జాబితా ప్రకటించిన బోర్డు.. రోజూ ఉమ్మడి ప్రకటన పంపాలని సూచన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు తెలంగాణ, ఏపీ అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీని ప్రకటించింది. కమి టీ ప్రతిరోజూ నీటి విడుదల, వినియోగంపై సంయుక్తంగా సంతకాలు చేసిన ప్రకటనను ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, బోర్డుకు పంపాలని ఆదేశించింది. టెలిమెట్రీ విధానం అమల్లోకి వచ్చే వరకు సంయుక్త పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సి ల్ భేటీలోనే నిర్ణయం జరిగినా దీనిపై బోర్డు తొలుత స్పందించలేదు.
అయితే సంయుక్త కమిటీ ఏర్పాటుపై రాష్ట్రం మరోసారి కేంద్ర జలవనరులశాఖకు నేరుగా లేఖ రాయడం తో బోర్డులో చలనం వచ్చింది. ఈ నేపథ్యం లో గత నెల 26న ఇరు రాష్ట్రాలకు కమిటీలో అధికారుల పేర్లు రెండు రోజుల్లో సూచించాలని పేర్కొంటూ లేఖలు రాసింది. తెలంగాణ 13 మంది ఇంజనీర్ల పేర్లను బోర్డుకు పంపించింది. శ్రీశైలం డ్యామ్, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కల్వకుర్తి పంప్‌హౌజ్‌ల వద్ద, సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వ, ఏఎంఆర్‌పీ వద్ద 8 ఇంజనీర్లను సూచించగా, జూరాలలో మాత్రం భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు లిఫ్టు, నెట్టంపాడు ఆఫ్‌టేక్, జూరాల కుడి, ఎడమ కాల్వల వద్ద కలిపి ఆరుగురు ఇంజనీర్లను సూచించింది.
కృష్ణా బోర్డు మళ్లీ లేఖ రాయడంతో ఏపీ సర్కారు మంగళవారం కమిటీ సభ్యుల పేర్లతో బోర్డు కు లేఖ రాసింది. దీంతో బోర్డు ఇరు రాష్ట్రాల అధికారుల పేర్లతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాత్రి ఇరు రాష్ట్రాలకు విడివిడిగా లేఖలు పంపింది. తొలి విడతగా శ్రీశైలం, సాగర్‌ల వద్ద సూచించిన 8 చోట్ల సంయుక్త కమిటీని నియమించింది. కమిటీలు తక్షణమే పని ప్రారంభించాలని ఆదేశించింది.
‘కృష్ణా’పై సంయుక్త కమిటీలు
Published Wed, Oct 5 2016 2:16 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
Advertisement