ఇచ్చంపల్లి నుంచే అనుసంధానం చేపడతామన్న కేంద్రం
సూత్రప్రాయంగా తెలంగాణ సర్కార్ అంగీకారం
హిమాలయ నదుల నీటిని ఎప్పుడు తెస్తారో చెప్పాలన్న ఏపీ ప్రభుత్వం
కృష్ణా జలాల్లో వాటా పెంచాలన్న కర్ణాటక, మహారాష్ట్ర
తక్షణమే చేపట్టాలన్న తమిళనాడు సర్కార్
ఎన్‌డబ్ల్యూడీఏ 75వ పాలకమండలి సమావేశం వివరాలు వెల్లడి
సాక్షి, అమరావతి: గోదావరి–కావేరి అనుసంధానానికి ముందడుగు పడింది. ఇచ్చంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీనికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీలను తాత్కాలికంగా తరలించేలా అనుసంధానం చేపడతామని చెబుతున్నారని, హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని తెచ్చాక వాటిని శాశ్వత ప్రాతిపదికన కావేరికి మళ్లిస్తామని అంటున్నారని, అసలు హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని ఎప్పుడు తెస్తారో చెప్పాలని కేంద్రాన్ని ఏపీ సర్కార్ కోరింది.
జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి 75వ సమావేశం ఈ నెల 1న కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అధ్యక్షతన జరిగింది. అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ కార్యదర్శులు పాల్గొన్న ఈ సమావేశంలో గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించారు. ఆ వివరాలను పాలకమండలి విడుదల చేసింది.
రాష్ట్రాల సమ్మతి ప్రకారమే..
ఇంద్రావతి సబ్ బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 148 టీఎంసీల గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్(కృష్ణా), సోమశిల(పెన్నా), అరణియార్ రిజర్వాయర్‌ల మీదుగా కావేరికి గోదావరి జలాలను తరలించేలా 2022లో ఎన్‌డబ్ల్యూడీఏ డీపీఆర్‌ను రూపొందించింది. అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామని పేర్కొంది. కావేరికి తరలించే 148 టీఎంసీల గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు కలిపి మొత్తం 166.5 టీఎంసీల్లో... తెలంగాణకు 43.65, ఆంధ్రప్రదేశ్‌కు 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామని తెలిపింది. దీనివల్ల 6,78,797 హెక్టార్లకు సాగునీరు, తాగునీటిని అందించవచ్చని పేర్కొంది.
ఈ డీపీఆర్‌పై బేసిన్‌లోని రాష్ట్రాలతో కేంద్రం పలుమార్లు సంప్రదింపులు జరిపింది. తాజా సమావేశంలో ఇంద్రావతి సబ్ బేసిన్‌లో ట్రిబ్యునల్ కేటాయించిన జలాలను తాము వాడుకుంటామని.. అదనంగా ఉన్న నీటిని కావేరికి మళ్లిస్తే తమకు అభ్యంతరం లేదని ఛత్తీస్‌గఢ్ పేర్కొంది. ఈ అనుసంధానానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అనుసంధానం ద్వారా మళ్లించే జలాల్లో 50 శాతం తమకు కేటాయించాలని కోరింది. గోదావరిలో నికర జలాల్లో మిగులు లేదని.. తాత్కాలికంగా ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని నీటినే కావేరికి తరలిస్తామని కేంద్రం చెబుతోంది.
హిమాలయ నదుల నుంచి గోదావరికి నీటిని తెచ్చాక.. ఆ నీటిని శాశ్వత ప్రాతిపదికన కావేరికి మళ్లిస్తామని అంటోంది. ఈ నేపథ్యంలో హిమాలయ నదుల నీటిని గోదావరికి ఎప్పుడు తెస్తారో చెప్పాలని ఏపీ కోరింది. లేదంటే తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని తెలిపింది. కృష్ణా జలాల్లో తమకు అదనపు వాటా పెంచాలని కర్ణాటక, మహారాష్ట్ర డిమాండ్ చేశాయి. తక్షణమే అనుసంధానం చేపట్టాలని తమిళనాడు, పుదుచ్చేరి కోరగా.. కావేరి జలాల్లో అదనపు వాటా కావాలని కేరళ డిమాండ్ చేసింది. బేసిన్‌లోని రాష్ట్రాల సమ్మతి, ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారమే ఈ అనుసంధానం చేపడతామని కేంద్రం స్పష్టం చేసింది.


