ఈ ఏడాదైనా సాగునీరు అందేనా!
కృష్ణమ్మ పరవళ్లతో కేసీ, టీజీపీ రైతుల్లో ఆశలు
శ్రీశైలంలో 875 అడుగుల నీరు ఉంచాలి
నేడు సీఎంను కలవనున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు
కడప సెవెన్‌రోడ్స్: ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో కృష్ణా బేసిన్‌లోని అల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. గురువారం సాయంత్రానికి జూరాలకు 58,495 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో రెండు రోజుల్లో ఆ జలాశయం కూడా నిండుతుందని అంచనా. అటు నుంచి శ్రీశైలానికి వరద వస్తుందని భావిస్తున్నారు. దీంతో జిల్లాలోని కేసీ కెనాల్, తెలుగుగంగ ఆయకట్టు రైతుల్లో ఆశలు మోసులు వేస్తున్నాయి. శ్రీశైలంలో 875 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించి కేసీ, టీజీపీ ఆయకట్టుకు సాగునీటితోపాటు జిల్లాలోని వందలాది గ్రామాలకు తాగునీరు అందించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విన్నవించనున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా.. ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలంలోకి అవసరమైన మేరకు నీరు చేరింది. అయితే తాగునీటి పేరుతో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పోటీపడి వచ్చిన నీటిని వచ్చినట్లే కిందికి తరలించుకుపోయాయి. నాగార్జునసాగర్, డెల్టాల కింద పంటలు సాగయ్యాయి.
కానీ జిల్లాలోని 95 వేల ఎకరాల కేసీ కెనాల్, లక్షా 60 వేల ఎకరాల తెలుగుగంగ ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు అందక పొలాలన్నీ బీడుగా మారాయి. శ్రీశైలంలో 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని నిర్వహించి ఉంటే ఏ ప్రాంతానికి నీటి సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. కనీస నీటిమట్టాన్ని 834 అడుగులకు తగ్గిస్తూ రాష్ట్రప్రభుత్వం జీఓ నం. 69 జారీచేయడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. ఇప్పుడు మళ్లీ రాష్ట్రప్రభుత్వం తాగునీటి రాగాన్ని ఆలపిస్తోంది. గురువారం హైదరాబాద్‌లో కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. తాగునీటి కోసం నాగార్జునసాగర్ కుడి కాలువ కింద 8టీఎంసీలు, ఎడమ కాలువ కింద 4టీఎంసీలు, డెల్టాకు 4టీఎంసీలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం సాగర్‌లో 503అడుగుల నీటిమట్టం మాత్రమే ఉన్నప్పటికీ నీరు ఇవ్వాలని, శ్రీశైలంలో నీటిమట్టం పెరగగానే తాము విడుదల చేస్తామంటూ నీటిపారుదల ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు బోర్డు ఎదుట ప్రతిపాదన చేశారు. కానీ కరువు సీమ నీటి అవసరాల గురించి నామమాత్రంగానైనా ప్రస్తావించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కేటాయింపులు ఉన్నప్పటికీ..
తుంగభద్ర డ్యాం నుంచి కేసీ కెనాల్, హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీలకు 66.5 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉండగా, పూడిక కారణంగా 40 నుంచి 42 టీఎంసీ మాత్రమే అందుతున్నాయి. మిగిలిన 25 టీఎంసీలు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తుంగభద్ర డౌన్ స్ట్రీమ్‌లో 29.9 టీఎంసీలు బచావత్ కేటాయించినప్పటికీ నిల్వ చేసుకోవడానికి అవసరమైన రిజర్వాయర్లు లేని కారణంగా కేసీ ఆయకట్టుకు సక్రమంగా నీ రందడం లేదు. కేటాయించిన నీటిని ఎక్కడి నుం చైనా ఉపయోగించుకునే వీలుంది. ఆ విధంగా శ్రీశైలం నుంచి తమ వాటా నీటిని కేటాయించాలని జిల్లా ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
బ్రహ్మంసాగర్ వెలవెల
తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మం సాగర్ రిజర్వాయర్ నీరు లేక వెలవెలబోతోంది. గతేడాది కూడా నీటి విడుదల లేక రైతులు పంటలు వేసుకోలేదు. వెలుగోడు నుంచి నీటిని తీసుకొచ్చే ప్రధానకాలువ లైనింగ్ పనులు పూర్తిచేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోం ది. ఫలితంగా ఐదు వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ఈ కాలువలో 2,500 క్యూసెక్కుల మేరకే నీటి ప్రవాహం ఉంటోందని నిపుణులు పేర్కొం టున్నారు. ఈ కారణంగా నిర్దేశిత ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. వెలుగోడు రిజర్వాయర్ ఎఫ్‌ఆర్‌ఎల్ 868 అడుగులు శ్రీశైలానికి నీటి ప్రవాహం పెరిగితే 875 ఉండేలా చర్యలు తీసుకుంటేగానీ వెలుగోడుకు, అటు నుంచి బ్రహ్మంసాగర్‌కు తగినన్ని నీరు రాదని చెబుతున్నారు. అందుకే మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి సమస్యలు విన్నవించనుంది.