♦ ఇసుక దోపిడీకి సహకరిస్తున్న అధికారులు
♦ ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆర్కే
తాడేపల్లి రూరల్ : ప్రకాశం బ్యారేజికి పెనుముప్పు వాటిల్లుతుందని తెలియదా? బకింగ్‌హామ్ కెనాల్ కూలిపోయే స్థితిలో ఉందని మరిచారా? ఉన్నత స్థాయి అధికారులై ఉండి, ఇసుక దోపిడీకి సహకరిస్తారా?... అంటూ మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న జీరో పాయింట్ ఇసుక క్వారీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతులు ఓ చోట... ఇసుక నిల్వ మరో చోట చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా ఇసుక తరలించుకుపోతున్నారని మండిపడ్డారు.
2012లో బకింగ్‌హామ్ కెనాల్ బ్రిడ్జిపై భారీ వాహనాలను నిషేధిస్తూ అప్పటి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా పక్కనే మరో బ్రిడ్జి కడుతున్నారని గుర్తు చేశారు. అయితే జీరో పాయింట్ నుంచి వెళుతున్న ఇసుక లారీలు, ట్రాక్టర్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న పాత వంతెనపై నుంచే ప్రయాణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పారాపిట్ వాల్ పూర్తిగా ధ్వంసమైందని, బ్రిడ్జి కింది భాగంలో భారీ పగుళ్లు వచ్చాయన్నారు. అధికారుల నిర్లక్ష్యవైఖరితో బ్రిడ్జికి ప్రమాదం వాటిల్లితే రెండు జిల్లాల ప్రజలకు తాగునీరు, సాగునీటి ఇబ్బందులు తప్పవని అన్నారు.
ప్రకాశం బ్యారేజీలో సైతం చుక్కనీరు ఉండే అవకాశం ఉండదని ఆర్కే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే, జిల్లా కలెక్టర్ ఒత్తిళ్ల మేరకు అనుమతులు ఇవ్వాల్సి వస్తుందని చెబుతున్నారన్నారు. రెండు రోజుల వ్యవధిలో పాత వంతెనపై ఇసుక వాహనాల రాకపోకలు నిలిపివేసి, ప్రత్యామ్నాయ దారి చూసుకోని పక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతామని స్పష్టం చేశారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి, న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో తాడేపల్లి ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి, జిల్లా నాయకులు ఈదులమూడి డేవిడ్‌రాజు, తాడేపల్లి పట్టణ, మండల పార్టీ కన్వీనర్లు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, పాటిబండ్ల కృష్ణమూర్తి, కౌన్సిలర్లు మాచర్ల అబ్బు, ఓలేటి రాము, ఎండి గోరేబాబు, పార్టీ యువజన నాయకులు మున్నంగి వివేకానందరెడ్డి, ఎంపీటీసీలు మేకల హనుమంతరావు, పట్టణ ఎస్సీ సెల్ కన్వీనర్ ముదిగొండ ప్రకాష్, మంగళగిరి రూరల్ కన్వీనర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం బ్యారేజీకి పెనుముప్పు
Published Wed, Aug 5 2015 2:12 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement