సోమవారం నాగార్జునసాగర్ గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఉవ్వెత్తున పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/రెంటచింతల/శ్రీశైలం: పశ్చిమ కనుమల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. నదిలో ప్రవాహ ఉధృతి భారీగా పెరగటంతో ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. ప్రధాన ఉప నదులైన తుంగభద్ర, భీమా పోటాపోటీగా ఉప్పొంగుతుండటంతో తుంగభద్ర, ఉజ్జయిని డ్యామ్‌ల గేట్లు ఎత్తేశారు. జూరాల నుంచి విడుదల చేస్తున్న కృష్ణా ప్రవాహానికి తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం జలాశయంలోకి ప్రవాహ ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. దీంతో ఇక్కడ పది గేట్లను పూర్తిగా ఎత్తేశారు. నాగార్జున సాగర్‌లోకి ప్రవాహం పోటెత్తి వస్తుండటంతో జలాశయం గేట్లన్నీ పూర్తిగా ఎత్తేశారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పులిచింతల ప్రాజెక్ట్‌పై రెండు గేట్లు తెరిచిన అధికారులు సోమవారం రాత్రికి మరిన్ని గేట్లు తెరవనున్నారు. ప్రకాశం బ్యారేజి గేట్లు కూడా సోమవారం రాత్రి ఎత్తేయనున్నారు.
సాగర్ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సోమవారం కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని ఆదేశించింది. ముంపు గ్రామాలను ముందే గుర్తించి అక్కడి ప్రజలకు పునరావాసం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. కృష్ణా బేసిన్‌పై ప్రాజెక్టుల గేట్లన్నీ పాతికేళ్ల క్రితం ఒకసారి ఎత్తేశారు. ఆ తర్వాత అన్ని గేట్లు ఎత్తేయడం ఇదే తొలిసారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆల్మట్టి నుంచి 46.64 టీఎంసీలను, నారాయణపూర్ నుంచి 51.75 టీఎంసీలను వదులుతున్నారు. భీమా నది నుంచి ఉజ్జయిని డ్యామ్‌లోకి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుండటంతో 9.15 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ 65 గేట్లను ఎత్తి 71.45 టీఎంసీలను విడిచిపెడుతున్నారు.
సాగర్ గేట్లన్నీ ఎత్తివేత
తుంగభద్ర నదిలో సోమవారం వరద ఉధృతి మరింతగా పెరిగింది. జలాశయంలోకి 2,44,003 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో.. 18.37 టీఎంసీలను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 8,19,254 క్యూసెక్కులు (70.79 టీఎంసీలు) వస్తుండగా.. 73.33 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌లోకి 7,66,080 క్యూసెక్కులు (66.20 టీఎంసీలు) వస్తుండగా.. నీటి నిల్వ 246.54 టీఎంసీలకు చేరుకుంది. ముందుజాగ్రత్త చర్యగా సోమవారం ఉదయం 26 గేట్లు ఎత్తి దిగువకు 31.76 టీఎంసీల విడుదల చేశారు. 2009 తర్వాత సాగర్ గేట్లన్నీ తెరవడం ఇదే తొలిసారి. పులిచింతల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ఎగువ నుంచి భారీ వరద వస్తుందన్న కేంద్ర జల సంఘం హెచ్చరికల నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ చేసుకుంటూనే ముందుజాగ్రత్త చర్యగా నాలుగు గేట్లు ఎత్తి దిగువకు 1.26 టీఎంసీలను విడుదల చేస్తున్నారు.
పట్టిసీమ పంప్‌లు బంద్
కృష్ణా నదిలో భారీ ప్రవాహం ఉండటంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపులను సోమవారం మధ్యాహ్నం నిలిపేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజిలో 2.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల నుంచి భారీ వరద వస్తుండటంతో రాత్రికి నీటినిల్వ గరిష్ట స్థాయికి చేరనుంది.
టెయిల్ పాండ్ వద్ద విద్యుత్ ఉత్పాదన నిలిపివేత
గుంటూరు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్ట్‌లో సోమవారం విద్యుత్ ఉత్పాదన నిలిపివేశారు. ఎగువ కృష్ణా నుంచి వస్తున్న సుమారు 5 లక్షల క్యూసెక్కులను దిగువ కృష్ణాలోకి వదులుతున్నారు. టెయిల్ పాండ్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 247 అడుగులు కాగా.. ప్రస్తుతం 238 అడుగులకు చేరింది. ఇదిలావుంటే.. శ్రీశైలం ప్రాజెక్ట్ కుడిగట్టు కేంద్రంలో ఆదివారం నుంచి సోమవారం వరకు 14.352 మిలియన్ యూనిట్లు, ఎడమ గట్టు కేంద్రంలో 18.145 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు.
శాంతించిన గోదావరి
గోదావరిలో వరద తగ్గుముఖం పడుతోంది. సోమవారం ఉదయం 6గంటలకు ధవళేశ్వరం బ్యారేజిలోకి 12.33 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. సాయంత్రం 6కు 5.73 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. గేట్లు ఎత్తి 5,71,149 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. మంగళవారం వరద మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
ముంపుబారిన హంపి
హొస్పేట్/గంగావతి రూరల్/హొళగుంద: తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చడంతో డ్యామ్ లోతట్టు ప్రాంతమైన హంపిలోని అనేక పురాతన స్మారకాలు, కట్టడాలు నీటి మునిగాయి. విరుపాపుర గడ్డలోకి నడుం లోతు నీరు చేరింది. అక్కడ వందలాది రెస్టారెంట్లు నీట మునగడంతో దేశ, విదేశీ పర్యాటకులకు ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఉన్నతాధికారులు బెంగళూరు నుంచి మూడు వాయుసేన హెలికాప్టర్లను రప్పించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైదరాబాద్, విజయవాడకు చెందిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ఇదిలావుంటే.. తుంగభద్ర డ్యామ్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది.
కాలువలకు విడుదల చేస్తున్న 4,481 క్యూసెక్కులతో కలిపి మొత్తం 1,52,066 క్యూసెక్కుల నీటిని బయటకు పంపుతున్నారు. ఆదివారం 33 గేట్ల ద్వారా 2,25,274 క్యూసెక్కుల నీటిని నదికి వదిలిన బోర్డు అధికారులు సోమవారం కూడా అదే రీతిలో వదిలారు. ఎగువన వరద తగ్గుముఖం పట్టడంతో రాత్రి 8 గంటల సమయంలో 25 గేట్లను నాలుగు అడుగులు, మిగిలిన 8 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటి విడుదలను 1,47,210 క్యూసెక్కులకు తగ్గించారు. తుంగభద్ర డ్యామ్ సామర్థ్యం 1,633 అడుగుల నీటిమట్టంతో 100.86 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1,630.09 అడుగుల నీటిమట్టం వ్ద 90.04 టీఎంసీల నిల్వ ఉంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment