సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో ఈ సీజన్‌లో తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును కృష్ణా జలాలు తాకాయి. ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి నీటి విడుదల నిరంతరం కొనసాగుతుండటం, జూరాల నుంచి కూడా వచ్చిన నీటిని వచ్చినట్లు కిందకు వదులుతుండటంతో ఆ నీరంతా శ్రీశైలం చేరుతోంది. మంగళవారం సాయంత్రం శ్రీశైలంలోకి 15 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాలు వస్తుండగా బుధవారం నుంచి ఆ ప్రవాహాలు మరింత పెరగనున్నాయి.
ఎగువ నుంచి భారీగానే..
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌లకు భారీగానే నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆల్మట్టికి మంగళవారం ఉదయం 41,812 క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఏకంగా 46,130 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 129 టీఎంసీలకు గానూ 96.50 టీఎంసీల నిల్వ ఉంది. అయినప్పటికీ సాయంత్రానికి 45 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగిస్తున్నారు. దీంతో నారాయణపూర్‌లోకి 46,731 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, నిల్వ 37.64 టీఎంసీలకు గానూ 35.06 టీఎంసీలుగా ఉండటంతో దిగువకు 45,031 టీఎంసీల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు ఉదయం 14 వేల క్యూసెక్కుల మేర నీటి ప్రవాహాలు రాగా అవి సాయంత్రానికి 22 వేలు, రాత్రికి 32 వేల క్యూసెక్కులకు పెరిగింది.
ప్రాజెక్టులో నీటి నిల్వ 9.66 టీఎంసీలకు గానూ 8.85 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నుంచి బీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ఎత్తిపోతలు, జూరాల కాల్వలకు 3,973 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, పవర్‌హౌస్‌ల ద్వారా 23,501 క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఈ నీరంతా శ్రీశైలం చేరుతోంది. శ్రీశైలానికి ప్రస్తుతం స్థానిక పరీవాహకం తోడు ఎగువ ప్రవాహాలు కలిపి నుంచి 15,394 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నిల్వ 215 టీఎంసీలకు గానూ 37.50 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు నిండాలంటే మరో 178 టీఎంసీలు అవసరం. గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో కేవలం 31.53 టీఎంసీలు మాత్రమే ఉండగా, ఈ ఏడాది కాస్త మెరుగ్గానే ఉంది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 312 టీఎంసీలకు గానూ 167.95 టీఎంసీల నీరుండగా, ఇక్కడ 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
శ్రీశైలం చేరిన కృష్ణమ్మ!
Published Wed, Jul 15 2020 5:36 AM | Last Updated on Wed, Jul 15 2020 7:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment