సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును అడ్డుకోవాలంటూ ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఈ నెల 31న ఆ రెండు రాష్ట్రాలతో సమావేశం కానుంది. పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లించనున్న 80 టీఎంసీల గోదావరి జలాలకు బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది.
ఇందులో మహారాష్ట్ర, కర్ణాటక వాటాలు పోను మిగిలిన 45 టీఎంసీలతో పాటు మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలు కలిసి మొత్తం 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ గతంలో తెలంగాణ జీవో జారీ చేసింది. ఈ జీవోపై ఏపీ చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల వాదనలు విని విచారణ ముగించింది. తీర్పు వెలువడాల్సి ఉంది.
అయితే ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో మహారాష్ట్ర, కర్ణాటకల వాటాలు పోగా మిగిలిన 45 టీఎంసీలపై ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి హక్కు ఉందని, తెలంగాణ ఆ నీళ్లను వినియోగించుకోవాలంటే విధిగా ఏపీతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని ఇటీవల కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలంగాణకు లేఖ రాసింది.
అయితే సాగర్ ఎగువన తెలంగాణలోనే కృష్ణా బేసిన్ ఉందని, అందువల్ల 45 టీఎంసీలు తమకే దక్కుతాయని తెలంగాణ వాదిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఏపీలో ఉందని, దాని ద్వారా తరలించనున్న 80 టీఎంసీలతో ఏపీలోని కృష్ణా డెల్టాకు ప్రయోజనం కలగనుందని, ఇందుకు బదులుగా కేటాయించిన కృష్ణా జలాల్లో తెలంగాణకు మాత్రమే హక్కు ఉంటుందని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి సమావేశాన్ని తలపెట్టడం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment