water share
-
కృష్ణా, గోదావరిలో వాటా సాధిస్తాం
సాక్షి,పరిగి: ఉమ్మడి జిల్లాకు కృష్ణా, గోదావరి జలాలు సాధించే వరకు చేవెళ్ల జలసాధన సమితి పోరాటం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు కృష్ణా, గోదావరి జలాలు రాకుండా కుట్రలు చేస్తున్న కేసీఆర్ ఇక్కడి రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాకు రెండు నదుల నుంచి 20 టీఎంసీలు సాధించేందుకు క్షేత్రస్థాయి నుంచి పార్టీల రహితంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.దివంగత వైఎస్సార్ జిల్లాను సస్యశ్యామలం చేసేందకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీలు, పాలమూరు ఎత్తిపోతల నుంచి 10 టీఎంసీల నీళ్లు కేటాయించారని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రాణహితను దూరం చేసి పాలమూరు ఎత్తిపోతల నుంచి రావాల్సిన నీటి వాటాను 10 టీఎంసీల నుంచి 2.8 టీఎంసీలకు కుదించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ పక్క సాగు నీటి ప్రాజెక్టులు జిల్లాకు దూరం చేస్తూ టీఆర్ఎస్ సర్కారు మోసం చేస్తుంటే మరోవైపు రంజిత్‌రెడ్డి సాగునీరు తెస్తాడంటా.. అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రాణహిత –చేవెళ్ల ప్రాజుక్టు డిజైన్ మార్చి ద్రోహం చేసింది సీఎం కాదా...? అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో ఎవరూ లేరని వరంగల్ జిల్లా నాయకుడిని ఎంపీ అభ్యర్థిగా దిగుమతి చేసుకున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అతిథిలాగా ఎన్నికలప్పుడే కనిపిస్తారని ఆరోపించారు. ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన సీఎం మళ్లీ ఈ ఎన్నికల్లో కనిపించారని ఎద్దేవా చేశారు. మోసం చేసిన టీఆర్ఎస్కు ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ...నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. చార్మినార్ జోన్లో కలపాలని ఉద్యమిస్తే పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల సమయంలో సమస్యను పరిష్కరిస్తానని మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. సంగారెడ్డికి, చార్మినార్‌కు, వికారాబాద్‌కు జోగులాంబకు సంబంధమేంటని ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుభాష్‌చందర్‌రెడ్డి, కొమిరె లక్ష్మయ్య, నారాయణ్‌రెడ్డి, లాల్‌కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సీమ ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వ నిర్లక్ష్యం
- మేల్కోకపోతే రైతులకు కన్నీళ్లే - సీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ఉయ్యాలవాడ : కరువు కోరల్లో చిక్కుకున్న రాయలసీమకు నీటి వాటాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. సీమలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఆదివారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న నంద్యాల పట్టణంలో తలపెట్టిన జలచైతన్య సభను విజయవంతం చేయాలని కోరారు. నీటి వాటాలపై చట్టబద్ధత కోసం పార్టీలకతీతంగా పోరాటానికి రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కృష్ణా జలాల పంపకాల్లో సీమకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర విభజనతో మరుగున పడిన దుమ్మగూడెం ప్రాజెక్ట్ చేపడితే సీమకు 165 టీఎంసీ నీరు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత పాలకుల స్వార్థ రాజకీయాలతో రాబోయే కాలంలో ప్రజలు నీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జల చైతన్య సభకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలన్నారు. కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు ఆరికట్ల విజయభాస్కర్‌రెడ్డి, వైఎన్‌రెడ్డి, ఉయ్యాలవాడ, అల్లూరు, నర్సిపల్లె గ్రామాల సర్పంచ్‌లు మిద్దెసుబ్బరాయుడు, ఆరికట్ల శివరామకృష్ణారెడ్డి, పల్లెమద్దిలేటిరెడ్డి, ఉప సర్పంచ్ కూలూరు రామకృష్ణారెడ్డి, దండే ఆదినారాయణరెడ్డి, ఖాతా దస్తగిరిరెడ్డి, గాండ్లశేషయ్య పాల్గొన్నారు. -
నీటి వాటా రాబట్టడంలో సీఎం విఫలం
– నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు ఖాయం – వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కల్లూరు (రూరల్): తుంగభద్ర, కృష్ణా నదుల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను రాబట్టడంలో సీఎం చంద్రబాబునాయుడు ఘోరంగా విఫలమయ్యారని వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శనివారం టీజే కాంప్లెక్స్‌లో పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఎంపీ బుట్టారేణుక ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడితోపాటు పార్టీ ఏపీ, టీఎస్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు బీ.వై.రామయ్య, మతీన్ ముజాద్దీన్, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, రాష్ట్ర సెల్ ఎస్సీ సెల్ కార్యదర్శి మద్దయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నంద్యాల ఎమ్మెల్యే సీటు ఎవరికిచ్చినా వారిని సాదరంగా ఆహ్వానించి గెలిపించుకుంటామని చెప్పారు. సీఎం చంద్రబాబు అసమర్థ పాలనలో కర్నూలు, పాణ్యం ప్రజలు కన్నీటి కష్టాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే మంచినీళ్లు సరఫరా చేయించడం లేదని ఆరోపించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేయండి హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ పార్టీని బూత్ లెవల్ నుంచి పటిష్టం చేసేందుకు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నగర ప్రజలు తాగునీటి సమస్యతో తల్లడిల్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట దోమల బెడద తీవ్రంగా ఉందని, దోమలపై దండయాత్ర కార్యక్రమం శుద్ధ దండగన్నారు. రాయలసీమ జిల్లాలో తమ పార్టీ ఎంత బలంగా ఉందో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డిని భారీ విజయంతో తేటతెల్లమైందన్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయకుమారి, సలోమి, మాజీ కార్పొరేటర్ దాదామియ్యా, బీకె రాజశేఖర్, పేలాల రాఘవేంద్ర, మాలిక్, జాన్, షోయబ్, హరికృష్ణ, కరుణాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, అశోక్, మహిళా నేతలు షఫియాఖాతున్, వాహిదా, విజయలక్ష్మీ, మంగమ్మ, చెన్నమ్మ, వెంకటేశ్వరమ్మ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు సోమసుందరం, గంగిరెద్దుల రాష్ట్ర అధ్యక్షుడు సీతయ్య పాల్గొన్నారు. -
ఏపీకి కోత విధించి మాకు పెంచండి
కృష్ణా నీటి కేటాయింపులపై ఎగువరాష్ట్రాల క్రూరత్వం ట్రిబ్యునల్ ముందు కర్ణాటక, మహారాష్ట్రల అడ్డగోలు వాదనలు నీళ్లు మా వద్దే ఎక్కువ ఉన్నాయి...మాకే ఎక్కువ కోటాను ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాలు వద్దు.. ఏళ్ల తరబడి ఎక్కువగా వాడుకుంది ఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి నీటి వాడకంలో రాష్ట్రాన్ని కట్టడి చేసే ఉద్దేశంతో ఎగువ రాష్ట్రాలు మరో కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చాయి. కృష్ణా పరివాహక ప్రాంతంతో పాటు నదిలో నీటి లభ్యత కూడా తమ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నందున ఆ మేరకు తమకు నీటి కేటాయింపులు పెంచాలని కర్ణాటక, మహారాష్ట్రలు ట్రిబ్యునల్‌ను కోరాయి. ఆంధ్రప్రదేశ్‌లో నదీ పరివాహక ప్రాంతం తక్కువగా ఉన్నందున ఆ మేరకు నీటి కేటాయింపులను కుదించాలని వాదించాయి. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పును సవరించాలని కోరాయి. అందులో భాగంగా మిగులు జలాల్లో రాష్ట్రానికి కేటాయించిన కోటాలో కోత విధించాలన్నాయి. చైర్మన్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ డి.కె.సేథ్, జస్టిస్ బి.పి.దాస్లతో కూడిన కృష్ణా ట్రిబ్యునల్ ముందు కృష్ణా నీటి పంపిణీ వివాదాలపై మంగళవారం ఆ రాష్ట్రాలు వాదనలు విన్పించాయి. ముందుగా కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాదులు ఫాలి ఎస్ నారిమన్, జావళిలు వాదనలు విన్పించారు. కృష్ణానదిలో 75 శాతం డి పెండబులిటీ ప్రకారం మొత్తం 2,130 టీఎంసీల నీరు ఉంటే....ఆంధ్రప్రదేశ్ భూ భాగంలో కేవలం 352 టీఎంసీల నీటి లభ్యతే ఉందన్నారు. మిగిలిన 1,778 టీఎంసీల నీరు కర్ణాటక, మహారాష్ర్టల్లోనే ఉందని వాదించారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు, రెండు ఎగువ రాష్ట్రాలకు 1,319 టీఎంసీలను కేటాయించారని పేర్కొన్నారు. అలాగే కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్‌లో 49 వే ల చదరపు కిలోమీటర్ల మేర కరువు ప్రాంతం ఉంటే...కర్ణాటకలో 52 వేల చదరపు కిలోమీటర్ల మేర కరువు ప్రాంతం ఉందని వాదించారు. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని కర్ణాటకకు నీటి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాల కేటాయింపును కూడా తగ్గించాలని కర్ణాటక డిమాండ్ చేసింది. మొత్తం 448 టీఎంసీల మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 190 టీఎంసీలు, కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్ర్టకు 81 టీఎంసీలను కేటాయించారని గుర్తుచేస్తూ, ఈ కేటాయింపుల్లో మార్పులు చేయాలని కోరారు. తమకు 203 టీఎంసీల మిగులు జలాలను కేటాయించాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ గత 35 ఏళ్లలో 17 ఏళ్లపాటు 900 టీఎంసీలకు మించి, మరో 8 ఏళ్లు 800 టీఎంసీలకు మించి నీటిని ఉపయోగించుకుందని చెప్పారు. ఆర్డీఎస్కు 7 టీఎంసీలు అవసరం లేదని, దానిని 3 మూడు టీఎంసీలకు కుదించాలని కోరారు. ఆలమట్టి ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుకునే విషయంలో మళ్లీ కేంద్రం నుంచి కొత్తగా అనుమతులను తీసుకోవాల్సిన అవసరం లేదని, ఆ మేరకు ఇదే ట్రిబ్యునల్ ఆదేశాలను ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసినట్టుగా దండావతి ప్రాజెక్టుపై ట్రిబ్యునల్ సూచనలను ఉల్లంఘించడం లేదని చెప్పింది. మహారాష్ర్ట తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది నాగోల్కర్ కూడా దాదాపు కర్ణాటక వాదననే ఏకరువు పెట్టారు. తమ రాష్ట్రంలో ఎక్కువ నీటి లభ్యత ఉన్నా కేటాయింపులు తక్కువగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎటూ తేలని కొత్త ప్రతిపాదన: ఎగువ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 459 టీఎంసీల నీటిని విడుదల చేసిన తర్వాత ఎగువ రాష్ట్రాలు కృష్ణానీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవచ్చన్న ట్రిబ్యునల్ ప్రతిపాదనపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. సోమవారం సాయంత్రం జరిగిన మూడు రాష్ట్రాల ఇంజనీర్ల సమావేశం వివరాలను మంగళవారం నాడు ట్రిబ్యునల్‌కు తెలియజేశారు. మూడు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదిరే పరిస్థితి కనిపించడం లేదనే న్యాయవాదులు ట్రిబ్యునల్‌కు చెప్పారు. ఈ విషయంపై కూడా కర్ణాటక న్యాయవాది కొంతసేపు వాదించారు. ట్రిబ్యునల్ సూచించిన విధంగా 459 టీఎంసీల నీటిని ముందే దిగువకు విడుదల చేయడానికి తాము సిద్ధంగా లేమన్నారు. తమకు కేటాయించిన కేటాయింపులను పూర్తిగా వాడుకున్న తర్వాతనే దిగువకు నీటిని ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో ట్రిబ్యున లే ఒక పరిష్కార మార్గాన్ని సూచించాలన్నారు. నేతలు రాజకీయ జంతువులు: నారిమన్ నీటి కోసం అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి ఉందంటూ.. రాజకీయ నాయకులను రాజకీయ జంతువులుగా (పొలిటికల్ యానిమల్స్) నారిమన్ అభివర్ణించారు. వారిలో ఏకాభిప్రాయం కుదర దని, అధికార పక్షం ఒక నిర్ణయం తీసుకుంటే...ప్రతిపక్షం వ్యతిరేక నిర్ణయానికి వస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది సుదర్శన్‌రెడ్డి గురువారం వాదనలు వినిపించనున్నారు.