
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం మొదలైంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జలాశయంలోకి 13,314 క్యూసెక్కులు చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 34.27 టీఎంసీల నీరుంది. జలాశయం నిండాలంటే ఇంకా 181 టీఎంసీలు అవసరం. నారాయణపూర్ జలాశయానికి దిగువన కురిసిన వర్షాల ప్రభావంతో జూరాలలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాలలోకి శుక్రవారం 16,581 క్యూసెక్కులు చేరడంతో నీటినిల్వ 9.42 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 9.657 టీఎంసీలు.
జూరాల నిండిపోవడంతో తెలంగాణ జెన్‌కో అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంభించారు. విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 17,056 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి జూన్ రెండో వారంలోనే శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరడం ఇదే తొలిసారని అధికారవర్గాలు తెలిపాయి. కృష్ణా బేసిన్‌లో ఎగువన.. ప్రధానంగా మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో రానున్న వారం రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ సంస్థ అంచనాల నేపథ్యంలో.. ఈ ఏడాది నిరుటికంటే ముందే ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి వరద ప్రవాహం శ్రీశైలానికి చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment