ఏపీకి కోత విధించి మాకు పెంచండి | 'Cut water releases to Andhra pradesh and give us' | Sakshi
Sakshi News home page

ఏపీకి కోత విధించి మాకు పెంచండి

Published Wed, Aug 28 2013 2:05 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

'Cut water releases to Andhra pradesh and give us'

కృష్ణా నీటి కేటాయింపులపై ఎగువరాష్ట్రాల క్రూరత్వం
ట్రిబ్యునల్ ముందు కర్ణాటక, మహారాష్ట్రల అడ్డగోలు వాదనలు
నీళ్లు మా వద్దే ఎక్కువ ఉన్నాయి...మాకే ఎక్కువ కోటాను ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాలు వద్దు.. ఏళ్ల తరబడి ఎక్కువగా వాడుకుంది

ఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
నీటి వాడకంలో రాష్ట్రాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో ఎగువ రాష్ట్రాలు మరో కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చాయి. కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు నదిలో నీటి లభ్యత కూడా తమ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నందున ఆ మేరకు తమకు నీటి కేటాయింపులు పెంచాలని కర్ణాటక, మహారాష్ట్రలు ట్రిబ్యునల్‌ను కోరాయి. ఆంధ్రప్రదేశ్‌లో నదీ పరివాహక ప్రాంతం తక్కువగా ఉన్నందున ఆ మేరకు నీటి కేటాయింపులను కుదించాలని వాదించాయి. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పును సవరించాలని కోరాయి. అందులో భాగంగా మిగులు జలాల్లో రాష్ట్రానికి కేటాయించిన కోటాలో కోత విధించాలన్నాయి. చైర్మన్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ డి.కె.సేథ్, జస్టిస్ బి.పి.దాస్‌లతో కూడిన కృష్ణా ట్రిబ్యునల్ ముందు కృష్ణా నీటి పంపిణీ వివాదాలపై మంగళవారం ఆ రాష్ట్రాలు వాదనలు విన్పించాయి. ముందుగా కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాదులు ఫాలి ఎస్ నారిమన్, జావళిలు వాదనలు విన్పించారు. కృష్ణానదిలో 75 శాతం డి పెండబులిటీ ప్రకారం మొత్తం 2,130 టీఎంసీల నీరు ఉంటే....ఆంధ్రప్రదేశ్ భూ భాగంలో కేవలం 352 టీఎంసీల నీటి లభ్యతే ఉందన్నారు. మిగిలిన 1,778 టీఎంసీల నీరు కర్ణాటక, మహారాష్ర్టల్లోనే ఉందని వాదించారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు, రెండు ఎగువ రాష్ట్రాలకు 1,319 టీఎంసీలను కేటాయించారని పేర్కొన్నారు. అలాగే కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో 49 వే ల చదరపు కిలోమీటర్ల మేర కరువు ప్రాంతం ఉంటే...కర్ణాటకలో 52 వేల చదరపు కిలోమీటర్ల మేర కరువు ప్రాంతం ఉందని వాదించారు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని కర్ణాటకకు నీటి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాల కేటాయింపును కూడా తగ్గించాలని కర్ణాటక డిమాండ్ చేసింది. మొత్తం 448 టీఎంసీల మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 190 టీఎంసీలు, కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్ర్టకు 81 టీఎంసీలను కేటాయించారని గుర్తుచేస్తూ, ఈ కేటాయింపుల్లో మార్పులు చేయాలని కోరారు. తమకు 203 టీఎంసీల మిగులు జలాలను కేటాయించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ గత 35 ఏళ్లలో 17 ఏళ్లపాటు 900 టీఎంసీలకు మించి, మరో 8 ఏళ్లు 800 టీఎంసీలకు మించి నీటిని ఉపయోగించుకుందని చెప్పారు. ఆర్డీఎస్‌కు 7 టీఎంసీలు అవసరం లేదని, దానిని 3 మూడు టీఎంసీలకు కుదించాలని కోరారు. ఆలమట్టి ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుకునే విషయంలో మళ్లీ కేంద్రం నుంచి కొత్తగా అనుమతులను తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆ మేరకు ఇదే ట్రిబ్యునల్ ఆదేశాలను ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసినట్టుగా దండావతి ప్రాజెక్టుపై ట్రిబ్యునల్ సూచనలను ఉల్లంఘించడం లేదని చెప్పింది. మహారాష్ర్ట తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది నాగోల్కర్ కూడా దాదాపు కర్ణాటక వాదననే ఏకరువు పెట్టారు. తమ రాష్ట్రంలో ఎక్కువ నీటి లభ్యత ఉన్నా కేటాయింపులు తక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
 ఎటూ తేలని కొత్త ప్రతిపాదన: ఎగువ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 459 టీఎంసీల నీటిని విడుదల చేసిన తర్వాత ఎగువ రాష్ట్రాలు కృష్ణానీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చన్న ట్రిబ్యునల్ ప్రతిపాదనపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. సోమవారం సాయంత్రం జరిగిన మూడు రాష్ట్రాల ఇంజనీర్ల సమావేశం వివరాలను మంగళవారం నాడు ట్రిబ్యునల్‌కు తెలియజేశారు. మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదిరే పరిస్థితి కనిపించడం లేదనే న్యాయవాదులు ట్రిబ్యునల్‌కు చెప్పారు. ఈ విషయంపై కూడా కర్ణాటక న్యాయవాది కొంతసేపు వాదించారు. ట్రిబ్యునల్ సూచించిన విధంగా 459 టీఎంసీల నీటిని ముందే దిగువకు విడుదల చేయడానికి తాము సిద్ధంగా లేమన్నారు. తమకు కేటాయించిన కేటాయింపులను పూర్తిగా వాడుకున్న తర్వాతనే దిగువకు నీటిని ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో ట్రిబ్యున లే ఒక పరిష్కార మార్గాన్ని సూచించాలన్నారు.
నేతలు రాజకీయ జంతువులు: నారిమన్
నీటి కోసం అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి ఉందంటూ.. రాజకీయ నాయకులను రాజకీయ జంతువులుగా (పొలిటికల్ యానిమల్స్) నారిమన్ అభివర్ణించారు. వారిలో ఏకాభిప్రాయం కుదర దని, అధికార పక్షం ఒక నిర్ణయం తీసుకుంటే...ప్రతిపక్షం వ్యతిరేక నిర్ణయానికి వస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది సుదర్శన్‌రెడ్డి గురువారం వాదనలు వినిపించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement