
మాకేమో నీళ్లు లేవు..
► వాళ్లేమో ప్రాజెక్టులు కడుతున్నారు
► లోక్‌సభలో జితేందర్‌రెడ్డి ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో నీటి ఎద్దడి ఉంటే ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లో కేంద్రం అనుమతుల్లేకుండా ప్రాజెక్టులు కడుతోందని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ప్రశ్నోత్తరాల సమ యంలో మాట్లాడుతూ.. రైతులు ఇప్పటికే విత్తనాలు నాటారని, ఇప్పటివరకు వర్షాలు పడకపోవడంతో పంటలు ఎలా ఎదుగుతా యని ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఆల్మట్టి నిండకపోవడంతో కిందికి నీళ్లు రాలేదన్నారు.
ఏపీ.. కృష్ణా, గోదావరి బేసిన్లలో కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోందని కేంద్రానికి ఇప్పటికే చెప్పామని, పట్టిసీమ, పురుషోత్తపట్నం, ముచ్చెర్ల, గుండ్రే వుల రిజర్వాయర్, గాజులదిన్నె, గురురాఘవేంద్ర, పులికనుమ, సిద్ధాపురం తదితర ప్రాజెక్టులు నిర్మిస్తోందని చెప్పారు. పెద్ద ప్రాజెక్టుల విషయంలోనే కేంద్రం అనుమతులు అవసరమని జల వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ బలియాన్ బదులిచ్చారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు ఇక్కడే కూర్చుని మాట్లాడుకున్నారన్నారు. నీటి వివాదం ప్రస్తుతం ట్రిబ్యునల్ పరిధిలో ఉందన్నారు.