సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నీటి నిర్వహణ, నియంత్రణ అంశాలకు సంబంధించి బోర్డు తయారు చేసి పంపిన వర్కింగ్ మాన్యువల్ చెల్లదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ట్రిబ్యునళ్లు ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులను చేయనంత వరకు వర్కింగ్ మాన్యువల్ ఆచరణీయం, ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పింది. బోర్డు పంపిన తుది వర్కింగ్ మాన్యువల్‌పై ఈ మేరకు బుధవారం రాష్ట్రం తన అభ్యంతరాలను తెలియజేసింది. బోర్డు తన మాన్యువల్‌లో, గతంలో వెలువడిన ట్రిబ్యునల్ అవార్డులు, కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా 512:299 నిష్పత్తిన నీటి కేటాయింపులు చేస్తామని స్పష్టం చేయగా, ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను వెల్లడించింది. ‘విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల నీటి వాటాల అంశాన్ని బోర్డు నిర్ణయిస్తుంది.
కానీ 1956 అంతర్‌రాష్ట్ర నదీ వివాదాల చట్టం ప్రకారం కృష్ణా జలాల వాటాలకు సంబంధించి తెలంగాణ, ఏపీల మధ్య ఎలాంటి అవార్డులు లేవు. అదీగాక కృష్ణా జలాల నీటి వాటాలు, కేటాయింపులకు సంబంధించిన అంశం అటు కృష్ణా నదీ వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2( కేడబ్ల్యూడీటీ–2), ఇటు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కనుక ఈ అంశాన్ని న్యాయ పరిధిలో ఉన్న అంశంగానే పరిగణించాలి’అని రాష్ట్రం స్పష్టం చేసింది. ఇక విభజన చట్టంలోని సెక్షన్ 88లో కేవలం బోర్డు సమావేశాలు, చైర్మన్ అధికారాలు, అధికారుల కేటాయింపునకు సంబంధించిన అంశాలు తప్ప, నీటి నిర్వహ ణ, ప్రాజెక్టుల నియంత్రణ, బోర్డు పరిధి ఏంటన్న అంశాలేవీ లేవని పేర్కొంది. ఇలా చాలా అంశాల్లో అస్పష్టత నెల కొన్న సమ యంలో ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు లేకుండా వర్కింగ్ మాన్యువల్ ఆచరణీయం కాదని స్పష్టం చేసింది.
నీటి అవసరాలు చెప్పండి..
కృష్ణా నదీ బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిలో నీటి అవసరాల వివరాలను సమర్పించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లను ఆదేశించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు. ప్రస్తుత 2017–18 వాటర్ ఇయర్‌లో సాగు, తాగు అవసరాలకు కలిపి ఇండెంట్ సమర్పించాలని బోర్డు కోరింది. ఇదే సమయంలో ఇప్పటికే ఉపయోగించిన నీటి వినియోగ లెక్కలు, ఇతర అంశాలు ఏవైనా ఉంటే ఈ నెల 10లోగా సమర్పించాలని తెలిపింది. ఆయా అంశాలను ఎజెండాలో చేర్చి చర్చిస్తామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment