వినియోగం వల్ల వాహన కాలుష్యం బాగా తగ్గుతుంది. తక్కువ డిశ్చార్జి, అధిక సాంద్రత ఉన్న నికెల్ మెటల్ హైడ్రైడ్, లిథియం అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేస్తున్నారు. దేశంలో అభివృద్ధి చెందిన ఈ తరహా మొదటి వాహనం రేవా (Reva).