రెండు రోజుల్లో ఇసుక రిచ్ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కాలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు జేసీ శ్రీధర్ ఆదేశం
మున్నంగి(కొల్లిపర): రెండు రోజుల్లో ఇసుక రిచ్ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కాలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. మండలంలోని మున్నంగి గ్రామ సమీపంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ ద్వారా ఇసుక తవ్వకం పనులు చేపడుతున్న ప్రాంతాన్ని శ్రీధర్ బుధవారం పరిశీలించారు. రీచ్‌ను పరీశీలించిన అనంతరం జేసీ మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణా కరకట్ట వద్ద ఏర్పాటు చేస్తున్న రేకుల షెడ్డును నది ఒడ్డునే వేస్తే నిర్వహణకు బాగుంటుందని, వెంటనే దాని మార్పు చేయాలని ఏపీఎమ్ దుర్గాశ్రీనివాస్‌ను ఆదేశించారు. విద్యుత్ సౌకర్యాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కంప్యూటర్ ఆపరేషన్‌కు ఫోన్ సిగ్నల్స్ వస్తున్నాయో లేదో పరీక్షించారు.
ప్రభుత్వం కేటాయించిన ప్రాంతంలో ఇసుక తవ్వకం పనులు చేయాలని చెప్పారు. అంతర్గత రోడ్డు ఏర్పాటుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రెండు వేల క్యూబిక్ మీటర్‌ల ఇసుక తవ్వకం పనులు చేపట్టాలని చెప్పారు. రెండు రోజుల్లో ఇసుక త వ్వకం పనులు ప్రారంభమవుతాయి కాబట్టి డ్వాక్రా మహిళలు సిద్ధంగా ఉండాలని సూచించారు. స్థానిక పోలిస్‌స్టేషన్ నుంచి రోజు ఇద్దరు కానిస్టేబులు, ఒక్క హెడ్ కానిస్టేబులు ఇసుకరీచ్ వద్ద ఉండి వేబిల్లులను పరిశీలించి వాహనాలను పంపించే విధంగా కొల్లిపర పోలీసులు తెలియచేయమని తహశీల్దార్ ఎం.స్వామిప్రసాద్‌ను ఆదేశించారు.
ఇసుక తవ్వకం, లోడు చేసే జేసీబీలకు క్యూబిక్ మీటర్‌కు రూ.24 చొప్పున చెల్లించాలని ఆదేశించారు. జేసీ శ్రీధర్‌తో పాటు అడిషనల్ జాయింట్ కాలెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, డీపీవో జి.వీరయ్యచౌదరి, మైనింగ్ ఏడీ జగన్నాధరావు, డీఎల్‌పీవో సుబ్రమణ్యం, ఎంపీడీవో కె.ఉమామహేశ్వరరావు, మండల లెసైన్స్‌డ్ సర్వేయర్ బసవపున్నారెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం దుగ్గిరాల మండలం గొడవర్రు ఇసుక రిచ్‌ను పరిశీలించేందుకు వెళ్లారు.