Central Water Resources Department
-
రాజధానిలోనే అధిక నీటి వినియోగం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మొత్తంలో రాజధాని హైదరాబాద్ భూగర్భ జలాల వినియోగంలో తొలి స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఏకంగా భూగర్భ జల వినియోగం 341 శాతంగా ఉంది. రాష్ట్ర సరాసరి వినియోగం 65 శాతం ఉండగా, దానికి ఐదింతలు ఎక్కువగా హైదరాబాద్‌లో వినియోగం ఉన్నట్లు భూగర్భజల శాఖ ఓ నివేదికలో వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో మల్కాజ్గిరి (94 శాతం), సిద్దిపేట (94 శాతం), మేడ్చల్ (92 శాతం), వరంగల్ అర్బన్ (91శాతం)గా ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తెలంగాణ భూగర్భ జల శాఖ, కేంద్ర జల వనరుల సంస్థల సమన్వయంతో రాష్ట్రంలో భూగర్భ జల వనరులు 2016–17 నీటి సంవత్సరానికి సంబంధించిన నివేదికను రూపొందించాయి. ఈ నివేదికను సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్, తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్, భూగర్భజల శాఖ డైరెక్టర్ డాక్టర్ పండిత్ మద్నూర్‌లు విడుదల చేశారు. రాష్ట్రాన్ని మొత్తంగా 502 గ్రౌండ్ వాటర్ బేసిన్లుగా విభజించి భూగర్భ జలాలను అంచనా వేశారు. ఇందులో 29 బేసిన్లు అత్యధిక భూగర్భ నీటిని వినియోగిస్తున్నట్లు తేల్చారు. 8,584 మండలాలకు 70 మండలాలు అత్యధిక భూగర్భ నీటిని వినియోగిస్తున్నాయని నివేదికలో పేర్కొన్నారు. అత్యధిక నీటి వినియోగం ఉన్న ప్రాంతాలు, మండలాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా జోషి అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. -
‘అహోబిలం’ ప్రాజెక్టును నిలిపివేయండి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాలను వాడుకుంటూ ఏపీ చేపట్టిన పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాన్ని నిలిపి వేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఎస్కే జోషి కేంద్ర జలవనరుల శాఖను కోరారు. దిగువనున్న తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్మాణాన్ని ఆపేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని విన్నవించారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలోని రాజోలిబండ మళ్లింపు పథకం పూర్తిగా తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉందన్నారు. ఇక కృష్ణా ప్రవాహాలకు తుంగభద్ర ప్రధాన నీటి వనరని , కృష్ణా జలాలపై రాష్ట్రంలో కల్వకుర్తి ఎత్తిపోతల, ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ, నాగార్జునసాగర్ ఎడమ కాల్వతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తుంగభద్ర నుంచి 40 టీఎంసీల నీటిని తీసుకుంటూ ఏపీ అనంతపురం నీటి అవసరాల కోసం పెన్నా అహోబిలం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని, దీనివల్ల దిగువనున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపారు. ఇదే విషయమై మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
గోదావరి ఉగ్రరూపం
భద్రాచలం/నిజామాబాద్ అర్బన్: భద్రాచలం వద్ద గోదావరి నది పోటెత్తుతోంది. మంగళవారం రాత్రి 50 అడుగులకు చేరువైంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ ప్రాంతంలోని కాళేశ్వరం, పాతగూడెం, ఏటూరునాగారం వద్ద భారీగా వరద ఉధృతి ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో.. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలైన జిల్లాలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గుంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భూపాలపల్లి జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాలకు కూడా వరద తాకిడి తీవ్రంగానే ఉంది. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి వరద నీరు ఉధృతంగా వస్తుండటం, దిగువన ఉన్న శబరి నది కూడా ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం వద్ద బుధవారం నాటికి నీటి మట్టం 53 అడుగులకు చేరుకోవచ్చని, మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత వరద ప్రవాహంతో భద్రాచలం నుంచి చర్ల, వాజేడు రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 50 అడుగులు దాటితే దారులన్నీ మూసుకుపోయే ప్రమాదం ఉంది. చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ఐదు అడుగుల మేర నిల్వ ఉండటంతో చింతూరు, ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. నిజామాబాద్‌లో దెబ్బతిన్న 601 ఇళ్లు నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల 601 ఇళ్లు దెబ్బతిన్నాయి. అధికారులు రెండు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్పహాడ్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 150 మందికి వసతి కల్పించారు. నిజామాబాద్ నగర శివారు ప్రాంతమైన గూపన్పల్లిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి 60 మందికి వసతి కల్పించారు. జిల్లా వ్యాప్తంగా 168 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. రూ. మూడున్నర కోట్ల నష్టం వాటిల్లింది. గుండారం వద్ద వరదలకు రోడ్డు తెగిపోయింది. సిరికొండ మండలం తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. నవీపేట మండలం జన్నేపల్లి గ్రామ సమీపంలో ఉన్న డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. -
ఏపీ ప్రభుత్వం డీపీఆర్ మార్చడంపై గడ్కరీ ఆరా
-
ఇదేమి అంచనా?
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెబితేనే.. అంచనా వ్యయంలో సవరించిన ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తుందని మసూద్ హుస్సేన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తాజాగా తేల్చిచెప్పింది. 2015–16 ధరలతో పోలిస్తే.. 2013–14 ధరల ఆధారంగా రూపొందించిన ప్రతిపాదనల్లో అంచనా వ్యయం ఎక్కువగా చూపడాన్ని సీడబ్ల్యూసీ తప్పుపట్టింది. హెడ్‌వర్క్స్, భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ తదితర అంశాల వ్యయాన్ని ఒకేసారి రూ.30,924.03 కోట్లు పెంచేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనల్లో తప్పులను సీడబ్ల్యూసీ ఇప్పటికే బహిర్గతం చేసింది. ఫిబ్రవరి 19న ఒకసారి, మార్చి 6వ తేదీన మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రాతిపాదనలను తిప్పిపంపింది. తాము సంధించిన ప్రశ్నలకు ఆధారాలతో సహా సరైన వివరణ ఇస్తేనే సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. రెండున్నరేళ్ల తర్వాత ప్రతిపాదనలు సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల విషయంలో సీడబ్ల్యూసీ ప్రశ్నలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ స్పందించడం లేదు. ఈ నెల 17, 18 తేదీల్లో పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించిన మసూద్ హుస్సేన్ కమిటీ ఈ నెల 21వ తేదీన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇచ్చింది. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇస్తేనే సవరించిన వ్యయ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆ నివేదికలో మరోసారి స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. కాగా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) తొలి సమావేశం 2015 మార్చి 12న జరిగింది. తాజా ధరల మేరకు ప్రాజెక్టులో సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను తక్షణమే పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ, రెండున్నరేళ్ల తర్వాత అంటే 2017 ఆగస్టు 16న ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.58,319.06 కోట్లకు పెంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపింది. వీటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ తీవ్రమైన అభ్యంతరాలను లేవనెత్తుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నాస్త్రాలను సంధించింది. సీడబ్ల్యూసీ లేవనెత్తిన ప్రశ్నలు.. - పోలవరం ప్రాజెక్టు ప్రధాన జలాశయం (హెడ్ వర్క్స్) అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం రూ.5,535.41 కోట్లకు పెంచుతూ 2016 సెప్టెంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, 2013–14 ధరల ఆధారంగా రూపొందించి సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లో రూ.11,637.98 కోట్లుగా పేర్కొన్నారు. 2015–16 ధరలతో పోల్చితే 2013–14 ధరలతో రూపొందించిన అంచనా వ్యయం తక్కువగా ఉండాలి. కానీ, అధికంగా ఉండటానికి కారణాలు ఏమిటి? - కుడి కాలువ అంచనా వ్యయం 2015–16 ధరల ప్రకారం రూ.4,375.77 కోట్లుగా నిర్ధారిస్తూ 2016 డిసెంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013–14 ధరల ప్రకారం రూపొందించిన సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనల్లో కుడి కాలువ వ్యయాన్ని రూ.3,645.15 కోట్లుగా పేర్కొంది. అలాగే ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం రూ.3,645.15 కోట్లుగా ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2013–14 ధరల ఆధారంగా దాని వ్యయం తగ్గాలి. కానీ, రూ.4,960.83 కోట్లకు వ్యయం ఎలా పెరిగింది? - పోలవరం జలాశయం, కుడి, ఎడమ కాలువలకు భూసేకరణ చట్టం–2013 అమల్లోకి రాక ముందు ఎంత భూమి సేకరించారు? ఆ తర్వాత ఎంత సేకరించారు? ఇందులో అసైన్డ్, సీలింగ్, దేవాదాయ, గిరిజనుల భూముల విస్తీర్ణం ఎంత? - 2010–11 ధరల ప్రకారం భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అంచనా వ్యయం రూ.2,934.42 కోట్లే. కానీ, 2013–14 ధరల ప్రకారం ఆ మొత్తాన్ని రూ.33,858.45 కోట్లకు పెంచేశారు. వ్యయం ఒకేసారి రూ.30,924.03 కోట్లు ఎందుకు పెరిగింది? స్పందించని ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల్లో అంచనా వ్యయం పెంపు, టెండర్లు తదితర అంశాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువ అంచనా వ్యయాన్ని 2015–16 ధరల ప్రకారం పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులకు పీపీఏ అనుమతి లేదు. ఇదే అంశాన్ని సీడబ్ల్యూసీ తప్పుబట్టడం, ఈ వ్యవహారంలో అక్రమాల గుట్టు రట్టయ్యే అవకాశం ఉండటంతో రాష్ట్ర సర్కార్ ఆందోళన చెందుతోంది. భూసేకరణలో చోటుచేసుకున్న అవకతవకలు బహిర్గతమయ్యే ప్రమాదం ఉందని భయపడుతోంది. అందుకే సీడబ్ల్యూసీ సంధించిన ప్రశ్నలపై స్పందించడం లేదని తెలుస్తోంది. -
దక్షిణాది ఇరిగేషన్ మంత్రుల భేటీ
సాక్షి, హైదరాబాద్: దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ శాఖల మంత్రుల సమావేశం ఈనెల 20న హైదరాబాద్‌లో జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి అర్జున్‌రాం మేఘవాల్ నేతృత్వంలో జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు పాల్గొననున్నారు. ఇందులో ప్రధానంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటకల్లోని కావేరి వరకు అనుసంధానం చేపట్టాలని కేంద్రం తొలుత నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు భిన్నంగా కొత్త ప్రత్యామ్నాయాన్ని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చింది. తెలంగాణలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందనీ, దీనికి ప్రత్యామ్నాయంగా గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని కేంద్రం సూచిస్తోంది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరికి తరలించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇదివరకే కేంద్రం ఓమారు సమావేశం నిర్వహించగా, నీటి లభ్యత, ముంపు తదితర అంశాలపై అనేక అనుమానాలు లేవనెత్తింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరింది. అయితే దీనిపై మరింత అధ్యయనం, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్న కేంద్రం 20న దక్షిణాది రాష్ట్రాలతో భేటీ ఏర్పాటు చేసింది. -
‘గ్యాప్’ పెరిగింది!
- పూర్తయిన ప్రాజెక్టుల కింద ఆయకట్టు 24.68 లక్షల ఎకరాలు - వాస్తవంగా సాగవుతోంది 18.91 లక్షల ఎకరాల్లోనే - ఈ గ్యాప్ పూడ్చేందుకు 36 ప్రాజెక్టులను క్యాడ్‌వామ్‌లో చేర్చాలి - కేంద్ర జల వనరుల శాఖకు రాష్ట్రం వినతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే నిర్వహణలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కింద వాస్తవ ఆయకట్టుకు, నీరందుతున్న ఆయకట్టుకు మధ్య అంతరం పెరుగుతోంది. కాల్వలు పూడుకుపోవడం, ఫీల్డ్ చానల్స్ దెబ్బతినడం, కాల్వలకు లైనింగ్ వ్యవస్థ లేకపోవడంతో నీటి వృథా కారణంగా చిరవరి ఆయకట్టు వరకు నీరందడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 36 భారీ, మథ్యతరహా ప్రాజెక్టుల కింద నిర్ణీత ఆయకట్టు 24.68 లక్షల ఎకరాలు ఉండగా, వాస్తవంగా నీరందుతున్న ఆయకట్టు 18.91 లక్షల ఎకరాలుగా ఉంది. గ్యాప్ ఆయకట్టు 5.77 లక్షల ఎకరాలు. ప్రస్తుతం దీన్ని పూడ్చాలని నిర్ణయించిన ప్రభుత్వం... కేంద్రం తీసుకొచ్చిన క్యాడ్‌వామ్ (కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్) కింద నిధులు రాబట్టేకునే వ్యూహాలు రచిస్తోంది. ప్రతి ప్రాజెక్టులో 25 శాతం ‘గ్యాప్’... ప్రతి ప్రాజెక్టు పరిధిలో 25 శాతం మేర గ్యాప్ ఆయకట్టు ఉంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే... సాగునీటి ప్రాజెక్టుల కింద నిర్ణయించిన ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు కేంద్ర జల వనరుల శాఖ క్యాడ్‌వామ్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఆమోదించిన పనులకు కేంద్రం 60 శాతం నిధులిస్తుంది. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. దీన్ని సరిచేసేందుకు కేంద్ర రూ.28వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ గ్యాప్ ఆయకట్టుకు సంబంధించి ప్రతిపాదనలు అందించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విన్నవించగా, రాష్ట్ర ప్రభుత్వం గత వారమే జూరాల, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు–1, అలీసాగర్, గుత్ప, డిండి, నిజాంసాగర్, ఆర్డీఎస్, కడెం, మూసీ, గుండ్లవాగు, ఆసిఫ్‌నహర్, కోటిపల్లివాగు, నల్లవాగు, ఘన్పూర్ ఆనకట్ట, పోచారం, కౌలాస్‌నాలా, సాత్నాల, స్వర్ణ, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, అప్పర్ మానేరు, శనిగరం, బొగ్గులవాగు, ముల్లూరువాగు, పాకాల చెరువు, పెద్దవాగు, సుద్దవాగు ప్రాజెక్టులను ఈ జాబితాలో చేర్చాలంటూ విన్నవించింది. వీటిపై ప్రస్తుతం కేంద్ర జల వనరుల శాఖ పరిశీస్తోంది. 11 ప్రాజెక్టులకు ఓకే... కాగా కేంద్ర ఇప్పటికే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద గుర్తించిన 11 ప్రాజెక్టులను క్యాడ్‌వామ్‌లో సైతం చేరుస్తూ కేంద్ర జల వనరుల శాఖ నిర్ణ యం చేసింది. ఇందిరమ్మ వరద కాల్వ, భీమా, దేవాదుల, నీల్వాయి, ర్యాలివా గు వంటి ప్రాజెక్టులకు క్యాడ్‌వామ్ కింద మొత్తంగా రూ.1928కోట్లు అవసరం అవుతాయని లెక్కించగా ఇందులో కేంద్రం 943.72 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 985.15కోట్లను సమకూర్చనుంది. -
‘కృష్ణా’పై సంయుక్త కమిటీలు
జాబితా ప్రకటించిన బోర్డు.. రోజూ ఉమ్మడి ప్రకటన పంపాలని సూచన సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల ద్వారా నీటి వినియోగాన్ని పర్యవేక్షించేందుకు తెలంగాణ, ఏపీ అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటైంది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇరు రాష్ట్రాల అధికారులతో కమిటీని ప్రకటించింది. కమి టీ ప్రతిరోజూ నీటి విడుదల, వినియోగంపై సంయుక్తంగా సంతకాలు చేసిన ప్రకటనను ఇరు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు, బోర్డుకు పంపాలని ఆదేశించింది. టెలిమెట్రీ విధానం అమల్లోకి వచ్చే వరకు సంయుక్త పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని అపెక్స్ కౌన్సి ల్ భేటీలోనే నిర్ణయం జరిగినా దీనిపై బోర్డు తొలుత స్పందించలేదు. అయితే సంయుక్త కమిటీ ఏర్పాటుపై రాష్ట్రం మరోసారి కేంద్ర జలవనరులశాఖకు నేరుగా లేఖ రాయడం తో బోర్డులో చలనం వచ్చింది. ఈ నేపథ్యం లో గత నెల 26న ఇరు రాష్ట్రాలకు కమిటీలో అధికారుల పేర్లు రెండు రోజుల్లో సూచించాలని పేర్కొంటూ లేఖలు రాసింది. తెలంగాణ 13 మంది ఇంజనీర్ల పేర్లను బోర్డుకు పంపించింది. శ్రీశైలం డ్యామ్, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కల్వకుర్తి పంప్‌హౌజ్‌ల వద్ద, సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వ, ఏఎంఆర్పీ వద్ద 8 ఇంజనీర్లను సూచించగా, జూరాలలో మాత్రం భీమా, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు లిఫ్టు, నెట్టంపాడు ఆఫ్టేక్, జూరాల కుడి, ఎడమ కాల్వల వద్ద కలిపి ఆరుగురు ఇంజనీర్లను సూచించింది. కృష్ణా బోర్డు మళ్లీ లేఖ రాయడంతో ఏపీ సర్కారు మంగళవారం కమిటీ సభ్యుల పేర్లతో బోర్డు కు లేఖ రాసింది. దీంతో బోర్డు ఇరు రాష్ట్రాల అధికారుల పేర్లతో కమిటీని ఏర్పాటు చేస్తూ రాత్రి ఇరు రాష్ట్రాలకు విడివిడిగా లేఖలు పంపింది. తొలి విడతగా శ్రీశైలం, సాగర్ల వద్ద సూచించిన 8 చోట్ల సంయుక్త కమిటీని నియమించింది. కమిటీలు తక్షణమే పని ప్రారంభించాలని ఆదేశించింది. -
నెత్తురు, నీళ్లు కలసి ప్రవహించలేవు
పాక్‌తో సింధు నీటి ఒప్పందం సమీక్షలో ప్రధాని మోదీ - పాకిస్తాన్ నియంత్రణలోని నదుల నీటిని గరిష్టంగా - వాడాలని నిర్ణయం ఒప్పంద అధ్యయనానికి టాస్క్‌ఫోర్స్ న్యూఢిల్లీ: పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న నదుల నీటి ని గరిష్టంగా వినియోగించుకోవాలని భారత్ నిర్ణయించింది. 56 ఏళ్ల నాటి భారత్-పాక్ సింధు జలాల ఒప్పందంపై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. నెత్తురు, నీళ్లు ఒకేసారి ప్రవహించలేవంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు, సాగునీరు, నిల్వ కోసం ఇక నుంచి సింధు, చీనాబ్, జీలం నదుల్లోంచి గరిష్ట స్థాయి నీటిని వినియోగించాలంటూ భేటీలో అవగాహనకు వచ్చారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం పాక్‌పై ఎదురుదాడిని ఉధృతం చేయాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ భేటీ నిర్వహించారు. నదీ జలాల ఒప్పందంపై పూర్తి వివరాల అధ్యయనానికి అంతర్ మంత్రిత్వ టాస్క్‌ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఒప్పందం పూర్తిస్థాయిలో తక్షణం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. టాస్క్‌ఫోర్స్ బృందంలో జలవనరులు, విదేశాంగ, విద్యుత్, ఆర్థిక శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. తూర్పుకు ప్రవహించే నదుల్లో(సింధు, చినాబ్, జీలం) భారత్ హక్కులపై బృందం అధ్యయనం చేస్తుంది. చీనాబ్‌పై పాకల్‌డల్, సవాల్కోట్, బుర్సార్ డ్యాంల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్, జలవనరుల కార్యదర్శితో పాటు పీఎంఓ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సింధు ఒప్పందం, నదులపై ఉన్న ప్రాజెక్టుల వివరాలను కేంద్ర జలవనరుల శాఖ అధికారులు ప్రధానికి కూలంకషంగా వివరించారు. భవిష్యత్తులో ‘ఇండస్ వాటర్ కమిషన్’ సమావేశాలు ఉగ్రవాద రహిత వాతావరణంలోనే సాధ్యమంటూ భేటీలో అవగాహనకు వచ్చారు. అలాగే 1987 నాటి టుల్బుల్ నావికా మార్గం రద్దుపై సమీక్షించాలని కూడా నిర్ణయించారు. 2007లో ఈ ప్రాజెక్టును రద్దు చేశారు. భారత్, పాక్‌ల మధ్య నదీ జలాల ఒప్పందం తమకు అనుకూలంగా లేదని గతంలో జమ్మూ కశ్మీర్ ప్రజల ఫిర్యాదు నేపథ్యంలో తాజా నిర్ణయాలతో సమాధానం దొరుకుతుందని భావిస్తున్నారు. ఒప్పందం ఇదీ.. 1960లో అప్పటి ప్రధాని నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సింధు(ఇండస్) జలాల ఒప్పందంపై సంతకం చేశారు. దాని ప్రకారం భారత్.. బియాస్, రావి, సట్లేజ్ నదుల నీటిని, పాక్ సింధు, చీనాబ్, జీలంల నీటిని వాడుకోవాలి. 9.12 లక్షల ఎకరాలకు సరిపడా సాగునీటిని భారత్ వాడుకోవచ్చు. దీన్ని మరో 4.2 లక్షల ఎకరాలకు విస్తరించవచ్చు. భారత్ 8 లక్షల ఎకరాలకు సరిపడా నీటినే వాడుతోంది. అలాగే భారత్ 18,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 3,034 మెగావాట్లే ఉత్పత్తి చేస్తోంది. మరో 2,526 మెగావాట్ల ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. 5,846 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతి తుది దశలో ఉంది. తమకు తగినంత నీరు రావడం లేదంటూ పాక్ చాలాసార్లు అంతర్జాతీయ కోర్టుకెక్కింది.