- పూర్తయిన ప్రాజెక్టుల కింద ఆయకట్టు 24.68 లక్షల ఎకరాలు
- వాస్తవంగా సాగవుతోంది 18.91 లక్షల ఎకరాల్లోనే
- ఈ గ్యాప్ పూడ్చేందుకు 36 ప్రాజెక్టులను క్యాడ్‌వామ్‌లో చేర్చాలి
- కేంద్ర జల వనరుల శాఖకు రాష్ట్రం వినతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే నిర్వహణలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కింద వాస్తవ ఆయకట్టుకు, నీరందుతున్న ఆయకట్టుకు మధ్య అంతరం పెరుగుతోంది. కాల్వలు పూడుకుపోవడం, ఫీల్డ్ చానల్స్ దెబ్బతినడం, కాల్వలకు లైనింగ్ వ్యవస్థ లేకపోవడంతో నీటి వృథా కారణంగా చిరవరి ఆయకట్టు వరకు నీరందడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 36 భారీ, మథ్యతరహా ప్రాజెక్టుల కింద నిర్ణీత ఆయకట్టు 24.68 లక్షల ఎకరాలు ఉండగా, వాస్తవంగా నీరందుతున్న ఆయకట్టు 18.91 లక్షల ఎకరాలుగా ఉంది. గ్యాప్ ఆయకట్టు 5.77 లక్షల ఎకరాలు. ప్రస్తుతం దీన్ని పూడ్చాలని నిర్ణయించిన ప్రభుత్వం... కేంద్రం తీసుకొచ్చిన క్యాడ్‌వామ్ (కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్) కింద నిధులు రాబట్టేకునే వ్యూహాలు రచిస్తోంది.
ప్రతి ప్రాజెక్టులో 25 శాతం ‘గ్యాప్’...
ప్రతి ప్రాజెక్టు పరిధిలో 25 శాతం మేర గ్యాప్ ఆయకట్టు ఉంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే... సాగునీటి ప్రాజెక్టుల కింద నిర్ణయించిన ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు కేంద్ర జల వనరుల శాఖ క్యాడ్‌వామ్ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఆమోదించిన పనులకు కేంద్రం 60 శాతం నిధులిస్తుంది. మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. దీన్ని సరిచేసేందుకు కేంద్ర రూ.28వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ గ్యాప్ ఆయకట్టుకు సంబంధించి ప్రతిపాదనలు అందించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విన్నవించగా, రాష్ట్ర ప్రభుత్వం గత వారమే జూరాల, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు–1, అలీసాగర్, గుత్ప, డిండి, నిజాంసాగర్, ఆర్డీఎస్, కడెం, మూసీ, గుండ్లవాగు, ఆసిఫ్‌నహర్, కోటిపల్లివాగు, నల్లవాగు, ఘన్‌పూర్ ఆనకట్ట, పోచారం, కౌలాస్‌నాలా, సాత్నాల, స్వర్ణ, వట్టివాగు, ఎన్టీఆర్ సాగర్, పీపీ రావు ప్రాజెక్టు, అప్పర్ మానేరు, శనిగరం, బొగ్గులవాగు, ముల్లూరువాగు, పాకాల చెరువు, పెద్దవాగు, సుద్దవాగు ప్రాజెక్టులను ఈ జాబితాలో చేర్చాలంటూ విన్నవించింది. వీటిపై ప్రస్తుతం కేంద్ర జల వనరుల శాఖ పరిశీస్తోంది.
11 ప్రాజెక్టులకు ఓకే...
కాగా కేంద్ర ఇప్పటికే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) కింద గుర్తించిన 11 ప్రాజెక్టులను క్యాడ్‌వామ్‌లో సైతం చేరుస్తూ కేంద్ర జల వనరుల శాఖ నిర్ణ యం చేసింది. ఇందిరమ్మ వరద కాల్వ, భీమా, దేవాదుల, నీల్వాయి, ర్యాలివా గు వంటి ప్రాజెక్టులకు క్యాడ్‌వామ్ కింద మొత్తంగా రూ.1928కోట్లు అవసరం అవుతాయని లెక్కించగా ఇందులో కేంద్రం 943.72 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం 985.15కోట్లను సమకూర్చనుంది.
‘గ్యాప్’ పెరిగింది!
Published Mon, Apr 10 2017 2:08 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM
Advertisement