సాక్షి, హైదరాబాద్ : జల విద్యుదుత్పత్తికి, గోదావరి నీటినిల్వకు ఉపయోగపడేలా దుమ్ముగూడెం వద్ద బ్యారేజీ నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దుమ్ముగూడెం వద్ద గోదావరిలో 150 రోజులపాటు పుష్కలమైన ప్రవాహం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు మూడో టీఎంసీ నీటిని లిఫ్టు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ పనులకు సంబంధించి అంచనాలు రూపొందించి నెలాఖరులోగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రగతి భవన్‌లో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. నదిలోనే నీళ్లు ఆగేలా.. తక్కువ భూసేకరణతో దుమ్ముగూడెం బ్యారేజీకి డిజైన్ చేయాలని సూచించారు. మల్లన్నసాగర్‌కు రెండో టీఎంసీ నీటిని తరలించే పనులకు, సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పనులకూ టెండర్లు పిలవాలన్నారు. కంతనపల్లి బ్యారేజీ పనులను మార్చి చివరికి పూర్తి చేయాలని స్పష్టంచేశారు.
మేజర్, మీడియం తేడాలొద్దు...
కాళేశ్వరం ద్వారా మిడ్‌మానేరుకు 2 టీఎంసీల నీటిని పంపు చేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని లిఫ్టు చేయాలని సీఎం నిర్ణయించారు. మిడ్‌మానేరుకు 3 టీఎంసీలు లిఫ్ట్ చేసి, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు 2 టీఎంసీలు లిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దుమ్ముగూడెం బ్యారేజీ, మిడ్‌మానేరుకు 3 టీఎంసీల నీటి లిఫ్టు పనులకు రూ.13,500 కోట్ల నుంచి రూ. 14,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు పనులకు ఆమోదం తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. మేజర్, మీడియం, మైనర్ అనే తేడా లేకుండా రాష్ట్రంలో నీటి పారుదలశాఖ అంతా ఒకటే విభాగంగా పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని ఆరేడు ఇరిగేషన్ జోన్లుగా విభజించుకోవాలని, ఒక్కో జోన్‌కు ఒక్కో ఈఎన్‌సీ ఇన్‌చార్జిగా వ్యవహరించి, తన పరిధిలోని నీటి పారుదల వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించాలని అన్నారు. నీటి పారుదలశాఖ ముఖ్య అధికారులంతా త్వరలో రాష్ట్ర స్థాయి వర్క్ షాపు నిర్వహించుకుని, తెలంగాణ సమగ్ర నీటి పారుదల విధానాన్ని ఖరారు చేయాలన్నారు.
అవసరమైన నిధులు బడ్జెట్లోనే..
సాగునీటి వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన నిధులను బడ్జెట్లోనే కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు. దుమ్ముగూడెం వద్ద జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి, కాళేశ్వరం నుంచి మూడు టీఎంసీలు ఎత్తిపోయడానికి అనుగుణంగా విద్యుత్ సరఫరా ఏర్పాట్లు చేయా లని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. నీటి పారుదల విధానం, ఇన్వెంటరీ, నిర్వహణ వ్యూహం ఖరారైన తర్వాత రాష్ట్ర స్థాయి నీటి పారుదల సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు.
కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీరందించే ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో బస్వాపూర్ రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి షామీర్ పేట వాగు, మూసీ నది, ఆసిఫ్ నహర్‌కు నీటిని తరలించాలని.. ఉదయ సముద్రాన్ని బైపాస్ చేసి పానగల్ వాగులో కలపాలని నిర్ణయించారు. అక్కడి నుంచి నేరుగా నాగార్జున సాగర్ ఆన్‌లైన్ రిజర్వాయర్ అయిన పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు నీటిని చేర్చాలని సూచించారు.
ఈ పనులపై సంపూర్ణ అవగాహన వచ్చేందుకు నీటి పారుదల అధికారులు, రిటైర్డు ఇంజనీర్లు త్వరలోనే ఆ ప్రాంతాలను పరిశీలించాలన్నారు. గోదావరి బేసిన్‌లో మల్లన్న సాగర్ వద్ద, కృష్ణా బేసిన్‌లో పాలమూరు ఎత్తిపోతల పథకం వద్ద నీటి పారుదల శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఇదిలావుండగా దుమ్ముగూడెం వద్ద గోదావరిపై 320 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ‘సాక్షి’కి తెలిపారు.
కాగా, 37 టీఎంసీల నిల్వతో చేపడుతున్న దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణానికి రూ. 4,500 కోట్లు ఖర్చు కాగలదని ప్రాథమికంగా అంచనా వేసినట్లు నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, జెన్‌కో–ట్రాన్స్‌కో చైర్మన్ దేవులపల్లి ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఈఎన్‌సీలు, జెన్‌కో, ట్రాన్స్‌కో డైరెక్టర్లు, నీటి పారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment